జీఎంసీని కై వసం చేసుకుందాం | - | Sakshi
Sakshi News home page

జీఎంసీని కై వసం చేసుకుందాం

Sep 21 2026 6:35 AM | Updated on Sep 21 2026 6:35 AM

జీఎంసీని కై వసం చేసుకుందాం

76 డివిజన్లలోనూ వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేద్దాం కూటమి మోసాలపై ప్రజలను కార్యకర్తలు చైతన్యపరచాలి వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి స్థానిక ఎన్నికలపై పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం

గుంటూరు ఎడ్యుకేషన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్‌ సీపీ గెలుపు జెండా ఎగురవేద్దామని పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలోని 76 డివిజన్లలోనూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలపై పార్టీ కార్యకర్తలతో ఆదివారం అమరావతి రోడ్డులోని ‘ఎ’ కన్వెన్షన్‌లో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి ప్రసంగించారు. టీడీపీ మోసాలను ప్రజలకు వివరించి, వైఎస్సార్‌సీపీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్‌ గులాం రసూల్‌, నాయకులు మండేపూడి పురుషోత్తం, ఎం. వెంకటప్పారెడ్డి, పోలూరి వెంకట్‌రెడ్డి, నల్లమోతు రూత్‌రాణి, పార్టీ జిల్లా, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ దగా తీరును ప్రజలకు వివరించాలి

వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2021లో గుంటూరు నగరపాలక సంస్థను వైఎస్సార్‌ సీపీ కై వసం చేసుకుందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అంతకుమించిన స్థాయిలో అత్యధిక మెజార్టీతో గెలుపు కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేద్దామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం తప్పుడు హామీలతో ప్రజలను మోసగించిన తీరు ఒకవైపు, గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు మరోవైపు సాక్ష్యంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో వీటిపై ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గతంలో నగరంలో 57 డివిజన్లకుగాను 46 డివిజన్లను వైఎస్సార్‌ సీపీ కైవసం చేసుకుందని గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో 76 డివిజన్లలోనూ గెలుపు కోసం సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.

ప్రతి డివిజన్‌లో మనదే బలం

రాజ్యసభ మాజీ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి డివిజన్‌లో వైఎస్సార్‌ సీపీ బలంగా ఉందని తెలిపారు. అక్కడి ముఖ్య నాయకుల బలాన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను పార్టీ ఎంపిక చేస్తుందని చెప్పారు. కార్పొరేషన్‌ ఎన్నికలకు సమగ్ర వ్యూహంతో ముందుకెళదామని అన్నారు.

అధికారం లేదనే భయం వద్దు

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీకి అధికారం లేదనే భయం వద్దని, అధికారానికి దూరమైనా ప్రజలకు దగ్గరగా ఉన్నామనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు స్థాపించిన పార్టీ అని మరువరాదన్నారు. ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు వైఎస్‌ జగన్‌ పాలనలో సంక్షేమ కార్యక్రమాలతో వారికి నేరుగా లబ్ధి చేకూర్చారని అన్నారు. ప్రస్తుత సమావేశం ఎన్నికల సమరానికి పునాది కావాలన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు. గుంటూరు కార్పొరేషన్‌ను వైఎస్సార్‌ సీపీ కై వసం చేసుకునేందుకు కార్యోన్ముఖులు కావాలన్నారు.

పోటీ చేస్తే గెలుపు ఖాయం

పార్టీ గుంటూరు పార్లమెంటు జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్‌ మాట్లాడుతూ.. కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీ చేసే వారందరూ కార్పొరేటర్లుగా గెలుస్తారని అన్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే టీడీపీ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌, గంజాయి బ్యాచ్‌ను ప్రోత్సహిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరకు ప్రజలు వెళ్లడం లేదని, వైఎస్సార్‌సీపీ నేతల వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకొంటున్నారని పేర్కొన్నారు. అంబటి ఇంటిపై దాడి అనంతరం ఆయన్ను పరామర్శించేందుకు గుంటూరు వచ్చిన వైఎస్‌ జగన్‌కు రెండున్నర లక్షల మంది ప్రజలు స్వాగతం పలికారని గుర్తుచేశారు. ప్రజలకు కనీసం సురక్షితమైన తాగునీరు ఇవ్వలేని దుస్థితి నెలకొందని విమర్శించారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ మిల్లర్లతో కుమ్మకై ్క బియ్యం మాఫియా నడుపుతూ రూ. వేల కోట్లు ఆర్జించారని ఆరోపించారు.

రెండో కీలక కార్పొరేషన్‌గా తీర్చిదిద్దాం

ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌ సీపీ పాలనలో గుంటూరు కార్పొరేషన్‌లోని ఒక్కో డివిజన్‌లో రూ.50 కోట్ల మేరకు అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో రెండో కీలక కార్పొరేషన్‌గా గుంటూరును వైఎస్‌ జగన్‌ తీర్చిదిద్దారని, నాటి పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

మున్సిపల్‌ ఎన్నికలు సెమీ ఫైనల్స్‌

మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ.. గతంలో అభ్యర్థుల జాబితా కేంద్ర కార్యాలయం నుంచి వచ్చేదని, ప్రస్తుతం స్థానికంగా జాబితా సిద్ధం చేసి పైకి పంపుతామని చెప్పారు. గతంలో గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్‌ సీపీ జెండాతో కార్పొరేటర్లుగా గెలిచిన వారు పార్టీని వీడి వెళ్లినా, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. కార్యకర్తల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా తీసుకుని ముందుకెళదామని తెలిపారు. వచ్చే జగన్‌ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు కార్యకర్తల ద్వారానే ప్రజలకు అందుతాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement