కొలీజియం కాక.. కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య ముదురుతున్న వివాదం  

Center Govt vs Supreme Court Collegium: Turf War on Judges Appointments - Sakshi

సుప్రీంకోర్టు కొలీజియం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నడుమ వివాదంగా మారిన అంశం. కొలీజియం వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల్లో తమ పాత్ర లేకపోవడం ఏమిటంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొలీజియం వ్యవస్థే రాజ్యాంగ విరుద్ధమంటూ పలువురు కేంద్ర మంత్రులు బాహాటంగా గళం విప్పుతున్నారు. కొలీజియం సభ్యులేమో సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి తాము సిపార్సులు మాత్రమే చేస్తామని, తుది నిర్ణయం కేంద్రానిదేనని అంటున్నారు.

ఏమిటీ కొలీజియం...?  
సుప్రీంకోర్టు న్యాయమూర్తుతో పాటు దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకం, బదిలీలను సిఫార్సు చేయడానికి ఉద్దేశించినదే కొలీజియం వ్యవస్థ. సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు అత్యంత సీనియర్‌ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో కొలీజియంలో భిన్నాభిప్రాయాలు ఉంటే మెజార్టీ సభ్యులదే తుది నిర్ణయం. అయితే ప్రధాన న్యాయమూర్తిని తప్పనిసరిగా సంప్రదించి, ఆయన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

కొలీజియం తన సిఫార్సులను కేంద్రానికి పంపుతుంది. ఇక హైకోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్‌ మోస్ట్‌ న్యాయమూర్తులు సభ్యులు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపుతుంది. ముఖ్యమంత్రి వాటిని కేంద్ర న్యాయ శాఖ మంత్రికి పంపిస్తారు. వాస్తవానికి రాజ్యాంగంలో కొలీజియం ప్రస్తావన లేదు. కొలీజియం చేసే సిఫార్సులపై కేంద్రం తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఒకే పేరును కొలీజియం రెండోసారి సిఫార్సు చేస్తే కేంద్రం ఆమోదించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో తీర్పు వెలువరించింది.

రాజ్యాంగం ఏం చెబుతోంది?
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిలను రాష్ట్రపతి నియమించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సీజేఐ మినహా మిగతా నియామకాల్లో సీజేఐ అభిప్రాయం తెలుసుకోవాలి. ఆర్టికల్‌ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో సీజేఐ, గవర్నర్, హైకోర్టు సీజేలను సంప్రదించాలి.

ఏమిటీ వివాదం?   
1950 నుంచి 1973 వరకూ కేంద్రం, సీజేఐ కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయంతో న్యాయమూర్తులను నియమించే విధానముండేది. సుప్రీంకోర్టులో సీనియర్‌ మోస్ట్‌ న్యాయమూర్తిని సీజేఐగా నియమించడం ఆనవాయితీగా కొనసాగింది. 1973లో మాత్రం ముగ్గురు సీనియర్లను పక్కన పెట్టి జస్టిస్‌ ఎ.ఎన్‌.రేను సీజేఐగా అప్పటి ప్రభుత్వం నియమించింది. తర్వాత మరో సీజేఐ నియామకంలోనూ ఇలాగే జరగడం కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య వివాదానికి దారితీసింది. న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక వ్యవస్థ కంటే న్యాయ వ్యవస్థకే ఎక్కువ అధికారాలుంటాయని ఫస్ట్‌ జడ్జెస్‌ కేసు (1981), సెకండ్‌ జడ్జెస్‌ కేసు (1993), థర్డ్‌ జడ్జెస్‌ కేసు (1998)ల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఎలా ఏర్పాటైంది?
పార్లమెంట్‌ చట్టంగానీ, రాజ్యాంగ విధివిధానాలు గానీ లేకుండానే మన దేశంలో 1993లో కొలీజియం వ్యవస్థ మొదలైంది. న్యాయమూర్తుల నియామకంలో ఆర్టికల్‌ 124(2)లో ఉన్న ‘సంప్రదింపుల అనంతరం’ అర్థాన్ని ‘సమ్మతించిన తర్వాత’గా మారుస్తూ తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. తద్వారా న్యాయమూర్తుల నియామకం, బదిలీల అధికారం సీజేఐ నేతృత్వంలోని వ్యవస్థ అయిన కొలీజియానికి దక్కింది.

ప్రత్యామ్నాయముందా?
కొలీజియంకు ప్రత్యామ్నాయంగా నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌(ఎన్‌జేఏసీ)ని కేంద్రం తెరపైకి తెచ్చింది. ఇది స్వతంత్ర కమిషన్‌.దీనికి సీజేఐ చైర్‌పర్సన్‌గా ఉంటారు. మరో ఇద్దరు అత్యంత సీనియర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయ మంత్రి ఎక్స్‌–ఆఫీషియో సభ్యులుగా ఉంటారు. పౌర సమాజం నుంచి ఇద్దరు ప్రముఖులను సభ్యులుగా సీజేఐ, ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ నామినేట్‌ చేయాలి. ఈ ఇద్దరిలో కనీసం ఒకరు ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ లేదా మహిళ అయి ఉండాలి. రాజ్యాంగ (99వ సవరణ) చట్టం–2014, నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్స్‌మెంట్‌ కమిషన్‌ చట్టం (2014) ద్వారా ఎన్‌ఏజేసీని కేంద్రం ప్రతిపాదించింది. సంబంధిత బిల్లులు 2014లోనే పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. కానీ ఈ బిల్లుల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌జేఏసీని కోర్టు కొట్టేసింది. అయితే న్యాయమూర్తుల ఎంపికకు కొలీజియం స్థానంలో కేంద్రం మరో వ్యవస్థను తీసుకొస్తే అభ్యంతరం లేదని ఇటీవలే స్పష్టం చేసింది.

కొలీజియంలో ప్రభుత్వ నామినీలు
సీజేఐకి కేంద్ర న్యాయ మంత్రి రిజిజు లేఖ  
న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో చీఫ్‌ జస్టిస్‌లు, జడ్జిలను నియమించే కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వం నామినేట్‌ చేసేవారికి సైతం చోటుండాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పునరుద్ఘాటించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు ఆయన తాజాగా లేఖ రాశారు. ‘‘జడ్జిల నియామకంలో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరం. అందుకే న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలి’’ అని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని కిరణ్‌ రిజిజు ఇటీవల విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టుల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడానికి కొలీజియమే కారణమని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీజేఐకి ఆయన లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

న్యాయ వ్యవస్థకు విషగుళిక: జైరామ్‌ రమేశ్‌  
న్యాయ వ్యవస్థను పూర్తిగా ఆక్రమించుకొనేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ సోమవారం ఆక్షేపించారు. న్యాయ వ్యవస్థను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. సీజేఐకి రిజిజు లేఖను తప్పు పట్టారు. మంత్రి సూచన న్యాయ వ్యవస్థకు విషగుళిక అన్నారు. అయితే కొలీజియంలో సంస్కరణలు అవసరమేనని జైరాం అభిప్రాయపడ్డారు.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top