Mandali Venkata Krishna Rao: దివిసీమ గాంధీ

Mandali Venkata Krishna Rao: Diviseema Gandhi 25th Death Anniversary - Sakshi

మండలి వెంకట కృష్ణారావు అవనిగడ్డ నుంచి 1972లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. రాజకీయ విలువల్లో, భాషా భిమానంలో ఆయనకు వారసులు – మాజీ రాష్ట్రమంత్రి మండలి బుద్ధప్రసాద్‌. కృష్ణారావు 1926 ఆగస్టు 4న కైకలూరు మండలం పల్లెవాడలో జన్మించారు. వీరి స్వస్థలం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లి.

మండలి కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూము లను పంచే కార్యక్రమం ప్రారంభమైంది. 15 వేల ఎకరాల భూములను పేదలకు పంచారు. 1974లో ఆయన విద్యా, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1975 రాక్షస నామ సంవత్సర ఉగాది నాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్వహణ కమిటీకి మండలి కార్యనిర్వాహక అధ్యక్షునిగా వ్యవహరించారు. ‘అంతర్జాతీయ తెలుగు కేంద్రం’ సంస్థను 1975లో నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహమ్మద్‌ ప్రారంభించారు. మండలి ఈ సంస్థకు ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించారు. (చదవండి: ప్రగతిశీల వైద్య శిఖామణి)

ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులుగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించిన మండలి కృషిని గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. దివిసీమలోని పులిగడ్డ – పెనుమూడి వంతెనకు మండలి పేరు పెట్టారు. ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలు అందుకున్న మండలి 1997 సెప్టెంబర్‌ 27న మరణించారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే వెళ్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి. (చదవండి: మనువును జయించిన విశ్వనరుడు)

– డా. జె. వి. ప్రమోద్‌ కుమార్, పైడిమెట్ట
(సెప్టెంబర్‌ 27న మండలి వెంకట కృష్ణారావు 25వ వర్ధంతి)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top