ప్రత్తిపాడు: వైఎస్సార్ సీపీ శ్రేణులు పోరాట స్ఫూర్తితో ఎన్నికల బరిలో నిలిచాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ స్థానిక ఎన్నికల ప్రక్రియలో అడ్డగోలుగా వ్యవహరించింది. నామినేషన్ల దాఖలుకు ఆటంకాలు కల్పించింది. దాడులకు పాల్పడింది. వైఎస్సార్ సీపీ శ్రేణులను, ఆ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసి తమకు వ్యతిరేకంగా ఒక్క నామినేషన్ కూడా పడకుండా వీలైనన్ని కుట్రలు పన్నింది. దీంతో కొన్ని చోట్ల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం నామినేషన్ల దాఖలు చేయలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ మాత్రం మంచి జోష్ మీద కనిపిస్తోంది. ఏ ఒక్క స్థానం ఏకగ్రీవం కాకూడదంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు స్థానికంగా ఏమాత్రం ‘తగ్గేదేలే’ అంటోంది. గెలుపోటముల సంగతి అటు ఉంచితే ఎన్నికల బరిలో నిలిచి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ గట్టిగా నిర్ణయించింది. దీంతో ఐదు మండలాల్లోనూ అధికార టీడీపీకి ధీటుగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లను దాఖలు చేశారు.
58 సెగ్మెంట్లలోనూ పోటీ..
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు. గుంటూరురూరల్ మండలాల్లో మొత్తం 58 సెగ్మెంట్లలో ఎంపీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. పోటీ చేసేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు ఏ మాత్రం వెరవడం లేదు. అందులో భాగంగానే అనేక ఒత్తిళ్లు, రాయబారాలు, బెదిరింపులను తట్టుకుని నిలబడి టీడీపీతో సమానంగా 137 నామినేషన్లను దాఖలు చేశారు. వాటిలో అక్కడక్కడ ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని నామినేషన్లకు శనివారం జరిగిన పరిశీలనలో అధికారులు ఆమోదముద్ర వేశారు. దీంతో దాదాపుగా అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులు వైఎస్సార్సీపీ తరఫున పోటీలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. డమ్మీ నామినేషన్లు వేసిన వారు మినహా మిగిలిన అభ్యర్థులెవ్వరూ నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం లేదు.
మండలాలవారీగా నామినేషన్ల వివరాలు
మండలం వైఎస్సార్సీపీ టీడీపీ
ప్రత్తిపాడు 26 25
పెదనందిపాడు 39 40
కాకుమాను 27 26
వట్టిచెరుకూరు 26 40
గుంటూరు రూరల్ 19 17
మొత్తం 137 148
టీడీపీ దౌర్జన్యాలను తట్టుకుని బరిలో
నిలిచిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులు
ఐదు మండలాల్లోనూ అదే ఉత్సాహం
అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు
ఏకగ్రీవాలకు చెక్


