మెరిట్ లిస్టు తో మర్చిపోయారా?
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల అధికారుల తీరుతో ఎంతో మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నోటిఫికేషను ఇచ్చినా నియామకాలు చేపట్టడం లేదు. గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ అధికారుల తీరుతో అర్హులు మనోవేదనకు గురవుతున్నారు.
గుంటూరు వైద్య కళాశాలలో ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ అధికారులు గత ఏడాది సెప్టెంబరు 9 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్‌లో 61 పోస్టులను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. గుంటూరు జీజీహెచ్, గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్, గుంటూరు వైద్య కళాశాల, గోరంట్ల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో పలు రకాల టెక్నీషియన్ పోస్టులు, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సుమారు ఆరు వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఒక్కొక్కరు రూ.500 చొప్పున ఫీజు కూడా చెల్లించారు. తర్వాత అధికారులు పట్టించుకోలేదు.
గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అధికార పరిధిలో గుంటూరు జీజీహెచ్, గోరంట్ల జ్వరాల ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఉన్నాయి. వీటిలో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు హ్యూమన్ రిసోర్స్ (హెచ్‌ఆర్) విధులన్నీ గుంటూరు వైద్య కళాశాల అధికారులు చూడాల్సి ఉంటుంది. ఫైనాన్స్ వ్యవహారాలన్నీ గుంటూరు జీజీహెచ్ అధికారులు చూడాలి. గతంలో వైద్య కళాశాలకు సంబంధించిన విషయాలన్నీ కళాశాల ఏడీ, ప్రిన్సిపాల్ చూసేవారు. జీజీహెచ్‌కు సంబంధించిన రిక్రూట్‌మెంట్లు, హెచ్‌ఆర్ పనులు, ఫైనాన్స్ వ్యవహారాలన్నీ జీజీహెచ్ సూపరింటెండెంట్, ఏడీలు చూసేవారు. సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్‌కు పరిపాలనా పరమైన విషయాల్లో సహాయం అందించేందుకు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇద్దరు ఏవోలు, నలుగురు ఆఫీస్ సూపరింటెండెంట్లు కళాశాల, ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ, అసిస్టెంట్ ఆర్‌ఎంఓలు ఆసుపత్రి పరిపాలనకు సంబంధించిన అంశాల్లో ప్రత్యేక కోర్సులు పూర్తి చేసి జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు కళాశాల, ఆసుపత్రి కోసం ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న అధికారిని అడ్మినిస్ట్రేటర్‌గా ప్రత్యేకంగా నియమించింది. ఇంత మంది పరిపాలనా నైపుణ్యం ఉన్న అధికారులు ఉన్నప్పటికీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వైద్య కళాశాలకు సంబంధించిన ఫైనాన్స్ పనులు, జీజీహెచ్‌కు సంబంధించిన ఫైనాన్స్ పనులను గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకోవాలి. రిక్రూట్‌మెంట్లు, హెచ్‌ఆర్ పనులను గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్‌కు సంబంధించి గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ చూడాలి. వైద్య కళాశాల, జీజీహెచ్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. వారికి నచ్చిన ఫైళ్లను మాత్రం పరస్పర ఒప్పందంతో త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు. జీజీహెచ్ చైర్మన్‌గా ఉన్న జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఈ అంశంపై ఒకసారి దృష్టి సారించి త్వరితగతిన తమకు నియామకపత్రాలు అందేలా చూడాలని మెరిట్ లిస్టులోని అభ్యర్థులు కోరుతున్నారు. పోస్టులు భర్తీ చేస్తే ఇటు రోగులు, అటు వైద్య సిబ్బంది ఇబ్బందులు పడకుండా ఉంటారని ప్రజలు ఆశిస్తున్నారు.
‘సాక్షి’ కథనంతో స్పందన
ఈ సమస్యపై ‘సాక్షి’లో ఈ ఏడాది ఏప్రిల్ 15న ‘నో.. టిఫికేషన్!’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. అప్పుడు స్పందించిన జిల్లా కలెక్టర్... ఉద్యోగ నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మేరకు వైద్య కళాశాల అధికారులు ప్రొవిజనల్ మెరిట్ లిస్టును ప్రకటించి, అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను సైతం పూర్తి చేశారు. ఆ ప్రక్రియ పూర్తయి ఐదు నెలలు గడుస్తున్నా అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ అధికారులు తాత్సారం చేస్తున్నారు.
● గుంటూరు జీజీహెచ్, వైద్య కళాశాలల్లో
అటకెక్కిన పోస్టుల భర్తీ
● నిరుద్యోగుల జీవితాలతో
వైద్యాధికారుల ఆటలు
● గత ఏడాది సెప్టెంబర్‌లో
ఉద్యోగాలకు నోటిఫికేషన్
● రద్దవుతుందనే ఆందోళనలో
అర్హులైన అభ్యర్థులు
గత ఏడాది నోటిఫికేషన్
సమన్వయ లోపమే శాపమా?