నిందితులను వెంటనే అరెస్టు చేయాలి | Sakshi
Sakshi News home page

నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

Published Wed, May 22 2024 9:05 AM

నింది

● సచివాలయ ఉద్యోగి హత్య కేసును ఆత్మహత్యగా చిత్రీకరించొద్దు ● పొన్నూరు అంబేడ్కర్‌ సెంటర్‌లో కుటుంబ సభ్యుల నిరసన ● దారుణం జరిగి 14 రోజులైనా చర్యల్లేవని ఆందోళన

పొన్నూరు: సచివాలయ ఉద్యోగి హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు సోమవారం పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హత్యను, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. వివరాల ప్రకారం కొల్లిపర మండలం సిరిపురం గ్రామానికి చెందిన తుల్లిమిల్లి కిషోర్‌బాబు పట్టణ పరిధిలోని సచివాలయంలో ఎమినిటీస్‌ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. తన భార్య చంద్రకళ సచివాలయ మహిళా పోలీస్‌గా విధులు నిర్వహిస్తోంది. వీరిద్దరికీ 11 నెలల క్రితం వివాహం జరిగింది. తన భార్య బదిలీపై మాచర్ల నుంచి పొన్నూరు రావడంతో కిషోర్‌బాబు కూడా పొన్నూరుకు బదిలీ చేయించుకున్నాడు. హఠాత్తుగా ఈనెల 7న కిషోర్‌బాబు నిడుబ్రోలు చెరువులో శవంగా తేలాడు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. మృతుడి ఒంటిపై గాయాలను గుర్తించిన కుటుంబ సభ్యులు కిషోర్‌బాబు మృతిపై అనుమానాలు ఉన్నాయని, అతని భార్య, కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల అజాగ్రత్త వల్లే హత్య

కేసు నమోదై 14 రోజులు గడుస్తున్నా కిషోర్‌బాబు హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసు కోలేదని, నిందితులను తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు సోమవారం నిరసన చేపట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. భార్య, బావమరుదులు, వారి పెదనాన్న తనను హత్య చేసేందుకు యత్నిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఈ నెల 6న కిషోర్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడని, అప్పుడే వారు చర్యలు తీసుకుని ఉంటే కిషోర్‌బాబు బతికి ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రాత్రే కిషోర్‌బాబు శవమై చెరువులో తేలాడని కన్నీరుమున్నీరయ్యారు. కిషోర్‌బాబు మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమవడంతో రూరల్‌ ఎస్‌ఐ భార్గవ్‌ ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు సర్దిచెప్పి న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు.

న్యాయం చేయండి

నా కొడుకును దారుణంగా కొట్టి చంపిన వారిని వారిని వెంటనే అరెస్టు చేయాలి. కేసును నీరుగార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. హత్యకు గురైన నాకొడుకు మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నా చేత సంతకం చేయించుకున్నారు. వెంటనే బాధ్యులపై కేసు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చేయాలి. న్యాయం చేయాలని కోరుతున్నా.

– ప్రేమలత, కిషోర్‌బాబు తల్లి

నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
1/1

నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

Advertisement
 
Advertisement
 
Advertisement