
9న మున్సిపల్ కార్యాలయాల ఎదుట టూల్‌డౌన్
మంగళగిరి టౌన్: మున్సిపల్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో నంబరు 36పై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, వైఎస్సార్‌ట్రేడ్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. మంగళగిరి నగర పరిధిలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన అన్ని మున్సిపల్ కార్యాయాల వద్ద టూల్‌డౌన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 36పై స్పష్టత ఇవ్వకపోవడం, అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండికోట దుర్గారావు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడు రత్నాకరం శ్రీనివాసరాజు, పట్టణ వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షుడు నక్క నాగరాజు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలి
గుంటూరు మెడికల్: మున్సిపాలిటీ తరహా పారామెడికల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని పారా మెడికల్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.రమేష్ బాబు అన్నారు. ఆయన బుధవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ వెద్య ఆరోగ్య శాఖలో పారామెడికల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కీలక సేవలు అందిస్తున్నారన్నారు. తక్కువ జీతాలతో ఎక్కువ గంటలు పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తేనే సమస్యలను పట్టించుకుంటారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీతాలు పెంచాలని పేర్కొన్నారు. సీనియారిటీ ప్రకారం కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ముగ్గురు మంత్రుల కమిటీలోని తుది నిర్ణయాలు న్యాయం చేసేలా చూడాలని, లేదంటే ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు.
‘విద్యా శక్తి’పై నిర్బంధం తగదు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించిన విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధం చేయడం తగదని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ కె.నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుకను కలిసిన నాయకులు తమ ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ పలుచోట్ల విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధంగా నిర్వహిస్తున్నారని అన్నారు. అలసిపోయిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. హెచ్‌ఎంలకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. డీఈవో మాట్లాడుతూ కార్యక్రమం నిర్బంధ కాదని, ఐచ్ఛికమేనని తెలిపారు. ఫ్యాప్టో జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్‌రావు, డీకే సుబ్బారెడ్డి, ఎండీ ఖలీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుమలేష్, ఎం.కళాధర్, డి.పెదబాబు, బాలాజీ, వై.శ్యాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

9న మున్సిపల్ కార్యాలయాల ఎదుట టూల్‌డౌన్

9న మున్సిపల్ కార్యాలయాల ఎదుట టూల్‌డౌన్