ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించే రెండు సంంత్సరాలు కాలపరిమితి గల బీపీఈడీ, డీపీఈడీ కోర్సులలో ప్రవేశానికి ఏపీ పీసెట్–2026 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఏపీ పీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాల్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకూ ఎటువంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏఎన్‌యూలో 2026–2027 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి రూ.1000 అపరాధ రుసుంతో 20వ తేదీ వరకూ, రూ.2000 అపరాధ రుసుంతో మే 25వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసిన వారు తమ తప్పులను 24 నుంచి 26వ తేదీలోగా సరిదిద్దుకోవచ్చన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లను మే 28 నుంచి వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌లోని తేది, సమయం ప్రకారం పరీక్షకు హాజరు కావాలన్నారు. ఏపీ పీసెట్ 2026 దేహదారుఢ్య పరీక్ష, క్రీడానైపుణ్య పరీక్షలు జూన్ 3వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ప్రారంభమవుతాయని తెలిపారు. పూర్తి వివరాలు వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
వైస్ చాన్సలర్ డాక్టర్ పి.వి.సత్యనారాయణ
బాపట్ల: విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రపంచ స్థాయి పోటీలకు సిద్ధం కావాలి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ పేర్కొన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల 81వ వార్షికోత్సవ సభ శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ విద్యకు బాపట్ల వ్యవసాయ కళాశాల ఒక చారిత్రాత్మక కేంద్రంగా నిలిచిందని చెప్పారు. ఎనిమిది దశాబ్దాలుగా అనేక మంది శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులను ఈ కళాశాల అందించిందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, నూతన పద్ధతులను రైతులకు చేరవేయడంలో కళాశాల కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. దిగుబడులు పెంచడం, ఖర్చులు తగ్గించడం, నాణ్యమైన ఉత్పత్తులు సాధించడం సాధ్యమవుతోందన్నారు. శాస్త్రవేత్తలు గ్రామాలకు వెళ్లి రైతులకు ప్రత్యక్షంగా సూచనలు అందిస్తూ వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. క్రమశిక్షణ, సేవాభావం, పరిశోధనా దృక్పథంతో ముందుకు సాగి రైతు సంక్షేమానికి తమ వంతు సేవ చేయాలని ఉపకులపతి పిలుపునిచ్చారు. అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూనా రాణి కళాశాల గత ఏడాది విద్య రంగంలో సాధించిన విజయాలతోపాటు క్రీడలు, మరియు సాంస్కృతిక పోటీలలో సాధించిన ఓవర్ ఆల్ చాంపియన్ షిప్ వివరాలతో కూడిన వార్షిక నివేదికను సమర్పించారు. సభకు డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ సి.హెచ్. శ్రీనివాస రావు అధ్యక్షత వహించగా, విశిష్ట అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఆహార ప్రాసెసింగ్ సొసైటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ జి.శేఖర్ బాబు(ఏ.ఎఫ్.ఎస్.) ఆధునిక వ్యవసాయ చరిత్రలో బాపట్ల వ్యవసాయ కళాశాల చేస్తున్న సేవలను కొనియాడారు. అతిథిగా పాల్గొన్న ఐ.సి.ఏ.ఆర్. డైరెక్టర్, అటారీ సౌత్ జోన్ డాక్టర్ షేక్ ఎన్.మీరా మాట్లాడుతూ విద్యార్థులే వ్యవసాయ రంగ భవిష్య నిర్దేశకులని పేర్కొన్నారు. ఆఫీసర్ ఇన్‌చార్జి స్టూడెంట్ ఆక్టివిటీస్ డాక్టర్ ఎం.శ్రీరేఖ వందన సమర్పణ చేశారు.


