నగరంపాలెం: రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా బుధవారం నగరంపాలెం పోలీస్ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందే రోగుల ప్రాణాలను కాపాడుతుందని చెప్పారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన రక్తదాన శిబిరం సేవాభావానికి, సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. రక్తదానం చేసిన ఏఆర్ ఆర్ఐ సురేష్, ఎస్ఐలు బాలశంకర్, సుబ్బారావు మాట్లాడుతూ రక్తదానంతో ప్రాణదానం చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. సుమారు నలభై మంది పోలీస్ అధికారి, సిబ్బంది రక్తదానం చేయగా, గుంటూరు జీజీహెచ్ వైద్యులు రామ్‌నాయక్, వైద్య సిబ్బంది, తలసేమియా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తం సేకరించారు. శిబిరంలో జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ. రమణమూర్తి, డీఎస్పీలు అలహరి శ్రీనివాస్ (ఎస్బీ) పూర్ణచంద్రరావు (గుంటూరు దక్షిణ), బెల్లం శ్రీనివాసరావు (గుంటూరు పశ్చిమ), ఆర్ఐలు శ్రీహరి రెడ్డి, కృష్ణయ్య, పోలీస్ ఆసుపత్రి ఏఆర్ ఎస్ఐ రవి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


