కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమా?

Functioning Of Collegium System Of Appointing Judges In Courts - Sakshi

న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ పనితీరుపై ఇప్పుడు తీవ్ర చర్చ కొనసాగుతోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి చాలాసార్లు ఈ వ్యవస్థ పారదర్శకత గురించి చర్చ లేవదీశారు. మరోవైపు కొలీజియం కార్యాచరణలు అపారదర్శకంగానూ, చేరుకోలేని విధంగానూ ఉంటున్నాయని సుప్రీంకోర్టు మాజీ జస్టిస్‌ చలమేశ్వర్‌ అన్నారు. కొలీజియం వ్యవస్థలో జవాబుదారీతనం, నిష్పాక్షికత లోపించాయని మరో మాజీ జస్టిస్‌ కురియన్‌ స్పష్టం చేశారు. కార్యనిర్వాహక వర్గమైన ప్రభుత్వానికి పాత్ర లేకుండా కొలీజియం కొనసాగడంపై దాని ఏర్పాటుకు కారణమైన తీర్పునిచ్చిన మాజీ చీఫ్‌ జస్టిస్‌ వర్మ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమైనదేనా అన్న ప్రశ్న తలెత్తక మానదు.

న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీ జియం (తెలుగులో సలహా మండలి అనవచ్చు) వ్యవస్థ పరిపూర్ణమైనదేనా? సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి యు.యు. లలిత్‌ ఇటీవలి ఇంటర్వ్యూలలో అదే చెబుతున్నారు. అదే సమయంలో, రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంలో కొలీజియం అనేది అంతర్గతంగానే ఉందని ఆయన సూచించారు కూడా! అయితే ఈ రెండు అంశాల గురించి ఆయన చెప్పింది సరైం దేనా? దీనిపై ఒక సాధారణ పరిశోధన ఏం చెబుతోందో మీతో పంచుకోనివ్వండి.
పైన పేర్కొన్న వాటిలో రెండో అంశాన్ని మొదటగా తీసు కుందాం. కొలీజియం అనే పదాన్ని రాజ్యాంగంలో పొందుపర్చలేదు. మరీ ముఖ్యంగా, ‘చీఫ్‌ జస్టిస్‌ సమ్మతి’(కన్కరెన్స్‌) అనే పదాన్ని జోడించడానికి జడ్జీల నియామక విధానంలో చేసిన సవరణను కూడా రాజ్యాంగ సభలో ఆనాడే ఓడించారు. అయితే 1993లో మాత్రమే సుప్రీంకోర్టు దీన్ని సాధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124 (2)లో ప్రస్తావించిన ‘సంప్రదింపు’ అనే పదం ‘చీఫ్‌ జస్టిస్‌ సమ్మతి’ అని నిర్ణయించడం ద్వారా సుప్రీంకోర్టు ఇది చేయగలిగింది. ఈ రెండు పదాలకు ప్రతి నిఘంటువులోనూ వేర్వేరు అర్థాలున్నాయనే వాస్త వాన్ని అలా పక్కన పెట్టారు.

కాబట్టి రాజ్యాంగంలో కొలీజియం అనే భావన కనీసంగా భాగం కానప్పుడు, దాని ప్రాథమిక స్వరూపంలోనే కొలీజియం వ్యవస్థ అంతర్గతంగా ఉందని చెబితే నమ్మడానికి కూడా కష్టంగానే ఉంటుంది. దీనికి బదులుగా ఇది ‘హంప్టీ డంప్టీ సూత్రం’ మీద ఆధారపడి చేసినది. అంటే, ‘‘నేను ఒక పదం ఉపయోగిస్తున్నప్పుడు, అది నేను ఎంపిక చేసుకున్న విధంగానే దాని అర్థం ఉంటుంది’’ అనే సూత్రంపైనే కొలీజియం వ్యవస్థను గతంలో రూపొందించినట్లు కనిపిస్తుంది. ఇక పరిపూర్ణతకు సంబంధించిన ప్రశ్నకు వద్దాం. 2015 జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్‌ కేసు సందర్భంగా జస్టిస్‌ చలమేశ్వర్‌ మాట్లాడుతూ, ‘‘కొలీజియం వ్యవస్థ కార్యాచరణలు నిస్సందేహంగా ప్రజలకూ, చరిత్రకూ కూడా అపారదర్శకంగానూ, చేరుకోలేని విధంగానూ ఉంటున్నాయి’’ అని చెప్పారు. కాగా, జస్టిస్‌ కురియన్‌ కూడా ‘‘కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం, నిష్పాక్షికత లోపించాయి’’ అని అంగీకరించారు. కాబట్టి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమైనదని నమ్మలేదన్నమాట.

దీనికి ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. న్యాయమూర్తులను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు, లేదా వారిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేసుకుంటారు అనే ప్రమాణాల గురించి నిజంగానే మనకు తెలీదు. ఇక రెండో అంశం. కొలీజియం అనే న్యాయమూర్తుల నియామక వ్యవస్థ మూసిన తలుపుల వెనుక నడుస్తున్నందున అక్కడ తప్ప కుండా బంధుప్రీతికి అపార అవకాశం ఉంటుంది. కొలీజియంలోని న్యాయమూర్తులు తమ ఛాంబర్‌లోని జూనియర్లను, చివరకు తమ బంధువులను సైతం జడ్జీలుగా నియమించారని ఆరోపణలు రావ డంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. కొలీజియం ఎంపిక చేసిన న్యాయమూర్తుల నాణ్యత మరో పెద్ద సమస్యగా ఉంటోంది. దీనిగురించి మొదలు పెట్టాలంటే, ఈ దేశం లోని అత్యుత్తమ న్యాయమూర్తులను కొలీజియం నిర్లక్ష్యం చేసింది. దీనికి జస్టిస్‌ అజిత్‌ ప్రకాశ్‌ షా, జస్టిస్‌ అఖిల్‌ ఖురేషీ రెండు ఉదా హరణలుగా నిలుస్తారు. ఖురేషీ కేసు విషయానికి వస్తే, ఆయనను నియమించేంత వరకూ మరే ఇతర న్యాయమూర్తినీ నియమించ డానికి కూడా జస్టిస్‌ నారిమన్‌ తిరస్కరించారు. కానీ అది ఎన్నటికీ జరగలేదు.

మరింత ఘోరమైన విషయం ఏమిటంటే, అర్హత లేని వ్యక్తులు తరచుగా న్యాయమూర్తులుగా నియమితులు కావడం. దీనికి అద్భుత మైన ఉదాహరణ జస్టిస్‌ కర్ణన్‌. చివరకు ఈయన జైలుపాలయ్యేంతగా అధోగతిపాలయ్యారు. అదే సమయంలో జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎమ్‌ఆర్‌ షాల విషయానికి వస్తే, సిట్టింగ్‌ జడ్జిలుగా ఉండికూడా వారు బహిరంగంగానే ప్రధానమంత్రిని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఇది సుప్రీంకోర్టును తీవ్ర ఇబ్బందిలోకి నెట్టింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి బలహీనతలతో కూడిన వ్యవస్థ పరిపూర్ణంగా ఉండగలదా? 1993లో కొలీజియం వ్యవస్థను రూపొందించడానికి మూలమైన తీర్పు చెప్పిన నాటి చీఫ్‌ జస్టిస్‌ వర్మ సైతం అలా భావించడం లేదు. ‘బీబీసీ హార్డ్‌ టాక్‌’ కోసం జస్టిస్‌ వర్మ 2004లో నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కొలీజియం విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నాననీ, కార్యనిర్వాహకవర్గమైన ప్రభుత్వా నికి కూడా పాత్ర కల్పించే జాతీయ న్యాయ కమిషన్‌ను తాను నమ్ము తున్నాననీ ఆయన అన్నారు. న్యాయమూర్తుల నియామకానికి ఇదే ఉత్తమమార్గంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొలీ జియం రచయితే తన మనసు మార్చుకున్నప్పుడు, ఇక అలాంటి న్యాయ నియామకాల వ్యవస్థ పరిపూర్ణమైనదిగా ఉండగలదా?

న్యాయచతురత కలిగిన అభ్యర్థులను ఉన్నత స్థానాల్లో న్యాయ మూర్తులుగా నిలిపినట్లయితే, కార్యనిర్వాహక వర్గం తన వ్యక్తిత్వం, సమగ్రత విషయంలో మరింత ఉత్తమంగా ఉండగలుగుతుందని జస్టిస్‌ వర్మ వాదించారు. కాబట్టే కొలీజియంలో ప్రభుత్వానికి కూడా తప్పకుండా పాత్ర కల్పించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, వర్మ మరొక అడుగు ముందుకెళ్లారు. 1997లో, ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పడు, కొలీజియం ఒక అభ్యర్థిని సిఫార్సు చేసింది. అయితే నిఘా సంస్థలు ఆయన పట్ల తీవ్ర అభ్యం తరాలు వ్యక్తం చేస్తున్నాయని నాటి ప్రధాని ఐకే గుజ్రాల్‌ చెప్పగానే, జస్టిస్‌ వర్మ ఆ అభ్యర్థి పేరును వెనక్కు తీసుకున్నారు. పైగా తాను ఎందుకలా నిర్ణయం మార్చుకోవలసి వచ్చిందో తన తోటి అయి దుగురు న్యాయమూర్తులకు వివరించారు కూడా! వీరిలో తర్వాత ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు. అయితే ఈ ముగ్గు రిలో ఒకరు జస్టిస్‌ వర్మ చెప్పిన విషయాన్ని పక్కనపెట్టి, ఆయన ఉపసంహరించిన వ్యక్తిని తిరిగి నామినేట్‌ చేశారు. అలా ఆయన ప్రధాన న్యాయమూర్తి అయ్యేలా చూశారు. అంటే ఒక తప్పుడు వ్యక్తిని కూడా కొలీజియం నామినేట్‌ చేయగలదనడానికి ఇదే రుజువు అని వర్మ అన్నారు. ఇదేమీ ఏకైక ఉదాహరణ కాదని కూడా ఆయన కొనసాగించారు.

ఈ అంశం వద్దే దీన్ని ముగించనివ్వండి. ఒక సాధారణమైన పరిశోధన బయటపెట్టిన వాస్తవాలను, ఆందోళనలను మీ ముందు ఉంచాను. నిస్సందేహంగానే ఇక్కడ చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అయితే నేను న్యాయవాదిని కానీ, న్యాయమూర్తిని కానీ కాదు కాబట్టి వాటి గురించి నేను జాగరూకతతో ఉండలేను. అయితే నేను ఈ కథనం ప్రారంభంలోనే వేసిన రెండు ప్రశ్నలను సమర్థిం చడానికి ఇది సరిపోతుంది మరి. కొలీజియం వ్యవస్థ పరిపూర్ణ మైనదేనా? అది మన రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంలోనే అంతర్గ తంగా ఉందని భావించవచ్చా?

కరణ్‌ థాపర్‌, వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top