Kommareddy Raja Mohan Rao: ప్రగతిశీల వైద్య శిఖామణి | Doctor Kommareddy Raja Mohan Rao Centenary | Sakshi
Sakshi News home page

Kommareddy Raja Mohan Rao: ప్రగతిశీల వైద్య శిఖామణి

Sep 24 2022 3:45 PM | Updated on Sep 24 2022 3:45 PM

Doctor Kommareddy Raja Mohan Rao Centenary - Sakshi

డాక్టర్‌ కొమ్మారెడ్డి రాజా రామమోహన్‌ రావు

ప్రజా వైద్యులు, అభ్యుదయవాదిగా 86 సంవత్సరాల జీవితాన్ని గడిపిన డాక్టర్‌ కొమ్మారెడ్డి రాజా రామమోహన్‌ రావు పశ్చిమగోదావరి జిల్లా పోతునూరులో 1922లో జన్మించారు.

మానవతావాది, పూర్వ ఉపకులపతి, ప్రజా వైద్యులు, అభ్యుదయవాదిగా 86 సంవత్సరాల జీవితాన్ని గడిపిన డాక్టర్‌ కొమ్మారెడ్డి రాజా రామమోహన్‌ రావు పశ్చిమగోదావరి జిల్లా పోతునూరులో 1922లో జన్మించారు. 1951 నుండి 1980 వరకు గడిపిన వైద్యరంగ జీవితం చిరస్మరణీయం. సింగరేణి కాలరీస్‌ వైద్యాధికారిగా 200 పడకల ఆసుపత్రిని నిర్మించి సింగరేణి కాలరీలో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికులకు ఆధునిక వైద్యాన్ని అందించారు. సింగరేణి బొగ్గు గనుల చుట్టుపక్కల గ్రామాలను దత్తత తీసుకొని ఉచిత వైద్యాన్ని అందించారు. గుంటూరు మెడికల్‌ కాలేజీ, సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఆయా కళాశాలల అభివృద్ధికి పునాదులు వేశారు.

1982–86 మధ్య ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా విద్యా రంగంలో పలు మార్పులు, సవరణలకు కారకులయ్యారు. దేశంలో ప్రప్రధమంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ‘శాస్త్రీయ సోషలిజం అధ్యయన కేంద్రా’న్ని నెలకొల్పిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే ‘మహాయాన బౌద్ధ కేంద్రం’ కూడా ఆయన పదవీ కాలంలోనే నెలకొల్పబడింది. సర్జన్స్‌ అంతర్జాతీయ కాలేజ్, ఇంటర్నేషనల్‌ మెడికల్‌ స్టడీస్‌ అకాడమీ, భారత సర్జన్ల సంఘం, భారత యూరోలాజికల్‌ సొసైటీ, ఇండి యన్‌ మెడికల్‌ అసోసియేషన్, జెనీటో– యూరినరీ సర్జరీ(అమెరికా) శిక్షణాబోర్డు తదితర సంఘాలలో అనేక బాధ్యతలు నిర్వహించారు. ఇంగ్లండ్, అమెరికా, జపాన్‌ తదితర చోట్ల జరిగిన వైద్య సభలకు హాజరయ్యారు.

 అటు వైద్యరంగానికీ, ఇటు విద్యారంగ వ్యాప్తికీ  రామమోహన్‌ రావు చేసిన కృషికి అనేక అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. 1984లో యార్లగడ్డ రాజ్యలక్ష్మి, వెంకన్న చౌదరి కళాపీఠం తరఫున జాతీయ అవార్డు లభించింది. సామాజిక, వైద్య సేవ రంగాలలో ఆయన చేసిన కృషికిగాను 1992లో ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్‌ బీసీ రాయ్‌ అవార్డును పొందారు. శాస్త్రవిజ్ఞానాన్ని గ్రామ సీమలకు చేర్చాలన్న లక్ష్యంతో ‘జన విజ్ఞాన వేదిక’ ఉపాధ్యక్షులుగా పనిచేశారు.

వీరి నిరాడంబర జీవితం, సరళ స్వభావం, సేవా తత్పరత, ఆపన్నుల పట్ల ఆదరణ, ప్రగతి శీల ఉద్యమాల పట్ల ఆయనకున్న నిబద్ధత వలన ఒకానొక సందర్భంలో భారత రాష్ట్రపతి పదవికి వామపక్ష అభ్యర్థిగా ఆయన పేరును పరిశీలించిన సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.

రాజా రామమోహన్‌ రావు తండ్రి కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి 1937 లోనే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జరిపిన రైతు రక్షణ యాత్ర చారిత్రాత్మకం. జీవితాన్ని స్వార్థం కొరకు కాక లోకహితం కొరకు ధారపొయ్యాలన్న తండ్రి మాటను శిరోధార్యంగా తీసు కున్నారు రామమోహనరావు. ఆయన ఆశయాలను మనమూ కొనసాగిద్దాం.

– వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక, ఏపీ అధ్యక్షులు
(సెప్టెంబర్ 25న కొమ్మారెడ్డి శత జయంతి సందర్భంగా గుంటూరు, వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సెమినార్‌ జరుగనుంది) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement