భారతదేశంలో బిజినెస్ – మేనేజ్‌మెంట్ విద్యలో అగ్రస్థానంలో ఉన్న ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్– బెంగళూరు’ (ఐఐఎమ్–బెంగళూరు) అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయిలోకి అడుగు పెడుతూ... ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉన్న ‘బీబీఏ’ను కాకుండా, ఎకనామిక్స్, డేటా సైన్స్ విభాగాల్లో బీఎస్సీ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. మరోవైపు ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు రకరకాల స్పెషలైజేషన్లతో బీబీఏ కోర్సులను వేగంగా విస్తరిస్తున్నాయి. ఐఐఎమ్–బెంగళూరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాధారణంగా తీసుకోకూడదు. మేనేజ్‌మెంట్ విద్య అంటే కేవలం ‘బిజినెస్’ అనే బ్రాండ్ పేరు కాదనీ; బలమైన పునాదులు, విశ్లేషణాత్మక ఆలోచన, గణిత నైపుణ్యం, డేటాను అర్థం చేసుకునే సామర్థ్యం అంతకంటే ముఖ్యమనీ అది నిరూపిస్తోంది.
గత పదేళ్లుగా దేశంలో బీబీఏ కోర్సులు విపరీతంగా పెరిగాయి. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్‌హెచ్‌ఈ) ప్రకారం... 2015–16లో 3.49 లక్షలుగా ఉన్న బీబీఏ అడ్మిషన్లు, 2021–22 నాటికి 6.64 లక్షలకు (దాదాపు 90 శాతం) పెరిగాయి. డిజిటల్ మార్కెటింగ్, ఫిన్ టెక్, బిజినెస్ అనలిటిక్స్ వంటి ఆకర్షణీ యమైన పేర్లతో ప్రైవేట్ వర్సిటీలు వీటిని విద్యా కార్యక్రమాల కంటే ఒక ‘వ్యాపార నమూనా’గా మార్కెట్ చేస్తున్నాయి. ‘ఎంబీఏ కోసం ఎందుకు ఎదురుచూడాలి? ఇంటర్ తర్వాతే మేనేజ్‌మెంట్ చదవండి’ అంటూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ అకడమిక్ నాణ్యత కంటే ‘కోర్స్ ప్యాకేజింగ్’ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
ఐఐఎమ్‌లలో ఇంజినీర్ల ఆధిపత్యం: కారణాలేంటి?
నిజంగా మేనేజ్‌మెంట్ కెరీర్‌కు బీబీఏనే సహజ మార్గమైతే, దేశంలోని టాప్ ఎంబీఏ సంస్థల్లో బీబీఏ గ్రాడ్యుయేట్లు ఎందుకు ఎక్కువగా కనిపించడం లేదు? ఐఐఎమ్–అహ్మదాబాద్ రీసెంట్ బ్యాచ్‌లో దాదాపు 38%, ఐఐఎమ్–కలకత్తాలో 43%, ఐఐఎమ్– బెంగళూరులో 70% కంటే ఎక్కువ మంది ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే. ఐఐఎమ్ విశాఖపట్నం, తిరుచిరాపల్లి వంటి కొత్త సంస్థల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది.
దీనికి కారణం ఉంది. ఉద్యోగదాతలు కేవలం మేనేజ్‌మెంట్ పరిభాష తెలిసినవారి కంటే... నిర్దిష్ట సబ్జెక్టుపై పట్టు ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తారు. ఎంబీఏ చేసిన ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్, టెక్నాలజీ కన్సల్టింగ్ వంటి రంగాల్లోకి వెళ్లగలరు. ఎకనామిక్స్ పట్టభద్రులు ఫైనాన్స్, కన్సల్టింగ్, అనలిటిక్స్ రంగాల్లోకి వెళ్తారు. కామర్స్ గ్రాడ్యుయేట్ అకౌంటింగ్, ట్యాక్సేషన్, ఫైనాన్స్ వ్యవస్థలపై బలమైన అవగాహన తెచ్చుకుంటాడు. అంటే ఇంజినీరింగ్, ఎకనామిక్స్ లేదా కామర్స్ వంటి ఒక బలమైన డిసిప్లిన్‌లో పునాది ఏర్పడిన తర్వాత ఎంబీఏ జోడిస్తే విద్యార్థికి ప్రత్యేక నైపుణ్యం వస్తుంది. కానీ యూజీ, పీజీ రెండింటిలోనూ అదే మేనేజ్‌మెంట్ చదివితే వచ్చే అదనపు ప్రయోజనం శూన్యం.
చదవండి: భారత్‌పై చైనా దొంగ దెబ్బ
చాలా బీబీఏ కోర్సుల్లో విశ్లేషణాత్మక లోతు, పరిశ్రమలకు కావలసిన టెక్నికల్ స్కిల్స్ ఉండటం లేదు. ఫలితంగా ఉద్యోగ మార్కెట్లో ఇబ్బందులు ఎదురై, ఎంబీఏ చేయడం ఐచ్ఛికం కాక తప్పనిసరిగా మారుతోంది. భారతదేశానికి ఇప్పుడు ‘లగ్జరీ బ్రాండ్ మేనేజ్‌మెంట్’ లాంటి ఆకర్షణీయమైన చదువుల కంటే... విమర్శనాత్మకంగా ఆలోచించగల, సంఖ్యలతో పని చేయగల, లోతైన అవగాహన ఉన్న యువత అవసరం. అందుకే మేనేజ్‌మెంట్ విద్యను మాత్రమే కెరీర్‌గా ఎంచుకోవా లనుకునే విద్యార్థులు ఐఐఎమ్‌లు నిర్వహించే ‘ఐపీమ్యాట్’ ద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లను పరిశీలించవచ్చు. అంతేకానీ, కొత్త ప్రైవేట్ వర్సిటీలు బ్రాండింగ్‌తో అమ్ముతున్న బీబీఏ కోర్సుల్లో చేరే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం శ్రేయస్కరం.
– వెంకట్ కోట
పీహెచ్‌డీ స్కాలర్, బిట్స్ పిలాని, హైదరాబాద్


