అ‘ధిక్కారుల’పై ఈసీ వేటు | - | Sakshi
Sakshi News home page

అ‘ధిక్కారుల’పై ఈసీ వేటు

May 17 2024 10:00 AM | Updated on May 17 2024 10:00 AM

అ‘ధిక్కారుల’పై ఈసీ వేటు

అ‘ధిక్కారుల’పై ఈసీ వేటు

నరసరావుపేట: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. దీనికి బాధ్యులుగా పరిగణిస్తూ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ను బదిలీ, ఎస్పీ జి.బిందుమాధవ్‌ను సస్పెండ్‌ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతలు అదుపుతప్పడంపై విచారణకు ఆదేశించింది. కలెక్టర్‌ శివశంకర్‌ రెండేళ్ల నుంచి జిల్లాలో పనిచేస్తుండగా ఎన్నికలకు ముందే ఈసీ నియమించిన బిందు మాధవ్‌ అప్పుడే సస్పెండ్‌ కావటం గమనార్హం. ఎన్నికల ముందు వరకు సమర్థంగా జిల్లాను నడిపించిన ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డిని టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఈసీ తప్పించింది. బిందుమాధవ్‌ను ఎస్పీగా నియమించింది. పోలింగ్‌ రోజున మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు యథేచ్ఛగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నా నిలువరించలేకపోవటం, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు చేసిన ఫోన్‌లకు కలెక్టర్‌, ఎస్పీ స్పందించలేదనే విమర్శలు ఈసీ వరకు వెళ్లాయి. దీంతో చర్యలకు ఉపక్రమించింది.

అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం

పల్నాడు జిల్లాలో ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో అధికారయంత్రాంగం పూర్తిగా విఫలమైంది. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేయటంపై ఎమ్మెల్యేతోపాటు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ పలుమార్లు కలెక్టర్‌, ఎస్పీలకు ఫోన్‌ చేసినా స్పందించలేదు. వారు టీడీపీ నాయకులపై ఉదారంగా వ్యవహరించటంతో వారు రెచ్చిపోయి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. నరసరావుపేటలోని మున్సిపల్‌ బాలికోన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రం ఏజెంట్లుగా కూర్చున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, అతని అనుయాయులు దాడిచేసి బయటకు లాగి కొట్టినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ సమీపంలో ఉన్న ఎమ్మెల్యే డ్రైవర్‌ను టీడీపీ నేతలు చితక బాదారు. ఎమ్మెల్యే గోపిరెడ్డిని మధ్యాహ్నం రెండు గంటలకే హౌస్‌ అరెస్టుచేసిన పోలీసులు టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ చదలవాడలు యథేచ్ఛగా పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడినా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. మాచర్ల నియోజకవర్గంలో పోలీసులు మరీ విచ్రితంగా వ్యవహరించారు. సమస్యాత్మకంగా లేకపోయినా వైఎస్సార్‌సీపీ సానుకూల గ్రామాలకు రెంటికి ప్రత్యేకంగా డీఎస్పీని నియమించి పోలింగ్‌ నిర్వహించారు. సమస్యాత్మక మండలంగా పేరుగాంచిన కారెంపూడి మండలంలో సరైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదు. ఏడెనిమిది గ్రామాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారనే విమర్శలు పోలీసులపై వెల్లువెత్తాయి. ఎన్నికల మరుసటిరోజు గొడ్డళ్లు, రాడ్లు, మారణాయుధాలతో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పచ్చమూకలు కారెంపూడికి వచ్చి వైఎస్సార్‌ సీపీ వర్గీయులపై దాడులు చేస్తున్నా పోలీసులు నిలువరించలేకపోయారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్యపై దాడినీ పోలీసులు ఆపలేకపోయారు. మంత్రి అంబటి రాంబాబుకు ఒక సీఐ రివాల్వర్‌ గురిపెట్టాడంటే ఆ ధైర్యం అతనికి ఎస్పీ నుంచే వచ్చిందనే వాదన వినపడుతోంది. గురజాలలోని కొత్తగణేశునిపాడులో బీసీ వర్గాలను పలుకరించేందుకు వెళ్లిన పి.అనిల్‌, కాసు మహేష్‌రెడ్డిలపై టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడడం కూడా పోలీసుల ఉదాసీనతకు నిదర్శనంగా ఉంది. ఎన్నికల ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా జిల్లాలో 144 సెక్షన్‌ అమలులో ఉండడం విస్మయం కలిగిస్తోంది. దీంతో వీటిన్నింటికీ కలెక్టర్‌, ఎస్పీలే బాధ్యులని నిర్ణయానికొచ్చిన ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. వీరితోపాటు గురజాల డీఎస్పీ పల్లపురాజు, నరసరావుపేట డీఎస్పీ వర్మ, ఇద్దరు స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐలు, కారంపూడి, నాగార్జునసాగర్‌ ఎస్‌ఐలపైనా ఈసీ వేటు వేసింది.

పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ బదిలీ ఎస్పీ బిందుమాధవ్‌ సస్పెన్షన్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement