ఆర్‌వీఎంపై అనుమానాలు సహజమే!

Doubts on Remote Electronic Voting Machine - Sakshi

ఇన్‌బాక్స్‌

2019 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా 91.2 కోట్ల మంది ఓటర్లు ఉంటే... వారిలో 32.6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇందుకు అనేక కారణాలు.
అందులో ముఖ్యమైనది బతుకు తెరువు కోసం వలసపోవటం. ఓటింగ్‌ శాతంపై సుప్రీంకోర్టుకు కూడా అనేక వినతులు అందాయి. వ్యాజ్యాలూ దాఖలయ్యాయి. ఆ నేపథ్యంలోనే 2015లో సుప్రీంకోర్టు ఓటింగ్‌ శాతం పెంచే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (సీఈసీ) ఆదేశించింది.  

దీంతో ఎన్నికల సంఘం అనేక అంశాలను పరిశీలించింది. ఇప్పటికే పరోక్ష ఓటింగ్, పోస్టల్‌ బ్యాలెట్, ఇంటర్నెట్‌ ఓటింగ్, ముందస్తు ఓటింగ్‌ వంటి విధానాలు అమల్లో ఉన్నాయి. అయితే ఆ విధానాలను అత్యధికులు ఉపయోగించుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు కోట్లాదిగా ఉన్న వలస ఓటర్ల కోసం కేంద్ర ఎన్నికల సంఘం, ఒకేసారి అనేక (72) నియోజకవర్గాల పరిధిలో ఉన్నవారు రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఆర్‌వీఎం)ను ఉపయోగించి ఓటువేయడానికి అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. ఈ ఆర్‌వీఎంలను పరిశీలించేందుకు, వాటి పనితీరుపై అభ్యంతరాలను తెలిపేందుకు, జనవరి 16, సోమవారం ప్రయోగాత్మక పరిశీలనా ప్రదర్శనకు రావాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం.. గుర్తింపు పొందిన 8 జాతీయ పార్టీలను, 57 రాష్ట్ర పార్టీలను ఆహ్వానించింది. 

పరిశీలన తర్వాత తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా జనవరి 31 నాటికి అందించాలని ఈసీ కోరింది. అయితే ఆదివారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో 16 ప్రతిపక్షాలు సమావేశమై తాము ఆర్‌వీఎంలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే అనేక పార్టీలు ఆర్‌వీఎంల అవసరం లేదని పేర్కొన్నాయి. దీంతో ఆర్‌వీఎంలపై మరింత చర్చించి తమ అభిప్రాయాలను చెప్పాలని ఎన్నికల కమిషన్‌ ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగించింది. ఈవీఎంలపై అనుమానాలే పూర్తిగా తగ్గని వేళ, ఈ ఆర్‌వీఎంలపై మరిన్ని సందేహాలు రావడం సహజమే.

– డాక్టర్‌ తాతా సేవకుమార్, సర్వీస్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top