బడ్జెట్లు మనుషుల కోసం కాదా?

Union Budget 2023: Overview, Highlights Of Budget By Nirmala Sitharaman - Sakshi

కేంద్ర బడ్జెట్‌లో పరిశ్రమలు, పనిముట్లు, యంత్రాలు, కార్లు, ఇతర ప్రాణంలేని వస్తువుల ప్రస్తావనే అత్యధికం. ఈ ‘అమృత్‌ కాల్‌’ బడ్జెట్‌లో అమృతం ఉంది. అది మనుషులను బతికించేందుకు కాదు. మనుషులను నిరుపయోగంగా మార్చేసే సాంకేతిక విప్లవానికీ, ఆధునికీకరణ యంత్రాలకూ. బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు పార్లమెంటులో ఉంచే ఎకనామిక్‌ సర్వే ఉద్దేశ్యం మంచిదే. 2014–15 వరకు ‘సోషల్‌ సెక్టార్‌’ పేరుతో ఒక చాప్టర్‌ ఉండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, పిల్లలు, వారి సమస్యలు... పాత విధనాల సమీక్ష, కొత్త పథకాల రూపకల్పన ఆలోచనలు సంక్షిప్తంగా నైనా ఉండేవి. 2015–16 నుంచి ప్రకటిస్తున్న ఎకనామిక్‌ సర్వేలలో ఈ ‘సోషల్‌ సెక్టార్‌’ అధ్యాయం గల్లంతయ్యింది.

‘‘గత సంవత్సరం వందేళ్ళ భారత్‌’ పేరుతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పునాదుల మీద ఆధారపడి ఈ ఏడాది బడ్జెట్‌ రూపొందింది. అభివృద్ధి ఫలాలను అన్ని ప్రాంతాలు, అందరు పౌరులకు ప్రత్యేకించి యువత, మహిళలు, రైతులు, వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు అందిస్తూ సంపన్న సమ్మిళిత పురోగతిని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.’’ ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్న మాటలివి. ఇవి మాటలే. బడ్జెట్‌ ప్రసంగం మొదటి పేరాలోని పలుకులివి. మిగతా ప్రసంగంలో ఎక్కడా ఆ మాటలకు సంబంధించిన ప్రస్తావనా లేదు; నిధుల కేటాయింపు అంతకన్నా లేదు. బడ్జెట్‌ ప్రసంగంలో ఎక్కువ భాగం పరిశ్రమలు, పనిముట్లు, యంత్రాలు, కార్లు, ఇతర ప్రాణంలేని వస్తు వుల ప్రస్తావనే అత్యధికం. ‘అమృత్‌ కాల్‌’ బడ్జెట్‌ అని పేరుపెట్టుకున్న ఈ బడ్జెట్‌లో అమృతం చాలా ఉంది. అయితే అది మనుషులను బతికించేందుకు కాదు. మనుషులను నిరుపయోగంగా మార్చేసే సాంకేతిక విప్లవానికీ, ఆధునికీకరణ యంత్రాలకూ. అంటే ప్రాణంలేని వస్తువులకు నిరుపయోగ, నిష్ఫలామృతం.

ప్రభుత్వాలుగానీ, సంస్థలుగానీ, ఏదైనా బడ్జెట్‌ తయారు చేసు కునేటప్పుడు ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని, భవిష్యత్‌ బాగుకోసం పథకాలు రాసుకుంటారు. మనవాళ్ళు కూడా గతంలో ఆ సాంప్రదాయాన్ని పాటించారు. దానికే ‘ఎకనామిక్‌ సర్వే’ అని పేరుపెట్టారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు దీనిని పార్లమెంటు ముందుంచుతారు. ఎకనామిక్‌ సర్వే ఉద్దేశ్యం మంచిదే. అయితే 2014 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న సర్వే ఫార్మాట్‌ వేరు. ఆ తర్వాత దాని దారే వేరు. 2014–15 వరకు ‘సోషల్‌ సెక్టార్‌’ పేరుతో ఒక చాప్టర్‌ ఉండేది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, పిల్లలు, వారి సమస్యలు... ప్రగతి, పాత విధనాల సమీక్ష, కొత్త పథ కాల రూపకల్పన ఆలోచనలు సంక్షిప్తంగానైనా ఉండేవి. ఆశ్చర్యమేమి టంటే, 2015–16 నుంచి భారత ప్రభుత్వం ప్రకటిస్తున్న ఎకనామిక్‌ సర్వేలలో ఈ ‘సోషల్‌ సెక్టార్‌’ అధ్యాయం గల్లంతయ్యింది. 

దీనిని చాలా మంది ఆర్థిక వేత్తలు, బడ్జెట్‌ విశ్లేషకులు, ప్రతిపక్షాల పెద్దలతో సహా ఎవ్వరూ పట్టించుకున్నట్టు లేదు. అందరూ ఏదో లోకంలో ఉన్నారు. ‘అమృత్‌ కాల్‌’లో తేలియాడుతున్నారు. ఇది కేవలం అధ్యాయం గల్లంతు కావడం కాదు, ఆలోచనా సరళిలో లోపం. అందుకే ఈ బడ్జెట్‌లో గానీ, 2022 ఎకనామిక్‌ సర్వేలో గానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, పిల్లలు కూడా దూరమయ్యారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం, సమాజ స్థితిగతులు పట్టినట్టు కనిపించదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ దృష్టి కోణం భిన్నమైనది. సైద్ధాంతికంగానే వీళ్ళు ఈ దేశంలో కులమనే ఒక వ్యవస్థ ఉన్నట్టుగానీ, దానివల్ల ఏర్పడిన, కొనసాగుతున్న అసమానతలు, వివక్ష, అణచివేత ఉన్నట్టుగానీ భావించరు. అందరూ హిందువులే అనే భావన వారికి. అందుకే ఎస్సీ, బీసీల ఉనికి, వారి గురించిన ప్రత్యేక సామాజిక స్థితిగతులు వాళ్ల ఎన్నికల ప్రణాళికల్లో, బడ్జెట్‌లో అంతగా ప్రస్తావనకు రావు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఈ వర్గాల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిన దాఖలా లేదు. ప్రస్తుతం ఉన్న పథకాలను చాలా వాటిని నిర్వీర్యపరిచే పనికి కూడా పూనుకున్నారు. 

కేంద్రంలో ఎస్సీలు, బీసీలు, అనాథలు, దివ్యాంగుల కోసం కలిపి ఇప్పటికే ఒక మంత్రిత్వ శాఖ ఉన్నది. చాలామంది ప్రస్తుతం ఉన్న సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖను ఎస్సీల కోసమే ననుకుంటున్నారు. అది నిజం కాదు. అది ఎస్సీ, బీసీలకు కూడా. ఈ రెండు వర్గాలు కలిస్తే దాదాపు 65 శాతానికిపైగా ఉన్న సంగతిని కూడా ప్రభుత్వాలు మరచిపోయాయి. ఎస్సీ, బీసీలు కూడా మరిచి పోయారు. ఎస్సీ, బీసీలు కలిసి ఉన్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కోసం ఇప్పటి వరకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులను చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. 2015–16లో మొత్తం బడ్జెట్‌ 16 లక్షల 63 వేల కోట్లు కాగా, అందులో ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించింది కేవలం 5,380 కోట్లు. అంటే ఇది 0.32 శాతం మాత్రమే. అదేవిధంగా 2016–17లో 17 లక్షల 90 వేల కోట్ల మొత్తం బడ్జెట్‌లో కేటాయించింది 5,752 కోట్లు మాత్రమే. ఇది కూడా 0.32 శాతం దాటలేదు. అట్లా 2017–18లో 0.33 శాతం, 2018–19లో 0.31 శాతం. అదేవిధంగా 2020–21లో 35 లక్షల 90æవేల కోట్ల బడ్జెట్‌లో ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించింది కేవలం 8,065 కోట్లు. ఇది 0.23 శాతం. ప్రతి సంవత్సరం పెరగాల్సింది. కానీ దారుణంగా పడిపోయింది. ప్రతి ఏడాది ఆ మంత్రిత్వ శాఖకు బడ్జెట్‌ కేటాయింపులు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. కానీ దేశ బడ్జెట్‌ పెరుగుదలలో దానిశాతం పెరుగుతున్న దాఖలా లేదు.

రాజ్యాంగం అందించిన హక్కు ప్రకారం ప్రారంభించిన– ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధుల వినియోగం కూడా  దారుణంగా ఉంది. గతంలో దీనిని ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌గా పిలిచే వాళ్ళు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్‌ కమిషన్‌ను తొలగించి, దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పరిచారు. బడ్జెట్‌లో కూడా ప్లాన్, నాన్‌ ప్లాన్‌ పేర్లను తొలగించి రెవెన్యూ, క్యాపిటల్‌ అనే పదాలను మాత్రమే కొనసాగిస్తున్నారు. ప్లాన్, నాన్‌ ప్లాన్‌ లేనందువల్ల ఎస్సీ, ఎస్టీల కోసం ప్లాన్‌ నిధుల
నుంచి కేటాయించాల్సిన వాటిని ఎస్సీ కాంపోనెంట్‌గా, ఎస్టీ కాంపో నెంట్‌గా పిలుస్తున్నారు. అయితే జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిధులను కేటాయించాలి. వాటి వివరాలను చూస్తే కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత, ఆదివాసీ వ్యతిరేకత అర్థం కాగలదు.

గత ఎనిమిదేళ్ళలో ఎస్సీ కాంపోనెంట్‌ కింది కేటాయించిన నిధులు సగానికి పైగా దారి మళ్ళినట్టు వారి లెక్కల్లోనే కనిపిస్తున్నది. ఇప్పటికే సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్షలు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలను బాధిస్తున్నాయి. పేదరికం, ఆరోగ్యం, విద్య విషయంలో మిగతా సమాజానికీ ఎస్సీ, ఎస్టీలకూ మధ్య అగా«థం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, యాంత్రీకరణ, ఆధునికీకరణ విధా నాలు ఈ వర్గాలను మొత్తంగానే సమాజ ప్రగతి నుంచి దూరం నెడు తున్నాయి. ఈ బడ్జెట్‌లో కొత్తదేమీ లేదుకానీ, కోట్లాది మంది యువతకు నైపుణ్యాల శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఈ నైపుణ్యాల శిక్షణ గురించిన గత అనుభవాలు అంత మంచి ఫలితాలను ఇచ్చినట్టు లేవు. సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలతో కూడిన విద్యలు ప్రైవేట్‌ రంగంలో ఉంటాయి. ఇందులోకి ఎస్సీ, ఎస్టీ యువత వెళ్ళలేరు.
ఎందుకంటే, అందులో రిజర్వేషన్లు లేవు. అందుకే బడ్జెట్‌లో భారత దేశ సమాజం కనిపించాలి. దేశంలో ఉన్న అసమానతలను తొలగించడానికి పూనుకోవాలి. కానీ ఆ ప్రయ త్నాలను ప్రభుత్వం చేస్తున్నట్టు కనిపించడం లేదు. నా ఉద్దేశ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా లేదు. మొదట్లో చెప్పినట్లు దీనిని వాళ్లు అసలు సమస్యగానే చూడడం లేదు. ఇప్పుడు తమను తాము తరచి చూసుకోవాల్సింది ఆయా వర్గాలే. ప్రభుత్వాలు తమను పట్టించుకోకపోతే, ప్రజలు ఎందుకు ప్రభుత్వా లను పట్టించుకోవాలి? ఇదే ఇప్పుడు అందరూ ప్రశ్నించుకోవాల్సిన కీలకమైన సందర్భం.

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
‘ మొబైల్‌: 81063 22077

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top