గుంటూరు ఎడ్యుకేషన్: ీసఎంఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థి మట్టుపల్లి మోక్షిత్ వంశీకృష్ణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో అభినందించినట్లు సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ శుక్రవారం తెలిపారు. కామర్స్ విద్యార్థులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సీఎంఏ ఫైనల్ పరీక్షా ఫలితాలు ఈనెల 5న ప్రకటించారని, దేశవ్యాప్తంగా అత్యున్నత కృషి, ప్రతిభ కనబరచిన మట్టుపల్లి మోక్షిత్ వంశీకృష్ణ అఖిల భారతస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. మాస్టర్‌మైండ్స్ విద్యాసంస్థల నిర్వాహకులు మట్టుపల్లి రాధ, మోహన్ కుమారుడైన మోక్షిత్ వంశీకృష్ణ చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ సందర్భంగా మోక్షిత్ వంశీకృష్ణ మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు, మాస్టర్‌మైండ్స్ సంస్థ అందించిన మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగానని, ఇది తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు.


