కుష్ఠు సర్వేకు ఓటీపీ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కుష్ఠు సర్వేకు ఓటీపీ కష్టాలు

Sep 21 2026 6:35 AM | Updated on Sep 21 2026 6:35 AM

కుష్ఠు సర్వేకు ఓటీపీ కష్టాలు

ఇంట్లో ఉన్న అందరికీ ఇదే నిబంధన ఓటీపీలు చెప్పేందుకు ఇష్టపడని ప్రజలు ముందుకు సాగని ఎల్‌సీడీసీ సర్వే ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు కష్టాలు వారంలో జిల్లాలో ఒక్క శాతం కూడా పూర్తవ్వని సర్వే

సర్వే కొనసాగుతుంది

ప్రత్తిపాడు: కుష్ఠు వ్యాధి సర్వేకు ఓటీపీ నిబంధన ప్రతిబంధకంగా మారింది. గతంలో లేని విధంగా సర్వేకు ఓటీపీని తప్పనిసరి చేయడంతో ఎల్‌సీడీసీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఓటీపీలు చెప్పేందుకు ప్రజలు సుముఖత వ్యక్తం చేయకపోతుండటంతో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కుష్ఠు వ్యాధి రోగులను గుర్తించేందుకు వైద్య ఆరోగ్యశాఖ లెప్రసీ కేస్‌ డీటెక్షన్‌ క్యాంపెయిన్‌ (ఎల్‌సీడీసీ) సర్వే నిర్వహిస్తుంది. జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్త, ఒక మేల్‌ వలంటీర్‌ ఇంటింటికీ వెళ్లి ‘కుష్ఠు వ్యాధిగ్రస్తులను, అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించే కార్యక్రమం’ చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి మొదలైన ఈ సర్వేకు ప్రభుత్వ నిబంధనలు, సాంకేతిక సమస్యలు ఆటంకంగా మారడంతో నత్తనడకన సాగుతుంది.

ఓటీపీలు చెప్పేందుకు విముఖత..

సర్వేలో భాగంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లిన సమయంలో ఏఎన్‌ఎంలు ‘ఏఎన్‌ఎం ఏపీహెల్త్‌యాప్‌’లో ఎన్‌ఎల్‌ఈపీ ఏపీలో కుటుంబంలోని సభ్యుల వివరాలను నమోదు చేయాలి. ఆ సమయంలో సభ్యుల ఫోన్‌ నంబర్లకు ఓటీపీలు వస్తున్నాయి. ఆ ఓటీపీలను యాప్‌లో నమోదు చేస్తేనే సర్వే పూర్తి అవుతుంది. అయితే కుటుంబ సభ్యులు ఓటీపీలు చెప్పేందుకు విముఖత చూపుతున్నారు. దానికి తోడు నెల రోజుల కిందట చేసిన సర్వేకు ఓటీపీలు చెప్పించుకుని, మళ్లీ ఇప్పుడు ఓటీపీలంటారేంటని, ఇదే పనా అంటూ సిబ్బందిపై నిష్టూర్చుతుండటంతో ఆరోగ్య సిబ్బంది కాళ్లకు పని చెప్పి వెనుదిరగాల్సి వస్తుంది. కాగా, ఒక పక్క ప్రభుత్వమే కాల్స్‌ చేసి ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని చెబుతుంటే, మీరొచ్చి ఓటీపీలు ఎలా అడుగుతారని ప్రశ్నిస్తుండటంతో వారి వద్ద సమాధానం కూడా కరువు అవుతోంది.

జిల్లాలో ఇలా..

జిల్లాలో మొత్తం 22,45,023 మంది జనాభా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు దాదాపు కేవలం 17,274 మందిని మాత్రమే సర్వే చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అంటే 0.77 శాతం మాత్రమే అధికారికంగా సర్వే జరిగిందన్న మాట. వీరిలో 101 మందికి కుష్ఠు అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించి పరీక్షించగా, ఇద్దరికి కుష్ఠు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కాగా, జిల్లాలో 568 మంది ఏఎన్‌ఎంలు ఉండగా, వారిలో 391 మంది ఆన్‌లైన్‌ నమోదు ప్రారంభించారు. 197 మంది నేటికీ ఆన్‌లైన్‌ వర్క్‌ ప్రారంభించలేదు. కాగా, ఆశా కార్యకర్తలు జిల్లాలో 1,170 మంది సర్వే చేస్తున్నారు. కాగా, ఆఫ్‌లైన్‌లో అయితే 7,60,719 మందిని సర్వే చేయగా, అందులో 717 మందికి కుష్ఠు అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించి పరీక్షించగా, ఏడుగురికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారించి చికిత్స చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో సమస్యలు..

ఈ నేపథ్యంలో సర్వేకు వెళ్లిన సిబ్బందికి క్షేత్ర స్థాయిలో బోలెడు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఓటీపీలు ఆధార్‌ కార్డుకు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్లకు వస్తుండటం, ఆ ఫోన్‌ నంబర్లు ఇంట్లో లేకపోవడం, కొంతమంది వద్ద ప్రస్తుతం ఆ నంబర్లు అసలు వినియోగంలో లేకపోవడంతో అగచాట్లు తప్పడం లేదు. ఇంకొందరు ఓటీపీలు వచ్చినా, మేము మీకు ఎందుకు చెప్పాలంటూ సిబ్బందిపై రివర్స్‌ అవుతుండటంతో, ఇంటి వరకూ వెళ్లినా ఓటీపీ దగ్గరే ప్రక్రియ నిలిచిపోతుంది. దీంతో సర్వే ముందుకు సాగక, ఆన్‌లైన్‌లో ప్రోగ్రెస్‌ పూర్‌గా కనిపిస్తుండటం, ఆఫ్‌లైన్‌లో చేసినా ప్రోగ్రెస్‌లోకి రాకపోవడంతో ఉన్నతాధికారులతో మాటలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వినతి పత్రాలిచ్చినా..

సమస్య తీవ్రత నేపథ్యంలో ఓటీపీతో అయితే సర్వే చేయడం కష్టమని, ఓటీపీ నిబంధనను మినహాయించాలని కోరుతూ ఇటీవల మెడికల్‌ ఆఫీసర్ల మొదలుకుని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వరకూ ఏఎన్‌ఎంలు అందరికీ వినతి పత్రాలిచ్చారు. అయినప్పటికీ సమస్య నేటి వరకు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సర్వేకు ఇచ్చిన పద్నాలుగు రోజుల గడువులో ఎనిమిది రోజులు పూర్తవడం, ఇక ఆరు రోజులే మిగిలి ఉండటంతో ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.

అన్ని గ్రామాల్లో సర్వే జరుగుతుంది. ఓటీపీల వల్ల కొంత ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియలో జాప్యం అవుతోంది. కానీ, ఆఫ్‌లైన్‌లో వేగంగా సర్వే చేస్తున్నారు. గడువును మరికొంత సమయం పొడిగించే అవకాశం ఉంది. ప్రజలకు సానుకూలంగా నచ్చజెప్పి ఓటీపీలు తీసుకోమని చెబుతున్నాం. సర్వేలో వ్యాధి నిర్ధారణ అయిన వారికి వెంటనే చికిత్స మొదలు పెడుతున్నాం.

– జె. బసవయ్య,

డీపీఎంవో, జిల్లా లెప్రసీ కార్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement