స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ
పెన్షన్ వస్తేనే కుటుంబానికి అండ
● స్థానిక సంస్థల ఎన్నికల ముందు
హడావుడిగా దరఖాస్తుల స్వీకరణ
● జిల్లా వ్యాప్తంగా కొత్త పెన్షన్ల
కోసం 57,400 అర్జీలు
● ఇస్తామని ఆశ పెట్టి మంజూరు
నిలిపివేసిన చంద్రబాబు సర్కార్
● ప్రచార సమయంలో కూటమి
అభ్యర్థులకు ప్రజల నుంచి
తీవ్ర వ్యతిరేకత
గుంటూరు వెస్ట్: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించేవారు. వెంటనే అర్హులకు పింఛను మంజూరు చేసి పారదర్శకమైన పాలన అందించారు. అది చూసిన రాష్ట్ర ప్రజలు నేడు అందుకు వ్యతిరేక పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు దాటినా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదంటే అతిశయోక్తి కాదు. పైగా స్థానిక ఎన్నికల ముందు కొత్త పింఛన్లు అంటూ హడావుడి చేసి నేడు ఒక్కరికీ ఇవ్వకపోవడంతో ప్రచారానికి వెళ్లిన కూటమి నాయకులను ప్రజలు నిలదీసే పరిస్థితి నెలకొంది.
సమాచారం కూడా ఇవ్వని అధికారులు
కరోనా మహమ్మారితో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాల కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసి, తానున్నానంటూ పేదలను ఆదుకున్న ఏకై క నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. పేదల పట్ల ఆయనకున్న నిబద్ధత అది. నేరుగా వలంటీర్ల ద్వారా ఇంటికే పింఛను మొత్తం పంపిణీ చేయించారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక పరిస్థితి మారిపోయింది. రెండేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అర్హులు... స్థానిక ఎన్నికల ముందుకు ప్రభుత్వం చెప్పిన మాటలను నమ్మి దరఖాస్తు చేశారు. కానీ వారికి మళ్లీ మోసమే ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించడంతో జిల్లాలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, కళాకారులు ఇలా దాదాపు 57,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో చాలా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఎందుకు తిరస్కరించారో అధికారులు చెప్పడం లేదు. పోనీ, మంజూరు చేసిన వారికై నా పెన్షన్లు రాలేదు. ప్రస్తుతం జిల్లాలో 2,50,576 మందికి 566 స్వర్ణ గ్రామ సచివాలయాల ద్వారా 4,317 మంది సిబ్బంది రూ.109.32 కోట్లు పంపిణీ చేస్తున్నారు. కొత్తగా మంజూరైన పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో తెలియడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సూపర్ సిక్స్ పథకాల పేరుతో, కొత్త పెన్షన్ల పేరుతో ప్రజలను ఏమార్చాలని చూస్తున్న చంద్రబాబు సర్కార్‌కు స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ఎదురుదెబ్బ తగులుతోంది. అభ్యర్థులు ప్రచారానికి వెళ్లినప్పుడు స్థానికులు పెన్షన్లకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల స్థానిక శారదా కాలనీలో ఓ అభ్యర్థి ప్రచారం మధ్యలోనే స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెనుదిరిగాడు. ఇదే పరిస్థితిని పాత గుంటూరు, సంగడిగుంట, తుఫాన్ నగర్, గుజ్జనగుండ్ల ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా, కూటమి నాయకులకు ఓట్లు ఎందుకు వేయాలో చెప్పాలని నిలదీస్తున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
నాకు ఐదేళ్ల క్రితం క్యాన్సర్ సోకింది. అప్పటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా శస్త్రచికిత్స చేయించింది. కాలులో చాలా భాగాన్ని వైద్యులు తొలగించారు. నాకు పిల్లలు లేరు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పెన్షన్లలో భాగంగా వికలాంగుల విభాగంలో దరఖాస్తు చేసుకున్నాను. అది వస్తే నా కుటుంబానికి ఎంతో అండగా ఉంటుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలి.
– ఎం.వి. రమణ, ఏటీ అగ్రహారం


