మస్తిష్కం మరణ వేదన
జీజీహెచ్‌లో కార్పొరేట్ వైద్యం
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో పక్షవాతం బాధితులకు కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. పది పడకలతో రూ.50 లక్షలతో నిర్మించిన ఆధునిక స్ట్రోక్ యూనిట్‌లో 2015 అక్టోబర్ నుంచి వైద్యుసేవలు అందిస్తున్నాం. రెండు తెలుగురాష్ట్రాల్లో స్ట్రోక్ యూనిట్ కలిగి ఉన్న ఏకైక ప్రభుత్వ ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్.
– డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, న్యూరాలజీ వైద్యవిభాగాధిపతి గుంటూరు జీజీహెచ్
20శాతం కేసులకు ఆపరేషన్లు తప్పనిసరి
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారిలో నూటికి 80శాతం మందికి మందులతో నయమైపోతుంది. 20శాతం మంది మెదడులో రక్తపుగడ్డ పెద్దసైజులో ఉంటుంది. అప్పుడు శస్త్రచికిత్స తప్పనిసరి.
– డాక్టర్ భవనం హనుమశ్రీనివాసరెడ్డి, న్యూరోసర్జన్, జీజీహెచ్ గుంటూరు.
గోల్డెన్ అవర్ కీలకం
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత తొలి మూడు గంటలూ గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. ఈలోపు సరైన వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు.
– డాక్టర్ పమిడిముక్కల విజయ, ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, గుంటూరు
గుంటూరు మెడికల్: ఆధునిక జీవనశైలి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. దీనినే పక్షవాతం అని కూడా అంటారు. దీనిని నూటికి 80శాతం నివారించవచ్చని, అవగాహన లేకపోవటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌కు రోజూ 15 మంది వరకు పక్షవాతానికి గురైన వారు వైద్యం కోసం వస్తున్నారు. జిల్లాలో 30 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు ఉన్నారు. రోజూ ఒక్కో వైద్యుడి వద్దకు మూడు నుంచి ఐదుగురు పక్షవాత బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి 70 లక్షల మంది పక్షవాతం బారిన పడుతున్నారు. వీరిలో 65 లక్షల మంది చనిపోతున్నారు. మన దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు పక్షవాతానికి గురవుతున్నారు. సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల వ్యాధి విషమంగా మారుతుందని, ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొందరు ఆకుపసర్లు మింగుతూ కాలయాప చేయడం వల్ల పరిస్థితి విషమిస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఎందుకొస్తుందంటే..!
రక్తనాళాలు పూడుకుపోవటం వల్ల మెదడుకు రక్తసరఫరా ఆగిపోతే పక్షవాతం వస్తుంది. పక్షవాతం అంటే బ్రెయిన్ అటాక్. హార్ట్ అటాక్‌లాగే ఇది చాలా ప్రమాదకరం. రక్తపోటు(బీపీ) పెరిగి రక్తనాళాలు దెబ్బతిని చిట్లిపోవడం వల్ల పక్షవాతం వస్తుంది. అధికరక్తపోటు, మధుమేహం, మెదడులో కణుతులు, రక్తంలో కొవ్వు పదార్ధాల వల్ల పక్ష వాతం వచ్చే అవకాశం ఎక్కువ. మెదడువాపు, గుండెజబ్బలూ పక్షవాతానికి దారితీయొచ్చు. స్థూలకాయుల్లోనూ, 70 ఏళ్లు దాటిన వారిలో ఈ వ్యాధి అధికంగా వచ్చే అవకాశం ఉంది.
లక్షణాలు..
పక్షవాతం వచ్చినవారిలో ఒకే వస్తువు రెండుగా కనబడటం, మాట తడబడటం, మింగుడు పడకపోవటం, కళ్లు, తల తిరగటం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, నడకలో తూలుడు, మూతి వంకరపోవటం, దృష్టి మందగించటం, కాళ్ళు చేతులు ఉన్నట్టుండి బలహీన పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో రోగి కోమాలోకి వెళ్తాడు.
ముందు జాగ్రత్తలతో రక్షణ
ముందు జాగ్రత్త చర్యలతో పక్షవాతం రాకుండా చూసుకోవచ్చు. రక్తపోటు, షుగర్‌ను అదుపులో పెట్టుకోవాలి. మద్యం, ధూమపానాలకు దూరంగా ఉండాలి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినకూడదు. రోజూ వ్యాయామం చేయటం మంచిది.
బ్రెయిన్ స్ట్రోక్.. బీకేర్‌ఫుల్ చిన్న వయస్సులోనే స్ట్రోక్ మరణాలు 80 శాతం పక్షవాతాన్ని నివారించవచ్చు ఆశ్రద్ధ చేస్తే ముప్పు తప్పదు గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా కార్పొరేట్ వైద్యం
యుక్త వయసులోనే స్ట్రోక్
కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరుకు చెందిన వెంకటనాగయ్య, పరిమళ దంపతుల కుమారుడు రిషికేష్ పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 17న టెన్త్ పరీక్షలు రాసి వచ్చాడు. సాయంత్రం విపరీతమైన తలనొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పి మంచంపై వాలిపోయాడు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కంగారు పడిన తల్లిదండ్రులు కర్నూలులోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షలు చేసి బ్రెయిన్ స్ట్రోక్ అని నిర్ధారించారు. ఆపరేషన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఆధునిక జీవన శైలి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వయస్సుతో సంబంధం లేకుండా వస్తుందనేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ.
జీజీహెచ్‌లో చికిత్స పొందిన
బ్రెయిన్ స్ట్రోక్ బాధితులు ఇలా..
సంవత్సరం రోగుల సంఖ్య
2022 515
2023 540
2024 450
మస్తిష్కం మరణ వేదన
మస్తిష్కం మరణ వేదన
మస్తిష్కం మరణ వేదన


