ఎంఎస్‌ఎంఈ పార్కుపై వివాదం | - | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ఎంఈ పార్కుపై వివాదం

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

ఎంఎస్‌ఎంఈ పార్కుపై వివాదం ● నిర్మాణానికి అభ్యంతరాలు ఏంటని జిల్లా కలెక్టర్‌ ప్రశ్న ● వ్యతిరేకించిన అన్నదాతలు ● ఆలయం ముందు ధర్నాకు దిగిన రైతు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండల గ్రామం గోవాడలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీబాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో ఏటా మహాశివరాత్రి తిరునాళ్ల జరిగే డొంక రోడ్డు ప్రదేశంలో ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణం మరోసారి చర్చకు వచ్చింది. ప్రజావ్యతిరేకత, విజిలెన్స్‌కు ఫిర్యాదుతో నిర్మాణ పనులు నిలిచిపోయిన నేపథ్యంలో శుక్రవారం గోవాడ అలయానికి వచ్చిన బాపట్ల జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఈ అంశాన్ని ప్రస్తావించటం వివాదానికి దారితీసింది. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేయటమే కాకుండా ఒక రైతు ఆలయం ముందు ధర్నాకు దిగారు.

స్థానికుల్లో కలకలం

మండల కేంద్రం అమృతలూరులోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మండల స్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, రేపల్లె ఆర్డీవో శ్రీదేవి తదితర అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం గోవాడ ఆలయానికి సంబంధించి మహాశివరాత్రి తిరునాళ్ల జరిగే డొంక ప్రదేశానికి జిల్లా కలెక్టరు చేరుకున్నారు. గ్రామ సర్పంచ్‌ భర్త మండవ రమేష్‌, ఇతర గ్రామస్తులు అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణాన్ని మొత్తం డొంక ప్రదేశంలో కాకుండా మూడు ఎకరాల్లో నిర్మిస్తే ఏమైనా అభ్యంతరం ఉందా అని కలెక్టర్‌ ప్రశ్నించారు. దీంతో గ్రామస్తుల్లో కలకలం రేగింది. అత్యంత వైభవంగా జరిగే తిరునాళ్ల ప్రదేశాన్ని ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణం తగదని చెప్పాం కదా... పంచాయతీలో తీర్మానం చేయటం ఏంటని సర్పంచ్‌ భర్తను ప్రశ్నించారు. తర్వాత అదే తీర్మానాన్ని రద్దు చేసినట్టు చెప్పారు. మళ్లీ ఇప్పుడు పార్కు నిర్మాణం ప్రతిపాదన ఏంటని ప్రశ్నించారు.

క్షమాపణ చెప్పాల్సిందే...

గ్రామ రైతు వేమూరు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ తన పొలం ఎదుట మూడు ఎకరాల డొంకలో పార్కు నిర్మాణానికి ససేమిరా అన్నారు. పంటల నూర్పిడికి తనకు అవకాశం ఉండదన్నారు. ఈ వాగ్వాదంలో ఇద్దరు ఆ రైతును పక్కకు తోశారు. అక్కణ్నుంచి జిల్లా కలెక్టర్‌ దేవాలయానికి వెళ్లి, అక్కడ స్థానికులతో మాట్లాడుతుండగా చంద్రశేఖర్‌ అక్కడకు వెళ్లి గుడి ముందు ధర్నా చేశారు. తనను నెట్టినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొంతసేపు వాదప్రతివాదనల అనంతరం అతడికి క్షమాపణ చెప్పటంతో వివాదం ముగిసింది. డొంకరోడ్డులో పార్కు నిర్మాణానికి నిబంధనలు అంగీకరించవని తెలిసినా, అధికారులు బంజరు భూమిగా చూపి, నిర్మాణానికి పూనుకోవటం తెలిసిందే. దీనిపై తెనాలి, అమృతలూరు మండలాలకు చెందిన వారు విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. కోర్టులో కూడా పిటిషను దాఖలు చేశారు. దీనితో నిర్మాణ పనులు ఆపేసి, సామగ్రిని కూడా సదరు కాంట్రాక్టు సంస్థ తీసుకెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ పర్యటనలో చేసిన వ్యాఖ్యతో వివాదం నెలకొనటం చర్చనీయాంశమైంది.

Advertisement
 
Advertisement
Advertisement