అభివృద్ధీ... నీ పయనం ఎటు?

Sakshi Guest Column On Super Markets And Adulterated food

అభిప్రాయం

ఏడు సంవత్సరాల క్రితం 87 ఏళ్ల వయసులో మరణించిన భవిష్యత్తు వాది ఆల్విన్‌ టాఫ్లర్‌ ‘ఫ్యూచర్‌ షాక్‌’ అనే పుస్తకాన్ని 1970లో రాశాడు. వేగవంతమైన మార్పు ప్రజలను పిచ్చిగా మార్చుతుందని అందులో ఊహించారు. ఆ ఊహ నిజమే నని నా అనుభవాలే చెబుతున్నాయి.

75 ఏళ్ల వయసులో, ముందూ వెనుకా ఐదు తరాల వాళ్లను చూసిన మాలాంటి వారికి అభివృద్ధి పేరుతో వివిధ రంగాలలో చోటుచేసుకుంటున్న కొన్ని మార్పులు గమనిస్తుంటే ఆశ్చర్యం సంగతి అటుంచి, ఏంచేయాలో పాలుపోని పరిస్థితి కలుగుతున్నది. 

అన్నపూర్ణ లాంటి తెలుగు రాష్ట్రాలలో ఏ పట్టణంలో, ఏ హోటల్లో పోయినా కడుపునిండా తినే తెలుగువారి భోజనం దొరకదు. అన్నం, కూర, పప్పు, నెయ్యి, సాంబారు, రసం, గోధుమ పిండి రొట్టె, పూరీ లాంటి పదార్థాలతో భోజనం పెట్టే హోటళ్లు మచ్చుకైనా కానరావు. పేరుకు అన్నీ ఫైవ్‌ స్టార్, త్రీ స్టార్‌ హోటళ్లు. బిరియానీ, పలావ్, జింజర్‌ రైస్, పన్నీర్, మైదా పిండో మరేదో దానితో చేసిన బటర్‌ నాన్, నాన్, రోటీ, కుల్చా లాంటివి తినాల్సిందే. లేదా పస్తు ఉండాల్సిందే. ‘పేదరాసి పెద్దమ్మ’

సంస్కృతి రోజుల రుచికరమైన భోజనం, సత్రాల భోజనం, తరువాత కాలంనాటి ఉడిపి హోటళ్ళ భోజనాలు ఏమయ్యాయి? డాక్టర్‌ దగ్గరికి పోతే పాతరోజుల్లాగా ఒంటి మీద చేయి వేసి, స్టెతస్కోప్‌ పెట్టి పరీక్ష చేసి, చూడడం గత చరిత్ర అయిపోయింది. గుడికి పోతే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టనివ్వరు. తీర్థం ఒకచోట, ప్రసాదం ఇంకొక చోట ఇస్తారు. వివిధ రకాల సేవల పేరు మీద ఛార్జీలు ఉంటాయి. మొదట్లో పెద్ద గుళ్లకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామాలకు, చిన్నచిన్న దేవాలయాలకు కూడా పాకింది. అన్నింటికీ అనవసరమైన పరిమితులు. 

ఇంటికి కావాల్సిన నెలవారీ సరుకులు ఒకప్పుడు హాయిగా దగ్గరలోని  కొట్టుకుపోయి, స్వచ్ఛమైన, కల్తీలేని వాటిని, కొట్టువాడి ముందర పరీక్ష చేసి చూసుకుని, తూకం వేయించుకుని కొనుక్కునే వాళ్లం. ఇప్పుడు సంస్కృతి మారింది. పెద్దపెద్ద సూపర్‌ బజార్లలోకి పోయి, మనమే మనకు కావాల్సిన సామాన్లు వెతికి పట్టుకుని, ఒక బండిలో వేసుకుని తెచ్చుకోవాలి. అన్నీ ప్యాక్‌ చేసి ఉంటాయి. ఇన్ని గ్రాములు, ఇన్ని కేజీలు అని ఉంటుంది వాటిమీద. నిజంగా అంత తూకం ఉంటాయా లేదా అనేది సందేహమే! పైగా ఒక ఎక్స్‌పైరీ డేట్‌ వేస్తారు.

అందులో ఎంత కల్తీనో తెలుసుకునే మానిటరింగ్‌ మెకానిజం లేదనాలి. సరుకు తెచ్చుకున్న తరువాత  ప్యాకెట్లు విప్పిచూస్తే కొన్నిట్లో పురుగులు ఉంటాయి. ఇదేంది అని అడిగితే పాకింగ్‌ చేసింది మేం కాదుకదా! అని జవాబు. ఇక మెడికల్‌ షాప్‌కు పోతే మనకు కావాల్సింది ఒక ఐదారు టాబ్లెట్స్‌ అయినా... షాపువాడు మొత్తం స్ట్రిప్‌ కొనమంటాడు.  

ఏ వస్తువు కొన్నా (ఫర్నిచర్‌ దగ్గర నుండి, ఎలక్ట్రానిక్‌ పనిముట్ల వరకు) వాటికి రిపేర్‌ వస్తే, కొన్న చోట కాకుండా వేరే వర్క్‌ షాప్‌కు వెళ్లాలి. వాళ్లకు ఫోన్‌ చెయ్యాలంటే, టోల్‌ ఫ్రీ అనే నెంబర్‌కు చేయాలి. అది ఏ దేశంలో ఉంటుందో తెలియదు. వాళ్లు ‘ఒకటి నొక్కు, రెండు నొక్కు...’అంటూ డిస్కనెక్ట్‌ చేస్తారు.  

అసలు చిన్న చిన్న దుకాణాల సంస్కృతి పూర్తిగా పోవడం చాలా దురదృష్టకరం. చిన్నతనంలో తెల్ల కాగితాలు, పెన్సిల్, సిరా బుడ్డి, పిప్పరమింట్లు, చాక్లెట్లు, నువ్వుల జీడీలు, బిస్కట్లు లాంటివి కొనుక్కోవడానికి అక్కడక్కడ చాలా చిన్నచిన్న దుకాణాలు ఉండేవి. ఇప్పుడు చిన్న గుండు సూది కొనాలన్నా పెద్ద షాపునకు పోవాల్సిందే! అధిక ధరలు చెల్లించాల్సిందే. ఇంటి ముందుకు, తాజా కూరగాయలు తెచ్చి అమ్మే రోజులు పోయి కూరగాయల మార్కెట్లు వెలిశాయి. వాటిమీద బతికేవారు ఉపాధి కోల్పోయారు. 

ఫ్యామిలీ డాక్టర్‌ సంస్కృతీ పోయింది, పరాయి ఊరుకు వెళ్లినప్పుడు బంధువుల ఇళ్లలో ఉండే అలవాటు పోయింది. చక్కటి, చిక్కటి స్వచ్ఛమైన పాలను ఇంటి ముందర కొనుక్కునే ఆచారం పోయింది. ఇంటి వెనుక పెరుగు చిలికిన చల్ల కడుపు నిండా తాగే రోజులు పూర్తిగా పోయాయి. వేరు శనగపప్పుతో ఎవరికివారు శనగ నూనె చేయించుకుని ఏడాది పొడుగూతా వాడే అలవాటు పోయింది. నడక ప్రయాణం కనుమరుగైంది.

కడుపు నిండా భోజనం తినే సంస్కృతి స్థానంలో పిజ్జా, బర్గర్స్‌ వచ్చాయి. స్వచ్చమైన వెన్న, నెయ్యి లభ్యమయ్యే ప్రదేశాలు మచ్చుకైనా లేవు. జొన్న చేలలో ఉప్పు, కారం కలుపుకున్న దోసకాయలు తినే రోజులు ఇకరావేమో! చేలల్లో పెసరకాయలు వలుచుకు తినే అదృష్టం ఇక లేనట్టేనేమో. అన్నీ ఫాస్ట్‌ ఫుడ్సే.

పెరుగు, నెయ్యి, పాలు, తేనె, కూరలు, నూనె, ఒకటేమిటి... అన్నీ ప్యాక్‌ చేసిన (కల్తీ) ఆహారాలే! చివరకు సీజనల్‌ పండ్లు కూడా కలుషితమైనవే! కాలుతీసి కాలు బయట పెట్టకుండా, కనీస వ్యాయామం లేకుండా, ఒంటికి చెమట పట్టకుండా, నిరంతరం ఏసీ గదుల్లో ఉంటూ అన్నీ ఇంటి ముంగిటే పొందడం! బాత్రూమ్‌ కూడా బెడ్రూమ్‌కు అను బంధమే! ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.

ఇలా ఎన్నో కోల్పోతున్నాం. ఇంకా ఎన్ని కోల్పోవాలో? ఇదంతా చూస్తూ, అను భవిస్తూ ‘అభివృద్ధీ నీ పయనం ఎటువైపు?’ అని నిట్టూర్చడం కన్న చేయగలిగిందేముంది?

వనం జ్వాలా నరసింహారావు 
వ్యాసకర్త తెలంగాణ సీఎం సీపీఆర్‌ఓ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top