చెప్పింది ఒకటి... చేసేదొకటి!

Central Government Making Common People Suffer: Kovvuri Trinath Reddy - Sakshi

ఎన్నికలు రాగానే విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి ప్రతి పేదవాడి బ్యాంకు అకౌంట్‌లో లక్షలు సొమ్ము వేస్తామని చెబితే పేదప్రజలందరూ నమ్మి ఓట్లు వేసి గద్దె నెక్కించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఒక్క రూపాయి కూడా ఏ ఖాతాకు జమ కాలేదు. నోట్లను రద్దు చేసి నల్లధనాన్ని పైకి తీసుకొని వస్తానన్నారు. ఏమయింది? చివరకు నల్ల ధనం, నకిలీధనం కూడా ఆర్‌బీఐలోకి వెళ్లాయి. ఎంత ధనం ఆర్‌బీఐకి వచ్చిందో లెక్క తేల్చలేని పరిస్థితి. బ్యాంకులలో ఎన్‌పీఏ (నిరర్థక ఆస్తులు)లు ఎక్కువ య్యాయని చిన్నాచితకా బ్యాంకుల్ని పెద్ద బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇప్పుడు మొత్తం బ్యాంకులను అమ్మివేసే పరిస్థితి! ఫలితంగా ఎన్‌పీఏలు తగ్గకపోగా సుమారు 15 శాతానికి పెరగటం గమనార్హం. 

రిజర్వు బ్యాంకులో ఉన్న అధిక ధనాన్ని డివిడెండుగా ప్రభుత్వం వాడుకొని స్వతంత్ర ప్రతిపత్తిగల రిజర్వు బ్యాంకుని నిర్వీరం చేస్తోంది. బ్యాంకులను జాతీయీ కరణ చేసిన ఘనత మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీకే దక్కుతుంది. లేకపోతే సామాన్యుడు బ్యాంకు మెట్లు ఎక్కే పరిస్థితి లేకుండా పోయేది. రైతులకు రెట్టింపు ఆదాయాన్ని ఇస్తానని చెప్పి ఆ పని చేయలేక పోయారు. పీఎం ఫసల్‌ బీమాని ప్రయివేట్‌ సంస్థల కిచ్చి రైతులకు పంట నష్టం జరిగినపుడు న్యాయ బద్ధంగా ఇవ్వవలసిన క్లయిమ్‌ను ఇవ్వకుండా రైతులను మోసం చేశారు. రైతు పండించిన పంటలకు  కనీస మద్దతు ధరను నిర్ణయించినా... పంటలను కొనకుండా రైతులను నిండా ముంచుతున్నది కేంద్రం.

నిత్యం పాలిచ్చే ఆవులాగ ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ)ని కార్పొరేట్లకు అమ్మాలన్న ఆలోచన చూస్తుంటే దేశాన్ని ఈ పాలకులు ఏ దారికి తీసుకెలుతున్నారనే అనుమానం కలుగుతోంది. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అని నినదించి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్లకు తెగనమ్మాలనుకోవడం దేనికి నిదర్శనం? సుమారు 20 వేల మంది ఉద్యోగుల భవితవ్యాన్ని గాలిలో కలిపేస్తారా? కాంగ్రెసు పార్టీ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజిస్తే...  దానికి పార్లమెంటులో వత్తాసు పలికి, తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఏమైంది?  విభజన చట్టంలో పోలవరానికి పూర్తిగా నిధులు ఇస్తామని  చెప్పిన మాట మార్చి రకరకాల మాటలు  చెప్పడం దేనికి సంకేతం?

విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించకుండా నష్టాలు వస్తున్నాయనే సాకుతో కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టింది. విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగొలు చేస్తాననడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ప్రపంచ మార్కెట్‌లో తగ్గుతున్నా... మనదేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇష్టం వచ్చిన రీతిలో పెంచుకుంటూ పోయి సామాన్యుని నడ్డి విరుస్తున్న కేంద్ర పాలన ఎవరికి లాభం చేకూర్చుతున్నదో అర్థం కాని ప్రశ్న.

ఒక దేశం ఒకే పన్ను విధానాన్ని (జీఎస్‌టీ) తీసుకొచ్చి చిన్న వ్యాపారస్థుల నడ్డి విరిచారు. ప్రతి నెలా రిటర్ను దాఖలు చేయడంతోనే సమయం డబ్బు వృథా అవుతుండడం వలన చిన్న వ్యాపార స్తుల కష్టాలు వర్ణనాతీతం. ప్రతి మనిషికి అవసరమైన బట్టలను, చెప్పులను కూడా వదలకుండా పన్ను విధించటం గమనార్హం. బట్టలపై 5% పన్ను విధించి, అంతటితో ఆగకుండా మరలా 7% పన్నుని విధించటం వలన వ్యాపార వర్గంలోను, ప్రజలలోనూ  వ్యతిరేకత పెరిగింది.. దీంతో సదరు పన్నును కేంద్రం ఉపసంహరించుకొంది.

కొత్త వ్యవసాయ చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా రూపొందించడంతో  రైతులు ఉద్యమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో దిక్కుతోచని పరిస్థితిలో కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొంది.  ఈ పాలన ఇలాగే కొనసాగితే ప్రజలు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు.

- కొవ్వూరి త్రినాథరెడ్డి 
కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర వైఎస్సార్‌సీపీ రైతు విభాగం

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top