మంగళగిరి టౌన్: రాజధాని అమరావతిలో పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 25 అడుగుల భారీ విగ్రహంతో పాటు ఘంటసాల కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర చైతన్య వేదిక, ఘంటసాల చైతన్యవేదిక అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళగిరి పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. నవ్యాంధ్ర చైతన్య వేదిక 17వ జాతీయ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతిని భావితరాలకు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఆదిలీలా ఫౌండేషన్ న్యూఢిల్లీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ, వేదిక గౌరవ అధ్యక్షులు చిట్టిబాబు, కార్యదర్శి ఆంజనేయ రాజు, సహాయ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: రాజధాని అమరావతి ప్రముఖ ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రికి ఈ నెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రికి శంకుస్థాపన నేపథ్యంలో ఏర్పాట్లను బుధవారం అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ)– మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్షీ పార్థసారథి పరిశీలించారు. ముఖ్యంగా ఈ–3, ఎన్‌న్–14 కూడలి నుంచి వేదిక వద్దకు చేరుకునే మార్గాన్ని ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. సీడ్‌యాక్సెస్ రోడ్డు నుంచి సీఎం కాన్వాయ్ నేరుగా ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి కేటాయించిన స్థలానికి సౌకర్యవంతంగా చేరుకునేలా రోడ్డు మ్యాప్ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజినీరు టి.మోజెస్ కుమార్‌ను ఆదేశించారు. పర్యటనలో ఏడీసీ చీఫ్ ఇంజినీర్లు బి.నరసింహమూర్తి, సీహెచ్ ధనుంజయ పాల్గొన్నారు.
‘సాఫ్ హ్యాక్‌ఫెస్ట్’ వాల్‌పోస్టర్లు ఆవిష్కరణ
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం నందున్న చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 19వ తేదీన చైన్నెకి చెందిన ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ, కళాశాల సంయుక్తంగా జాతీయ స్థాయి సాప్ హ్యాక్‌ఫెస్ట్ 2026 నిర్వహించనున్నట్లు చలపతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వైవీ ఆంజనేయులు తెలిపారు. బుధవారం కళాశాలలో పెస్ట్ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ సాంకేతిక పరమైన పోటీ ప్రపంచంలో విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న హ్యాకఫెస్ట్ ఈ ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విజ్ఞాన్‌లో ఫ్రెషర్స్ డే
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయస్థాయి యూత్ ఫెస్టివల్ ‘విజ్ఞాన్ మహోత్సవ్–2కే27’ పోస్టర్‌ను చైర్మన్ లావు రత్తయ్య ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు నిర్వహించనున్న ఈ మహోత్సవంలో మొత్తం 95 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. వివిధ పోటీల్లో విజేతలకు రూ.20 లక్షలకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మంగళగిరిలో మహిళా క్రికెట్ సందడి
ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఉమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్
మంగళగిరి టౌన్: మహిళా క్రికెట్‌కు ప్రోత్సాహం కల్పించడంతో పాటు రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు వేదిక కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్(డబ్ల్యూఏపీఎల్) 2026 సీజన్–1కు మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఏసీఏ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొత్తం 13 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్ ప్రారంభో త్సవానికి నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాయలసీమ జెన్‌స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో మహిళా క్రికెట్ లీగ్ నిర్వహించడంతో నగరానికి మరోసారి క్రీడావేదికగా గుర్తింపు లభించనుంది.


