Amaravati: రాజధాని అను ఒక ‘రియల్‌’ ఎజెండా

Real Estate Agenda Behind Amaravati Capital: Ponaka Janardhan Reddy - Sakshi

అభిప్రాయం 

పునర్వ్యవస్థీకరణ అనంతరం, కొత్తగా ఏర్పడ బోయే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానికి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం శివరామకృష్ణన్‌ చైర్మన్‌గా ఒక కమిటీని నియమించింది. శివరామకృష్ణన్‌ కేంద్ర పట్టణాభి వృద్ధి శాఖకు మాజీ కార్యదర్శి. కమిటీ సభ్యులలో అందరూ సంబంధిత రంగంలో నిపుణులే. కమిటీ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలివి : విజిటిఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి) పరిధిలో ఇప్పటికే భూముల ధరలు పెరిగిపోయాయి కనుక నీటి వనరులు, రవాణా, రక్షణ, చారిత్రక అంశాల ఆధారంగా రాజధాని నిర్మాణ ప్రదేశం ఎంపిక చేయాలి.

విశాఖపట్నంలో ప్రభుత్వ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయవచ్చు. నూజివీడు, ముసునూరు, గన్నవరం ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న చోటే హైకోర్టు ఉండవలసిన అవసరం లేదు. విశాఖపట్నంలో హైకోర్టు, రాయలసీమలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయవచ్చు. విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక కారిడార్లుగా గుర్తించాలి. విశాఖపట్నంలో పరిశ్రమలకు, అనంతపురంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం. అసెంబ్లీ, రాజధాని నిర్మాణానికి అయిదు సంవత్సరాల కాలం పట్టవచ్చు. 

ఇంత స్పష్టంగా శివరామకృష్ణన్‌ కమిటీ తన నివేదికను అందించినప్పటికీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నివేదికను బుట్టదాఖలు చేసి, తన ‘రాజకీయ గురువు’ సూచించిన ‘అమరావతి’ పేరుతో రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. అందులో భాగంగా 2014 జూలై 14న ‘నారాయణ కమిటీ’ని నియమించారు. ఆ కమిటీలో సభ్యులను చంద్రబాబు ప్రభుత్వమే నియమించింది. సుజనా చౌదరి, గల్లా జయదేవ్‌ చౌదరి, మండవ ప్రభాకర్‌ చౌదరి, మరో ఐదుగురు సభ్యులతో ఆ కమిటీ ఏర్పడింది. అనంతరం రాజధాని ఏర్పాటుపై లీకులు మొదలయ్యాయి. నారాయణ కమిటీ రిపోర్టు పేరుతో దొనకొండ, నూజివీడు, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ప్రాంతం ఉండవచ్చని ప్రచారాలు మొదలు పెట్టారు. అది నమ్మి కొందరు దొనకొండ, నూజివీడుల్లో వేల ఎకరాల భూములు కొని మోసపోయారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు, ఆయన సామాజిక వర్గ నేతలు మాత్రం సీఆర్డీఏ (క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ప్రాంతంలో భూములు కొన్నారు. 

మొదట నాగార్జున యూనివర్సిటీ దగ్గర, విజయవాడ–గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని రావచ్చని చంద్రబాబు తనకు చెప్పారని నక్కా ఆనంద్‌బాబు ఏబీఎన్‌ ఇంటర్వ్యూలో బహిర్గతం చేశారు. తర్వాత స్వయంగా చంద్రబాబే నర్మగర్భంగా గుంటూరు–విజయవాడ మధ్య రాజధాని వస్తుందని 2014 సెప్టెంబర్‌ 4న శాసనసభలో ప్రకటించారు. 2014 డిసెంబర్‌ 30న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చింది. కానీ 2014 సెప్టెంబర్‌లోనే కొంతమంది చంద్రబాబు అనుయాయులు 29 గ్రామాల పరిసరాల్లోని భూములు కొని అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు! ఇదంతా కూడా ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాసెస్‌కు ముందే జరిగిపోయింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం అమరావతి నిర్మాణం పేరుతో 34,000 ఎకరాల భూ సేకరణకు పూనుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని శాసన సభ, శాసన మండలి, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను 200 ఎకరాల్లోనే ఉంచడం గమనించాల్సిన విషయం. 

ఏపీసీఆర్డీఏ యాక్ట్‌ ఫామ్‌ 9.14 బీ ప్రకారం ల్యాండ్‌ పూలింగ్‌లో ఒక్కో ఎకరానికి 250 సెంట్లు అభివృద్ధి చేసిన ప్లాటు ఇచ్చే విధంగా రైతులతో సీఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని ప్రకటనకు ముందు సీఆర్డీఏ ప్రాంతంలో ఎకరం రూ.15 లక్షలు ఉండేది. అయితే ‘హ్యాపీనెస్ట్‌’ పేరుతో జరిగిన విక్రయాల్లో ఎకరానికి రూ.10 కోట్ల రేటుకు సీఆర్డీఏ అమ్మింది. అంటే ల్యాండ్‌ పూలింగ్‌లో భూమి ఇచ్చిన ప్రతి రైతు ఎకరానికి రూ.2.5 కోట్లు లబ్ధి పొందినట్లేగా! ఇందులో త్యాగం ఎక్కడుంది? 

2015 అక్టోబర్‌ 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్దండరాయని పాలెంలో రాజధానికి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపనకు హాజరు కాలేకపోవటానికి కారణాలు చూపుతూ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అక్టోబర్‌ 15నే చంద్రబాబుకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. రైతుల నుంచి అసైన్డ్‌ భూములు లాక్కున్న విధానం, కమీషన్ల కోసం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయటం, సింగపూర్‌ కంపెనీకి 58 శాతం వాటా ఇస్తూ సీఆర్డీఏ 42 శాతం తీసుకోవటంలో ఉన్న స్కామ్‌ను తెలియ జేస్తూ.. చంద్రబాబు తన వర్గాన్ని బినామీలుగా పెట్టుకుంటూ భూదోపిడీకి పాల్పడుతున్నందున శంకుస్థాపనకు తనను ఆహ్వానించవద్దని నిర్మొహమాటంగా తెలియజేశారు. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం)

గుంటూరు–విజయవాడ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఇచ్చింది. నవ నగరాల నిర్మాణానికి రూ.1,09,000 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే అమరావతిలో చంద్రబాబు 5 ఏళ్లలో కేవలం రూ.5,674 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు (ఇందులో సుమారు రూ.2,500 కోట్లు బకాయిలు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది). అంటే ప్రతి సంవత్సరం పెరిగే ధరలను దృష్టిలో పెట్టుకుంటే రాజధాని నిర్మాణానికి మరో 100 ఏళ్లు పడుతుంది. అయితే రాజధానిని ఆర్నెల్లలో పూర్తి చేయాలని 2022 మార్చి 3న ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని భూ యజమానులకు చెందిన పునర్నిర్మిత ప్లాట్‌లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలనీ; అమరావతి రాజధాని నగరంలో నివాసానికి అనువుగా ఉండేలా అప్రోచ్‌ రోడ్లు, తాగునీరు, ప్రతి ప్లాట్‌కు విద్యుత్‌ కనెక్షన్, డ్రైనేజీ మొదలైనవి ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది! (క్లిక్ చేయండి: ప్రకృతి వ్యవసాయానికి ఏపీ చేదోడు)


- పొనకా జనార్దన రెడ్డి
మహా ప్రశాసకులు, ఏపీ ప్రభుత్వం

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top