యూకే చట్టసభకు నాగరాజు ఎన్నిక గర్వకారణం
హన్మకొండ : హనుమకొండకు చెందిన ఉదయ్ నాగరాజు యూనైటెడ్ కింగ్‌డమ్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ చట్ట సభకు శాశ్వత సభ్యుడిగా ఎంపిక కావడం రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణమని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. సోమవారం హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్‌లో ఉదయ్ నాగరాజును జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్, ప్రముఖులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత సంతతి వారు విదేశీ చట్టసభల్లో పాతినిథ్యం వహించడం వల్ల అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. సన్మాన గ్రహీత ఉదయ నాగరాజు మాట్లాడుతూ తాను హనుమకొండ నక్కలగుట్ట ప్రాంతంలో నివాసం ఉంటూ వరంగల్ పబ్లిక్ స్కూల్, సెయింట్ పీటర్స్ పాఠశాలల్లో చదువుకున్నానని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల నాణ్యమైన బోధనలు విద్యాపరంగా తనను మంచి విద్యార్థిగా ఎదగడానికి దోహదపడ్డాయన్నారు. ప్రముఖ న్యాయవాదులు వద్దిరాజు వెంకటేశ్వరరావు, వద్దిరాజు గణేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌డీఐ జాతీయ అధ్యక్షుడు పీవీ రావు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, ఐటీడీఏ మాజీ పీఓ చక్రధర్‌రావు, రిటైర్డ్ జడ్జి కల్వల దేవీప్రసాద్, ప్రముఖులు సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్, ప్రొఫెసర్ సీతారామారావు, వెంకట్‌రెడ్డి, మనోహర్‌రావు, డాక్టర్ శ్రీకాంత్, పింగిళి శరత్, డాక్టర్ శిరీశ్, అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.
జీడబ్ల్యూఎంసీ కమిషనర్
చాహత్ బాజ్‌పాయ్


