విషాద యాత్ర
ఆరు రోజుల్లో
రాకేశ్ జన్మదినం..
క్షతగాత్రుడు క్రాంతికి
ఆరు నెలల క్రితమే వివాహం..
స్టేషన్‌ఘన్‌పూర్/జఫర్‌గఢ్ : విహారయాత్ర మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్, జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామాల్లో తీరని శోకం మిగిల్చింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం, మిట్టపల్లి గ్రామాల మధ్య సోమవారం తెల్లవారుజామున లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు జిల్లా వాసులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉండగా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన చెందిన చిల్లర బాలకృష్ణ (30), రొయ్యల అనిల్ (31) అక్కడికక్కడే మృతిచెందగా, స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన గట్టు రాకేశ్, కొలిపాక క్రాంతి, ఉప్పుగల్లుకు చెందిన అజయ్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేశ్ మృతిచెందగా కొలిపాక క్రాంతికి రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి.
స్నేహితులంతా కలిసి దైవదర్శనానికి..
జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన చిల్లర బాలకృష్ణ స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో సొంతంగా ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మరో స్నేహితుడు రొయ్యల అనిల్ తన భార్య, కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటూ హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంద అజయ్ గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ముగ్గురు కలిసి స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన గట్టు రాకేశ్, క్రాంతి మరికొంత మంది స్నేహితులతో కలసి ఈనెల 24న విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. దీంతో యాత్రకు వెళ్లేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న రొయ్యల అనిల్ తన భార్య, కుమారుడితో కలిసి ఉప్పుగల్లుకు వచ్చి వారిని ఇంటి వద్ద వదిలేసి స్నేహితులతో కలిసి అదే రోజున బయలుదేరారు. మూడు కార్లలో సుమారు 15 మంది యువకులు ముందుగా ఒడిశాలోని పూరిజగన్నాథస్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సింహాచలం, అరకు, వైజాగ్ తదితర ప్రదేశాలను సందర్శించారు. యాత్ర అనంతరం తిరుగు ప్రయాణంలో ఖమ్మం జిల్లా తల్లాడ సమీపం వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీని కారు ఢీకొంది.
దైవదర్శనానికి వెళ్లి ముగ్గురు
జనగామ జిల్లా వాసుల మృతి
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఘటన
స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్ మండలాల్లో విషాదం
ఘన్‌పూర్‌కు చెందిన గట్టు కరుణాకర్, పద్మ దంపతులకు ఒక కుమారుడు రాకేశ్, కూతురు సంతానం. కరుణాకర్ టైర్ల పంక్చర్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, పదేళ్ల క్రితం కరుణాకర్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో స్థానిక దాతల సహకారంతో ఖరీదైన వైద్యంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఏడేళ్ల క్రితం కరుణాకర్ భార్య పద్మ అనా రోగ్యంతో మృతిచెందింది. ప్రస్తుతం కరుణాకర్ కుమారుడు రాకేశ్ జఫర్‌గడ్ మండలం ఉప్పుగల్లు ఆయిల్ మిల్లులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. యువకుడి వివాహం చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. అదేవిధంగా జనవరి 3న అతడి పుట్టినరోజు ఉంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ యాత్రకు స్నేహితులతో వెళ్లి మృతిచెందడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కొలిపాక ఐలయ్య, లలిత దంపతుల కుమారుడు క్రాంతి స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడికి వివాహం జరిగి ఆరునెలలే అవుతోంది. రోడ్డు ప్రమాదంలో క్రాంతి రెండు కాళ్లు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
విషాద యాత్ర
విషాద యాత్ర


