కొరిటెపాడు(గుంటూరు): రాష్ట్రంలో టెక్స్‌టైల్ పరిశ్రమను మరింత బలోపేతం చేసి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక గ్రీన్ ఎనర్జీ పాలసీని అమలు చేయాలని ఏపీ టెక్స్‌టైల్ మిల్స్ అసోసియేషన్(ఏపీటీఎంఏ) కోరింది. పరిశ్రమకు పోటీ విద్యుత్ ధరలు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, ఆధునికీకరణకు రాయితీలు, మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందిన సుమారు 50 మంది టైక్స్‌టైల్ మిల్లుల యజమానులు, ప్రతినిధులు శుక్రవారం బృందావన్ గార్డెన్స్‌లోని నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గృహంలో కలసి పలు అంశాలపై చర్చించారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల నుంచి అన్ని చార్జీలతో కలిపి యూనిట్ విద్యుత్‌ను సుమారు రూ.5 కే అందించే విధంగా చర్యలు తీసుకుంటే రాష్ట్రంలోని టైక్స్‌టైల్ మిల్లులు సమష్టిగా 100 నుంచి 150 మెగావాట్ల విద్యుత్‌ను దీర్ఘకాలికంగా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 2024–29 పారిశ్రామిక విధానాన్ని టెక్స్‌టైల్ రంగానికి అనుగుణంగా సమీక్షించి, కొత్త పరిశ్రమల ఏర్పాటుతోపాటు ఇప్పటికే ఉన్న మిల్లుల ఆధునీకరణకు ప్రత్యేక పెట్టుబడి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో అమలు చేసిన టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ ఫండ్ స్కీమ్ తరహాలో పథకాన్ని పునఃప్రవేశపెట్టి, ఆధునిక టెక్స్‌టైల్ యంత్రాలపై పెట్టుబడి వ్యయంలో 20 శాతం వరకు ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సెంటివ్ ఇవ్వాలని సూచించారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్(ఎన్‌టీటీఎం) పథకాన్ని సద్వినియోగం చేసుకుని భవ్య పార్క్‌తో పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. టెక్నికల్ టెక్స్‌టైల్ రంగంలో ఆధునిక సాంకేతిక, అధిక విలువ కలిగిన ఉత్పత్తులు, కొత్త పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఎన్‌టీటీఎం అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ఎంపీని కలసిన వారిలో అసోసియేషన్ నాయకులు డి.బ్రహ్మానందం, ఆర్.సత్యనారాయణ, రాఘవరెడ్డి, కేవీ ప్రసాద్, బి.రామకృష్ణ, జి.కోటేశ్వరరావు, కె.రమేష్, దానారెడ్డి తదితరులున్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జంపని నరేష్‌బాబుపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు. రాజశేఖర్ రావు, ఎం.కళాధర్ శుక్రవారం ఓప్రకటనలో డిమాండ్ చేశారు. కారు రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైనది కాకుండా, తిరిగి ఉపాధ్యాయుడిపై దాడి చేయడం కారు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందని, ఎవరు బాధ్యులనేది లేకుండాఉపాధ్యాయుడిపై భౌతిక దాడి చేయడం తగదని, తక్షణమే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సైతం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, ఉపాధ్యాయుడు నరేష్ బాబుకు పూర్తి సంఘీభావం తెలిపారు.
ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు ఏపీ టెక్స్‌టైల్ మిల్స్ అసోసియేషన్ వినతి


