నగరంలోనే నత్తనడక | - | Sakshi
Sakshi News home page

నగరంలోనే నత్తనడక

Sep 24 2026 2:12 AM | Updated on Sep 24 2026 2:12 AM

● గుంటూరు వెస్ట్‌: ఇక్కడ ఈఆర్‌ఓ వద్ద ఏకంగా 22,115 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇది ఏకంగా 20.68 శాతం. జిల్లా సగటు పెండింగ్‌ కేవలం 4.04 శాతంగా ఉంటే, వెస్ట్‌లో 20 శాతానికి పైగా ఫైళ్లు పేరుకుపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ● గుంటూరు ఈస్ట్‌: ఈస్ట్‌ నియోజకవర్గంలోనూ 4,763 దరఖాస్తులు (3.79%) ఈఆర్‌ఓ స్థాయిలో క్లియరెన్స్‌కు నోచుకోలేదు. ● పొన్నూరులో కేవలం 1.14 శాతం (1,685), ప్రత్తిపాడులో 1.23 శాతం (1,942), తెనాలిలో 1.46 శాతం (1,960), మంగళగిరిలో 1.80 శాతం (2,250), తాడికొండలో 2.33 శాతం (3,339) మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ● మిగతా నియోజకవర్గాల అధికారులు చకచకా ఫొటో క్లెయిమ్స్‌ క్లియర్‌ చేస్తుంటే, గుంటూరు నగరంలో ప్రత్యేకించి గుంటూరు వెస్ట్‌ అధికారులు మాత్రం కుంభకర్ణ నిద్ర నటిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గుంటూరు వెస్ట్‌లో కొండలా పేరుకుపోయిన ఈఆర్‌ఓ పెండెన్సీ ఓటర్ల ఫొటోల పరిశీలనలో వెస్ట్‌ ఈఆర్‌ఓ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న 22,115 దరఖాస్తులు జిల్లా సగటు ఈఆర్‌ఓ పెండెన్సీ 4.04శాతం.. ఒక్క వెస్ట్‌లోనే ఏకంగా 20.68శాతం ఈస్ట్‌లోనూ 4,763 దరఖాస్తులు పెండింగ్‌ బీఎల్‌ఓలు కష్టపడుతున్నా..ఈఆర్‌ఓల వద్దే ఆగుతున్న వైనం

ఉద్దేశపూర్వక జాప్యమా?

నెహ్రూనగర్‌: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా ఫొటోల పరిశీలన, ఆమోదం విషయంలో గుంటూరు జిల్లా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నగర నియోజకవర్గమైన గుంటూరు పశ్చిమ పరిధిలో అధికారులు తీవ్ర ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన పూర్తి చేసి పంపించినా, ఈఆర్‌ఓ (ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌) స్థాయిలో నిర్ణయాలు తీసుకోకుండా వేలాది దరఖాస్తులను పెండింగ్‌లో పడేశారు.

ఒక్క వెస్ట్‌లోనే 20 శాతానికి పైగా పెండింగ్‌!

జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు మొత్తం 38,054 దరఖాస్తులు ఈఆర్‌ఓల పరిశీలనలో పెండింగ్‌లో ఉండగా, ఇందులో సగానికి పైగా ఒక్క గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం.

గుంటూరు నగరం పరిధిలోని ఈ రెండు నియోజకవర్గాల్లోనే కలిపి దాదాపు 26,878 దరఖాస్తులు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి.

ఇతర ప్రాంతాల్లో చురుగ్గా..

గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండే పొన్నూరు, ప్రత్తిపాడు, తెనాలి, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ఈఆర్‌ఓ పెండెన్సీ చాలా తక్కువగా ఉంది.

ఓటరు జాబితా ప్రక్షాళన, సరిదిద్దే ప్రక్రియలో ఈ స్థాయిలో జాప్యం జరగడంపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన ఓటర్ల మార్పులు – చేర్పులు, సరైన ఫొటోల నమోదును సకాలంలో ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రజలు, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement