వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణి
కొత్తరెడ్డిపాలెంలో వంద మందికి అస్వస్థత కలుషితాహారంతో మంచం పట్టిన దళితవాడ జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వో, అధికారుల పరిశీలన ఇంటింటి సర్వే చేపట్టిన వైద్య సిబ్బంది
మెరుగైన వైద్య సేవలు అందించండి
చేబ్రోలు: కలుషిత ఆహారం తినటంతో కొత్తరెడ్డిపాలెం దళితవాడలో శుక్రవారం సుమారు వందమందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావటంతో స్థానికంగా కలకలం రేగింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం పాత దళితవాడ ప్రాంతంలో గత మూడు రోజులుగా ప్రార్థన కూటములు జరిగాయి. హాజరైన భక్తులకు మొదటి రెండు రోజులు శాకాహార భోజనం అందించారు. చివరి రోజు గురువారం రాత్రి చికెన్ బిర్యానీని అందజేశారు. బిర్యానీ తిన్న కొంతమంది అస్వస్థతకు గురవటంతో శుక్రవారం తెల్లవారుజామున రాజేష్, వజ్రం, జయరాణిలను 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానిక ప్రైవేటు వైద్యుని వద్ద మరి కొంతమంది చికిత్సలు పొందారు. ఉదయం నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరిగిపోయింది.
ప్రత్యేక వైద్య శిబిరం
స్థానిక తెలుగు బాపిస్టు చర్చిలో అత్యవసరంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతున్న వారు అధిక సంఖ్యలో వచ్చారు. కుర్చీలలో, బల్లల మీద కూర్చోబెట్టి సైలెన్ ఎక్కించారు. తర్వాత సమీపంలోని పీహెచ్‌సీ నుంచి బెడ్‌లను తెప్పించి బాధితులకు సైలెన్ సీసాలు పెట్టారు. వైద్య చికిత్సలు మొదలు పెట్టారు. నీరసంగా ఉన్న మరో నలుగురిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేబ్రోలు, వట్టిచెరుకూరు ప్రాంతాల నుంచి రెండు 108 వాహనాలను మెడికల్ క్యాంపు వద్ద అందుబాటులో ఉంచారు.
అధ్వానంగా పారిశుద్ధ్యం
దళితవాడ ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ఎక్కడ మురుగు అక్కడే, చెత్తా చెదారం నిల్వ ఉండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు వస్తున్నారనే సమాచారంతో పంచాయతీ సిబ్బంది హడావుడిగా చర్చి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసే పనిలో పడ్డారు. రోజూ తమ ప్రాంతానికి పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రావటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వైద్య సేవలకు ఆదేశం
బాధితుల సంఖ్య అధికంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పరిస్థితిని సమీక్షించారు. వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మూడు రోజుల పాటు ప్రార్థన కూటమి జరిగిందని, అక్కడ బిర్యానీ తిన్న తర్వాత గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం నుంచి అస్వస్థతకు గురైనట్లు బాధితులు వివరించారు. వైద్య సిబ్బందికి షిఫ్టులవారీగా విధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇంటింటి సర్వే నిర్వహించటంతోపాటు అనుమానితులందరికీ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. బాధితులకు మంచి ఆహారం అందజేయాలన్నారు. బెడ్‌లు, పరుపులు, కూలర్లు అవసరం మేరకు ఏర్పాటు చేయాలని తెనాలి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారిని ఆదేశించారు. ప్రస్తుతం 44 మంది అస్వస్థతకు గురైనట్లు కలెక్టర్‌కు అధికారులు వివరించారు.
పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్
గ్రామంలో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని డీపీవో సాయికుమార్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నీటి నమూనాలు సేకరించి నివేదికను అందజేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈకి ఆదేశాలు జారీ చేశారు. ప్రార్థన కూటమి నిర్వహించిన సంఘ పెద్దతో కలెక్టర్ మాట్లాడారు. చికెన్ ఎక్కడ కొనుగోలు చేశారు.. ఎన్ని గంటలకు తయారు చేసి, ఎప్పుడు భోజనాలు పెట్టారు.. వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. యడ్లపాటినగర్‌లోని షాపులో చికెన్ కొనుగోలు చేసినట్లు తెలపటంతో షాపులో తనిఖీ చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దారు కె. శ్రీనివాసవర్మ, ఎంపీడీవో ఊహారాణి తదితరులు పాల్గొన్నారు.
అదుపులోనే పరిస్థితి
గుంటూరు వెస్ట్: కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో 11, 12, 13 తేదీల్లో బాప్టిస్ట్ ప్రేయర్ హాలులో ప్రార్థన కూటములు జరిగాయన్నారు. 13వ తేదీ రాత్రి దాటిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారని, అక్కడికి రాని వారి ఇంటికి ఆహారాన్ని పంపించినట్లు తెలిసిందన్నారు. 14న ఉదయం, కొంత మంది మధ్యాహ్నం కూడా తిన్నారని తెలిపారు. దాదాపు 100 మంది భోజనం చేయగా 44 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. నలుగురి పరిస్థితి ఇబ్బందిగా మారడంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి పంపామన్నారు.
ముందు రోజు నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు పదుల సంఖ్యలో వచ్చినప్పటికీ వైద్యసిబ్బంది స్పందించికపోవటంతో బాధితుల సంఖ్య అధికమైంది. తెనాలి, గుంటూరు వైద్యశాలలకు బాధితులు వెళ్లటంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. డీఎంహెచ్‌వో కె.విజయలక్ష్మి, తెనాలి డిప్యూటీ డీఎంహెచ్‌వో అన్నపూర్ణమ్మలు మధ్యాహ్నం ఆ ప్రాంతానికి వ,చ్చారు. ఇంటింటికీ తిరిగి పరిస్థితిని అంచనా వేశారు. వైద్య సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాధితుల సంఖ్యను గుర్తించే పని చేపట్టారు.
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో 38 డయేరియా కేసుల నమోదుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం అధికారులతో చర్చించారు. కలుషిత ఆహారం కారణంగా ఈ కేసులు నమోదైనట్లు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి వివరించారు. ముగ్గురిని చేబ్రోలు పీహెచ్‌సీకి తరలించి, అనంతరం తెనాలి జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. దీనికి ప్రధాన కారణం కలుషిత ఆహారమేనని మంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు.


