
మూడు మండలాల్లో వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు మూడు మండలాల్లో వర్షం పడింది. మంగళగిరి మండలంలో 16.6 మిల్లీమీటర్లు, తుళ్ళూరు మండలంలో 5.8 మి.మీ., కొల్లిపర మండలంలో 5.2 మి.మీ. చొప్పున వర్షం పడింది. మే 21 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 42.2 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 83.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
కాశీలో నృత్యనీరాజనానికి తెనాలి చిన్నారులు
తెనాలి: పట్టణానికి చెందిన నృత్యశిక్షణ సంస్థ శ్రీకళ్యాణి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి అరుదైన అవకాశం లభించింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో శ్రీకాశీ విశ్వనాథ్‌స్వామి ఆలయంలో నర్తించే అవకాశం లభించింది. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, శ్రీకాశీ విశ్వేశ్వర ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 25న అక్కడ జరిగే నృత్యనీరాజనంలో నృత్యాంశాలను ప్రదర్శించనున్నట్టు అకాడమీ వ్యవస్థాపకురాలు, ప్రముఖ నృత్యగురువు డాక్టర్ చల్లా బాలత్రిపుర సుందరి తెలిపారు. తెనాలి నుంచి తమ బృందానికి మాత్రమే ఈ అవకాశం లభించిందని చెప్పారు. తనతోపాటు వలివేటి మోక్షిత, చలమలశెట్టి మహతి, వల్లూరు వరలక్ష్మి, పావని, భావజ్ఞసాయి సహా మొత్తం 21 మంది అక్కడ బృంద నాట్యాలను ప్రదర్శించనున్నట్టు వివరించారు. బృందంలోని కొంతమందితో బయలుదేరి వెళ్లారు.