బార్‌లో మహిళా వెయిటర్‌తో వాగ్వాదం | - | Sakshi
Sakshi News home page

బార్‌లో మహిళా వెయిటర్‌తో వాగ్వాదం

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

బార్‌లో మహిళా వెయిటర్‌తో వాగ్వాదం

యువకులపై లాఠీలతో దాడి!

మద్యం సరఫరాలో జాప్యంపై మొదలైన గొడవ గేట్లు వేసి చితకబాదినట్లు ఆరోపణలు పోలీసుల లాఠీలతోనే దాడి చేశారంటూ యువకుల బంధువుల ఆగ్రహం ఇరు వర్గాల ఫిర్యాదులతో పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ

తాడేపల్లి రూరల్‌: ఉండవల్లి సెంటర్‌లోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘర్షణ తీవ్ర చర్చకు దారితీసింది. మద్యం సరఫరాలో జాప్యంపై మహిళా వెయిటర్‌, మద్యం సేవిస్తున్న యువకుల మధ్య మొదలైన వాగ్వాదం చివరకు దాడికి దారితీసినట్లు సమాచారం. బార్‌ నిర్వాహకులు పోలీసులకు చెందిన ఫైబర్‌ లాఠీలతో యువకులపై దాడి చేశారు. ఘటనకు సంబంధించి ఇరు వర్గాలు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలిసింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అర్ధరాత్రి సమయంలో ఉండవల్లి సెంటర్‌లోని శ్రీనివాస బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. మద్యం సేవించిన అనంతరం బిల్లు చెల్లించి బయటకు వెళ్లే సమయంలో మరో స్నేహితుడు వస్తున్నట్లు సమాచారం అందడంతో తిరిగి మద్యం ఆర్డర్‌ చేసినట్లు తెలుస్తోంది. మద్యం తీసుకురావడంలో జాప్యం జరగడంతో యువకులు మహిళా వెయిటర్‌ను ప్రశ్నించడంతోపాటు ఆమైపెకి చెప్పు తీసినట్లు తెలిసింది.

దూషణలు.. ఘర్షణ...

మద్యం సరఫరాలో ఆలస్యంపై మొదలైన మాటామాటా క్రమంగా తీవ్ర వాగ్వాదానికి దారితీసిందని చెబుతున్నారు. ఇరువర్గాల మధ్య పరస్పరం దూషణలు జరిగాయని సమాచారం. దీంతో మహిళా వెయిటర్‌ జరిగిన విషయాన్ని బార్‌ నిర్వాహకులకు చెప్పడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. అనంతరం బార్‌ నిర్వాహకులు గేట్లు మూసివేసి యువకులతో వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళా వెయిటర్‌ కూడా యువకులపై దాడికి పాల్పడినట్లు వారు ఆరోపిస్తున్నారు.

పోలీసు లాఠీలతోనే దాడి?...

ఇక్కడే అసలు వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. బార్‌ యజమాని అక్కడ ఉన్న పోలీసులకు చెందిన ఫైబర్‌ లాఠీని తీసుకుని యువకులపై దాడి చేసినట్లు బాధితుల తరఫు వారు ఆరోపిస్తున్నారు. ఆ లాఠీ విరిగిపోయిన అనంతరం అక్కడ విధుల్లో ఉన్న పోలీసు వద్ద నుంచి మరో లాఠీ తీసుకుని దాడి కొనసాగించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై యువకుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బార్‌లో గొడవ జరిగితే నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి పోలీసుల లాఠీలతోనే యువకులను కొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

స్టేషన్‌లోనూ వేడెక్కిన వాతావరణం...

ఘటనపై ఇరు వర్గాలు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేయడంతో వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. అక్కడకు వచ్చిన యువకుల బంధువులు బార్‌ నిర్వాహకుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. బార్‌లో గొడవలు జరగడం కొత్తేమీ కాదని, అందుకు మద్యం సేవించిన వారిని విచక్షణారహితంగా కొట్టడం ఏమిటని వారు ప్రశ్నించినట్లు తెలిసింది. గొడవను అదుపు చేయాల్సిన పోలీసులు లాఠీని బార్‌ నిర్వాహకులకు ఎలా అందించారంటూ వారు నిలదీసినట్లు సమాచారం. తాడేపల్లి పోలీసులు తమ పోలీస్‌స్టేషన్‌లో లాఠీలు లేవని చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement