తెలుగుదేశం ‘రివర్స్‌’ రాజకీయం

Kommineni Srinivasa Rao Article On TDP Politics - Sakshi

విశ్లేషణ

ఒకప్పుడు ప్రభుత్వంలో జరిగే అవకతవకలపై, అన్యాయాలపై ప్రతిపక్షాలు ఉద్యమాలు చేసేవి. ఆందోళనలు జరిపేవి. కొన్నిటిలో సఫలం అయ్యేవి. కొన్నిటిలో విఫలం అయ్యేవి. అది ప్రతిపక్షం బాధ్యత. సమాజానికి ఏది మంచి అయితే అది చెప్పడం, దాని గురించి ప్రచారం చేయడం రాజకీయ పార్టీల బాధ్యత. కాని దురదృష్టవశాత్తు ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్‌లో రివర్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ప్రభుత్వంలో ఏదైనా మంచి జరిగితే దానిపై బురదచల్లడం , లేదా ఏదైనా అవినీతి కేసులో ఎవరిపైన అయినా చర్య తీసుకుంటే ఎదురుదాడి చేసి, చివరికి అవినీతిపరులను సమర్థించే దశకు ప్రతిపక్ష తెలుగుదేశం వెళ్లడం ఒక చారిత్రక విషాదం. గతంలో ఏ పార్టీలో వారు తప్పు చేసినా, అందులో వాస్తవం ఉందా, లేదా అన్నది గమనించి సంబంధిత పార్టీవారు చర్య తీసుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు చర్య తీసుకోవడం సంగతి దేవుడెరుగు, ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి కలిపి ఏవో ఆరోపణలు చేయడం జరుగుతోంది. 

ఏపీలో వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే తంతు. దానికి శ్రీకారం చుట్టింది అక్రమ కట్టడం కూల్చినప్పటి నుంచే కావడం మరో ట్రాజెడీ. కృష్ణానది కరకట్ట మీద అక్రమ నిర్మాణాలు చేయకూడదన్నది పర్యావరణ నిబంధన. కానీ చిత్రంగా ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు అక్రమ కట్టడంలో ఉండడమే కాకుండా, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా కొనసాగు తున్నారు. పైగా దానిని నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. ఆ పక్కనే ప్రధానంగా తన పార్టీ అవసరాలకోసం ప్రజావేదిక పేరుతో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన అక్రమ కట్టడాన్ని ఈ ప్రభుత్వం తొలగిస్తే దానిని విధ్వంసం అంటూ తప్పుడు ప్రచారం సాగించడం చంద్రబాబుకే చెల్లింది. కేరళలో కొచ్చి వద్ద ఒక నది పక్కనే ఉన్న భారీ అపార్టుమెంట్ల సముదాయాన్ని సుప్రీకోర్టు కూల్చాల్సిందేనని ఆదేశించి ఆ పని అయ్యేదాకా ఊరుకోలేదు. అక్కడ వాటిలో ఉన్నది మధ్యతరగతి ప్రజలు. వారు దానివల్ల ఎంతో నష్టపోయారు. కానీ ఏపీలో కృష్ణానది పక్కన అక్రమంగా నిర్మించిన ఇళ్లజోలికి ఎవరూ వెళ్లలేకపోతున్నారు. అందుకే చట్టాలు కొందరికి చుట్టాలు అన్న నానుడి వచ్చింది. 

చంద్రబాబు ఎంత సమర్థుడు కాకపోతే తనకు సంబంధించిన కేసులు ఏళ్ల తరబడి విచారణకు రాకుండా చేసుకోగలుగుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. చివరికి సుప్రీంకోర్టులో సైతం తన కేసులు రాకుండా  చేసుకోగలుగుతున్నారని చాలా మంది అంటుంటారు. అది వేరే విషయం. విశాఖపట్నంలో ఒక డాక్టర్‌ మద్యం తాగి నడి రోడ్డు మీద చిందులు వేస్తే, అదేమిటయ్యా.. నువ్వు చదువుకున్నవాడివి కదా అని బుద్ధి చెప్పవలసిన చంద్రబాబు కానీ, మరికొందరు ఆ పార్టీ నేతలు కాని ఆ డాక్టర్‌ను వెనకేసుకు వచ్చి సమాజానికి తప్పుడు సంకేతం పంపించారు. దీనినే రివర్స్‌ ట్రెండ్‌ అని అనాలి. ఈ సందర్భంలో బీజేపీ వారు మాత్రం పద్ధతిగా చేశారని ఒప్పుకోవాలి. వారి పార్టీ నాయకుడు ఒకరు అక్రమంగా ఆరు లక్షల రూపాయల మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడితే  వెంటనే అతనిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అదే అతను టీడీపీ వాడు అయి ఉంటే, కక్ష కట్టి పోలీసులు పట్టుకున్నారని టీడీపీ వారు ప్రచారం చేసేవారేమో! ఇక్కడే ఇంకో ఉదాహరణ చెప్పాలి. విశాఖలో చిందులేసిన డాక్టర్‌ దళితుడని, ఆయనపై చర్య తీసుకుంటారా అని ప్రశ్నించిన టీడీపీ నేతలు, అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి ఒక దళిత పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌పై దురుసుగా వ్యవహరిస్తే మాత్రం భిన్నంగా వ్యవహరించి, ప్రభాకరరెడ్డిని కక్షపూరితంగా అరెస్టు చేశారని ఆరోపించారు. మరి ఇక్కడ దళిత పోలీసు అధికారిపై దౌర్జన్యం చేయడం కరెక్టని చంద్రబాబు భావిస్తున్నారా? ఇదే రివర్స్‌ ట్రెండ్‌ అంటే. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం టెండర్లలో రివర్స్‌ విధానం తెచ్చి సుమారు మూడు వేల కోట్లు ఆదా చేస్తే దానిని ప్రశంసించకపోగా రివర్స్‌ పాలన అని చంద్రబాబు విమర్శించారు. వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేస్తే రివర్స్‌ పాలన అని అనడం ద్వారా తెలుగుదేశం పార్టీ రివర్స్‌ గేర్‌లో ప్రజలకు దూరం అవుతోందని అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం ఎల్జీపాలిమర్స్‌లో జరిగిన స్టెరైన్‌ గ్యాస్‌ ప్రమాదంలో పదిమంది మరణించినప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. తక్షణమే దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా ముఖ్యమంత్రి జగన్‌ వారితో ఎయిర్‌పోర్టులో మాట్లాడతారా అని రంకెలు వేశారు. ప్రజా ప్రయోజనాల రీత్యా, జరిగిన ఘటన తీవ్రత రీత్యా చంద్రబాబు అంతగా స్పందించారేమోలే అని ఆయన అభిమానులు కొందరు అనుకున్నారు. ముఖ్యమంత్రి  జగన్‌ అధికారిక కమిటీలు వేసి వారి విచారణ నివేదికలు వచ్చాక, వారు, వీరు అని చూడకుండా పాలిమర్స్‌ యాజమాన్యాన్ని అరెస్టు చేసిన తర్వాత టీడీపీ కానీ, మిగిలిన రాజకీయ పక్షాలు కానీ కనీసం హర్షం ప్రకటించినట్లు కనిపించలేదు. అది వేరే విషయం. 

విజయవాడలో స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పదిమంది మరణించిన ఘటన జరిగింది. దురదృష్టం. ఎవరూ ఇలాంటివి జరగాలని కోరుకోరు. ఇక్కడ కూడా ప్రభుత్వం విశాఖలో మాదిరి అధికారిక కమిటీని నియమించి ఆ తర్వాత చర్యలు తీసుకోవడం ఆరంభిస్తే, చిత్రంగా ఆ హోటల్‌ను లీజుకు తీసుకుని కరోనా కేంద్రంగా నడుపుతున్న రమేష్‌ ఆస్పత్రి యజమాని డాక్టర్‌ రమేష్‌ బాబును మాత్రం అరెస్టు చేయడానికి వీలులేదని చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నేతలు కానీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇది దారుణమైన విషయం. విశాఖలో అంత హడావుడి చేసిన చంద్రబాబు విజయవాడ ఘటనలో కనీసం పరామర్శకు కూడా ప్రయత్నించలేదు. పైగా తన పార్టీ నేతలతో దీనికి కుల ముద్రవేసి రమేష్‌ కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కనుక ఆయనపై ప్రభుత్వం కక్షతో అరెస్టుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేయించారు. ఇంతకన్నా నీచం ఉంటుందా? ఒక రాజకీయ పార్టీ ఇలా నిందితులను వెనకేసుకు వచ్చి ఎలాంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తోంది. దీనినే రివర్స్‌ ట్రెండ్‌ అంటారు. రమేష్‌కు ఈ ఘటనతో సంబంధం లేదనే అనుకుందాం. ఆయన పోలీసుల విచారణకు హాజరై తన అభిప్రాయాలు చెప్పి ఉండవచ్చు కదా.. ఎందుకు పరారీలో ఉన్నారు? చివరికి ఆయనను పట్టుకుంటే లక్ష రూపాయల పరిహారం ఇస్తామని పోలీసులు ప్రకటించే పరిస్థితి వచ్చిందంటే ఏమనుకోవాలి? అలాంటి వారికి టీడీపీ మద్దతు ఇస్తుందా? మరి చనిపోయిన పది మంది కుటుంబాల సంగతి టీడీపీకి పట్టదా? అదే రమేష్‌ కాకుండా మరొకరు ఎవరికైనా ఈ ఘటనలో బాధ్యత అయి ఉంటే కూడా టీడీపీ వారు ఇలాగే వ్యవహరించేవారా? అన్న చర్చకు ఆస్కారం ఇస్తున్నారు. 

అందుకే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ కమ్మ సామాజికవర్గాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని, చంద్రబాబు వల్ల ఆ వర్గం నష్టపోతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన మద్దతుదారు అయిన రమేష్‌ బాబుకు సాయం చేయడమేమో కానీ, మిగిలినవర్గాలకు కమ్మ సామాజికవర్గంవారిపై వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారు. అమరావతి రాజధాని రైతుల పేరుతో అదే డ్రామా కొనసాగిస్తున్నారు. అమరావతిని అడ్డం పెట్టుకుని మళ్లీ ఎన్నికలలో గెలవవచ్చని చంద్రబాబు అనుకున్నారు. కానీ అదే ఆయన పాలిట శాపం అయింది. అక్కడ తన సామాజికవర్గం వారికోసమో, తన పార్టీవారికోసమో, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారన్న అభిప్రాయం ఏపీ వ్యాప్తంగా ప్రబలేలా వ్యవహరిస్తున్నారు. రైతుల పేరుతో దీక్షలు చేస్తున్నవారిలో అత్యధికంగా ఒకేవర్గం వారు ఉన్నా, దానిని చంద్రబాబు వెనకేసుకు రావల్సి రావడం పార్టీకి ఎంత నష్టమో ఆయనకు అర్థం కావడం లేదు. అర్థం అయినా అదే ముఖ్యమని  అనుకుంటుండాలి. అంతేకాదు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియలో ఎక్కడైనా లోపాలు ఉంటే చెప్పడం తప్పుకాదు. కానీ అసలు ఆ కార్యక్రమమే జరగరాదన్నట్లుగా కోర్టులకు వెళ్లి అడ్డుపడుతున్నతీరు కూడా ప్రతిపక్షం రివర్స్‌ ట్రెండ్‌లో ఉందనడానికి పెద్ద ఉదాహరణ అవుతుంది. అచ్చెన్నాయుడు స్కామ్‌లో కానీ, హత్య కేసులో కొల్లు రవీంద్ర విషయంలో కాని వారితో వ్యక్తిగతంగా మాట్లాడడం వేరు. కానీ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తూ ఫలానా కులం కనుక అవినీతి ఆరోపణలు చేశారని ఎదురుదాడి చేయడం వేరు.

ప్రస్తుతం టీడీపీ ఇలా అన్ని విషయాలలో రివర్స్‌ ట్రెండ్‌లో ఉంది. గతంలో వైఎస్సార్‌సీపీ కూడా కొన్ని అంశాలలో తమ వ్యతిరేకతను వ్యక్తంచేసి ఉండవచ్చు. రాజధాని భూముల విషయంలో ఆరోపణలు చేసి ఉండవచ్చు. కానీ ప్రతి అంశంలోను వ్యతిరేకించాలని, ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసిన సందర్భాలు బాగా తక్కువే అని చెప్పాలి. జగన్‌ తన మ్యానిఫెస్టో పాజిటివ్‌ పాయింట్లపైనే ఎక్కువగా ఆధారపడి ప్రజలలో తిరిగారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఇంత అనుభవం పెట్టుకుని ప్రజాభిమతానికి విరుద్ధంగా, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా, ఒకటికాదు పలు విషయాలలో రివర్స్‌ ట్రెండ్‌లో రాజ కీయం చేస్తున్నారు. అందువల్లే చంద్రబాబు నెగటివ్‌ ఆలోచనలవల్ల  తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గందరగోళంలో పడిందని నిస్సందేహంగా  చెప్పగలిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు  
కొమ్మినేని శ్రీనివాసరావు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top