మౌలిక వసతులు కల్పించండి
వరంగల్ అర్బన్: నగరంలోని పలు కాలనీల నుంచి స్థానిక సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మౌలిక వసతులు కల్పించాలని కాలనీ కమిటీలు విన్నవిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, డ్రెయినేజీలు కబ్జాకు గురవుతున్నాయని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఫిర్యాదుల పరిష్కారంలో పురోగతి కనిపించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన గ్రేటర్ గ్రీవెన్స్‌లో మొత్తం 106 ఫిర్యాదులు వచ్చాయి. అందులో టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు 56, ఇంజనీరింగ్ విభాగానికి 21, రెవెన్యూ 13, హెల్త్ శానిటేషన్ 9, నీటి సరఫరా 7 దరఖాస్తులు అందినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్, టీఓ కృష్ణరావు, ఎంహెచ్‌ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● కొత్తవాడ డివిజన్ 23 ముదిరాజ్ కులానికి చెందిన శ్మశాన వాటిక భూమి సర్వే నంబర్ 442 విస్తీర్ణం 10 గుంటల స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బయ్యస్వామి విన్నవించారు.
● వరంగల్ చింతల్ సర్వే నంబరు 367లో దళిత కమ్యూనిటీ హాల్ నిర్మించాలని దళిత డెవలప్‌మెంట్ సొసైటీ ప్రతినిధులు విన్నవించారు.
● వరంగల్ విశ్వనాథ కాలనీలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని కూల్చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నమిండ్ల స్వామి మాదిగ విజ్ఞప్తి చేశారు.
● 3వ డివిజన్ ఆరేపల్లిలో 50–2–42 రహదారిపై ప్రహరీ తొలగించాలని స్థానికులు కోరారు.
● 27వ డివిజన్‌లోని ఎల్‌వీఆర్ నగర్‌లో, 58వ డివిజన్ సంఘమిత్ర కాలనీ, పోస్టల్ కాలనీల్లో కోతులు, కుక్కల బెడద బెడద నుంచి కాలనీవాసులను కాపాడాలని వేర్వేరుగా కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.
● 3వ డివిజన్ పైడిపల్లి గణేశ్ కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు దరఖాస్తు అందజేశారు.
● పైడిపల్లిలోని కాంత కాలనీ, కేఎల్ లక్ష్మీ కాలనీలో తాగునీటి పైపులైన్లు వేసి, నల్లా కనెక్షన్లు ఇవ్వాలని కాలనీవాసులు దరఖాస్తును కమిషనర్‌కు అందించారు.
● 30వ డివిజన్ న్యూ శాయంపేట నుంచి రైల్వే గేట్ మీదుగా భట్టుపల్లి రోడ్డును విస్తరించి, అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానికులు కోరారు.
● హనుమకొండ హంటర్ రోడ్డు దుర్గాదేవి, పెరుక కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు వివరించారు.
● హనుమకొండ యాదవనగర్ శ్రీ లక్ష్మీకాలనీలో డ్రెయినేజీ నిర్మించాలని అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు.
● 4వ డివిజన్ కృష్ణా కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీలు నిర్మించాలని కాలనీవాసులు పేర్కొన్నారు.
● హంటర్ రోడ్డులోని సర్వే నంబరు 108లో వెయ్యి గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేసి, ప్రైవేట్ స్కూల్ నిర్మించారని, బల్దియా స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదు చేశారు.
● ఎర్రగట్టు గుట్ట జంక్షన్ వద్ద బస్ షెల్టర్లు నిర్మించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు.
● భీమారం నుంచి కోమటిపల్లి వరకు ఉన్న 60 ఫీట్ల రోడ్డు కబ్జాకు గురవుతుందని, విస్తరించి, అభివృద్ధి చేయాలని మధురానగర్ కాలనీవాసులు కోరారు.
● 56వ డివిజన్ గోపాలపురం చెరువు ఎఫ్‌టీఎల్ జోన్‌లో సబ్ స్టేషన్ పక్కన ఉన్న శ్మశాన వాటికను తొలగించాలని కమిషనర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
నగరంలోని ఆక్రమణలు కూల్చేయండి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
గ్రేటర్ గ్రీవెన్స్ సెల్‌కు 106 ఫిర్యాదులు


