గొంతు చించుకొని అడగాల్సిందే! | Sakshi
Sakshi News home page

గొంతు చించుకొని అడగాల్సిందే!

Published Mon, Sep 5 2022 1:29 AM

Bilkis Bano Case: Activist Protest Against Convicts Release - Sakshi

బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార ఘటనలో దోషులైన పదకొండు మందికి గుజరాత్‌ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యావజ్జీవ శిక్ష పడిన నేరస్థులకు కొన్నిసార్లు క్షమాభిక్ష పెడుతూనే ఉన్నప్పటికీ, ఈ కేసులో ప్రత్యేకించి అనుసరించిన ప్రక్రియ మీద ఎన్నో సందేహాలు తలెత్తాయి. పైగా క్షమాభిక్షను అత్యాచార నిందితులకు వర్తింపజేయకూడదన్న కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలకు ఇది వ్యతిరేకం. అందుకే దీన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తుందని చాలామంది విశ్వసిస్తున్నప్పటికీ, అనుమానాలు ఉండనే ఉన్నాయి. అలా జరగకపోతే, బిల్కిస్‌కు ఇవ్వగలిగే జవాబు ఏమిటి? ఆమె న్యాయపోరాటానికి అర్థం ఏమిటి? ఇది దేశంలోని ప్రతి మహిళకూ సంబంధించిన అంశం కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం మనం ఎంత పెద్దగా మన స్వరాలను పెంచుతాం అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది.


ఇది దేశానికే అగ్ని పరీక్ష 
గుజరాత్‌లో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యులను హత్య చేసిన 11 మందికి పెట్టిన క్షమా భిక్షను బహుశా సుప్రీం కోర్టు రద్దు చేస్తుందని చాలామంది విశ్వసిస్తు న్నారు. ఈ నేపథ్యంలో నేను కొన్ని ప్రశ్నలను లేవ నెత్తాలనీ, ఈ అంశంపై కొంత సందేహం కలిగిం చాలనీ నిర్ణయించుకున్నాను. అయితే న్యాయ స్థానంపై నాకు విశ్వాసం లేదని కాదు. కానీ నాణేనికి మరోవైపు కూడా చూడటం మంచిదనేది నా ఉద్దేశం. లేకుంటే మనం భ్రమల్లో కూరుకు పోతాం. చెప్పాలంటే, క్షమాభిక్ష ప్రక్రియ మొదలు పెట్టిందే సుప్రీంకోర్టు అని మర్చిపోవద్దు. కాబట్టి కొన్ని ప్రశ్నించదగిన నిర్ణయాల గురించే మనం మాట్లాడుతున్నాం. వాటిలో రెండు నిర్ణయాలు ఏమిటంటే, 1992 విధానం ప్రకారం క్షమాభిక్ష కేసును విచారించాలి; దీన్ని గుజరాత్‌ ప్రభుత్వం చేపట్టాలి. ఈ రెండోది మరింత ఆందోళనకరం. ఇది క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 432(7) (బి)ని ఉల్లంఘించడమే కాదు, అపరాధులకు ఎక్క డైతే శిక్ష పడిందో ఆ రాష్ట్రానికే దీన్ని కేటాయిం చడం. ఇక్కడ మరింత ఆందోళన కలిగించే అంశం ఇంకోటుంది.

బిల్కిస్‌ బానో కేసును సుప్రీంకోర్టు 2004లో సీబీఐకి బదలాయించింది. గుజరాత్‌లో పక్షపాత ధోరణులు చోటు చేసుకుంటాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ కేసు విచారణను గుజరాత్‌ నుంచి మహారాష్ట్రకు తరలించింది. ఈ క్షమాభిక్షను చూసి నప్పుడు ఆనాటి భయాలను పరిగణించకపోవడం అసాధారణం అనిపించడం లేదా? అయినప్పటికీ,  నాకు మరో రెండు పట్టింపులున్నాయి. మొదటిది, ఈ క్షమాభిక్ష విషయంలో గుజరాత్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు సంబంధించింది. ఆనాడు ఈ కేసు విచారణను చేపట్టిన న్యాయమూర్తి అభి ప్రాయాన్ని తీసుకోలేదు. అలాగే సీబీఐ దర్యాప్తు చేసిన అంశాల విషయంలో తప్పనిసరి అని క్రిమి నల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 435 స్పష్టంగా సూచి స్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా ఆహ్వానించలేదు. ఒకవేళ కేంద్ర ప్రభు త్వాన్ని సంప్రతించి ఉంటే, అది ఇటీవలే వెలువ రించిన మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి క్షమా భిక్షను తిరస్కరించాల్సి ఉండేదని నేను కచ్చితంగా చెప్పగలను. పైగా, క్షమాభిక్షను సిఫార్సు చేసిన కమిటీలో అయిదుగురు బీజేపీ నాయకులు కాగా, వారిలో ఇద్దరు సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యేలు కావడం గమనించాలి.

ఈ అన్ని అంశాలనూ పరిశీలించాక, సుప్రీం కోర్టు ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించాల్సి లేదా? అలాంటి అధికారం దానికి ఉంది కూడా! పైగా ఈ కేసులో బహుశా సుప్రీంకోర్టుకు ఒక నైతికపరమైన విధి కూడా ఉండవచ్చు. ఎందుకంటే క్షమాభిక్ష ప్రక్రియను మొదలుపెట్టిందే సుప్రీంకోర్టే మరి. ఆ ప్రక్రియ తప్పు ఫలితంతో ముగిసిపోతే, విషయాలను చక్కదిద్దడానికి న్యాయస్థానం ముందుకు రావలసిన అవసరం లేదా?నా రెండో ఆందోళన ఏమిటంటే, న్యాయ స్థానపు సూచనాత్మక వైఖరికి సంబంధించినది. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ ఆగస్టు 25న ఒక ప్రశ్న సంధించారు. ‘‘జరిగిన ఘటన భయంకరమైనది కాబట్టి, ఈ క్షమాభిక్ష తప్పు అంటే సరిపోతుందా?... యావజ్జీవ శిక్ష పడిన నేరస్థులకు నిత్యం క్షమాభిక్ష పెడుతూనే ఉన్నారు కదా, ఇక్కడ మినహాయింపు ఏముంది?’’ ఇవి కేవలం ప్రశ్నలు మాత్రమే. ఇది కేవలం వాక్చా తుర్యమే కావొచ్చు. కానీ ఈ ప్రశ్నలు ఇంతకు మించిన సందేశాన్ని ఇవ్వడం లేదని మీరు భావించగలరా? ఈ సందర్భంగా కోర్టు ఏం చేస్తుం దనే రెండో ఊహకు తావివ్వాలనుకోవడం లేదు. కానీ, ఆ 11 మంది దోషులను కోర్టు తిరిగి జైలుకు పంపిస్తుందని మనం నిజంగా నమ్మవచ్చా? అలా కోర్టు చేయలేకపోతే ఏం జరుగుతుంది? 

బిల్కిస్‌ ఉదంతం నేడు ఒక అగ్ని పరీక్షగా మారింది. ఇది స్పష్టంగా భారతీయ మహిళలకు మాత్రమే కాదు, బహుశా మరింత శక్తిమంతంగా సుప్రీంకోర్టుకు కూడా పరీక్షగా నిలుస్తున్నది. ఒక రకంగా చూస్తే, ఇది మన దేశం మొత్తానికి సంబం ధించిన పరీక్ష కాదా? నా సమాధానం అవుననే! దీని ఫలితం మీదే భారత న్యాయ వ్యవస్థ పవిత్రత ఆధారపడి ఉంది. నేరస్థులను సత్కరించడం ద్వారా భారత్‌లో అత్యాచారాన్ని సాధారణం చేశారా అని ‘బీబీసీ’ ప్రశ్నించింది. దీన్ని మీరు సక్రమమైన ప్రశ్నగా ఆమోదించకపోవచ్చు. కానీ అది లేవనెత్తారంటే, ప్రపంచం కళ్లు మన మీద ఉన్నాయని అర్థం. సుప్రీంకోర్టు దీన్ని ఎలా పరిష్కరిస్తుంది, ఎలాంటి తుది నిర్ధారణ చేస్తుందనేదానిపై చాలా అంశాలు ఆధారపడి ఉన్నాయి. న్యాయమూర్తులు దీనిపట్ల అప్రమత్తంగా ఉన్నారని నాకు నమ్మకం ఉంది. కాబట్టే వారి నిర్ణయం కీలకమైనది.


కరణ్‌ థాపర్‌, వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు


ఈ సమస్య మహిళలందరిదీ!
అయిదు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు మగాళ్ల గుంపు ఒకటి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం సాగిస్తున్నప్పటి ఘోరానుభవాన్ని ఊహించ గలరా? పైగా మూడేళ్ల కూతురును కళ్లముందే చంపేశారు. అంతకుమించిన ఘోరమేమిటంటే, దీనికి పాల్పడినవాళ్లంతా తెలిసినవారే. పొరుగు వారు, స్నేహితులని భావించినవారు. ఆ ఘోర కృత్యానికి పాల్పడిన ఆ 11 మంది గుజరాత్‌ ప్రభుత్వ కార్యనిర్వాహక ఆదేశం ద్వారా జైలు నుంచి విడుదలై బయటకొచ్చారు. అత్యంత కఠిన మైనవైనప్పటికీ, కొన్ని కథలు మనం వ్యక్తిగత మైనవిగా భావించేలా చేస్తాయి. అలాంటివాటిల్లో బిల్కిస్‌ బానో గాథ ఒకటి. 

ఇరవై ఏళ్ల క్రితం గోధ్రాలోని బాధితుల శిబిరంలో కిరోసిన్‌ లాంతరు ఛాయలో ఇతర మహిళలతోపాటు టార్పాలిన్‌ షీటు కింద ఉన్న ఆమెను నేను కలిశాను. కానీ ఇటీవల పతాక శీర్షికల్లో ఆమె పేరు కనిపించిన తర్వాత ఆమెతో నాటి సమావేశం నిన్ననే జరిగినట్లు అనిపించింది. ఆ రాత్రి తనకు ఏం జరిగిందన్నది గుర్తు చేసు కుంటున్నప్పుడు, ఆమె అస్సలు ఏడవని విషయం నాకు గుర్తుంది. ఒక శూన్యమైన, ముక్కలైపోయిన వ్యక్తీకరణతో ఆమె తన కళ్లలో ఆ వేదనను చూపిం చింది. ఆమెపై అత్యాచారం చేసి, పసిపాపను తన కళ్లముందే చంపిన వారు విడుదలై, జైలు బయట స్వీట్లు, పూలదండలతో సత్కారం పొందుతున్న ప్పుడు ఆనాటి శూన్యం బిల్కిస్‌లో పూర్తిగా ఆవరించినట్లు కనిపించిందనీ, ఆమెకు మాటలు రాకుండా పోయాయనీ, ఎంతో ఒంటరితనాన్ని ఆమె అనుభవిస్తోందనీ బిల్కిస్‌ భర్త యాకూబ్‌ నాతో చెప్పారు. బిల్కిస్‌ బానోకు ఇంతకు మించిన గాయం తగిలే అవకాశం లేదని మీరు అను కోవచ్చు.

ఈ ఖైదీల విడుదల కోసం సిఫార్సు చేసిన గుజరాత్‌ ప్యానెల్‌లోని సభ్యుల్లో ఒకరైన బీజేపీ ఎమ్మెల్యే సీకే రావుల్జీ ఓ దిగ్భ్రాంతికరమైన విషయం చెప్పారు. ‘‘వీళ్లు బ్రాహ్మణులు. బ్రాహ్మ ణులకు మంచి సంస్కారం ఉంటుంది. జైలులో వారి ప్రవర్తన చక్కగా ఉంది’’ అనేశారాయన. నా సహోద్యోగి చేసిన ఆ ఇంటర్వ్యూ వైరల్‌ అయింది. దాన్ని చూసిన బీజేపీ సానుభూతి పరులు, మద్దతుదారులు కూడా ఇబ్బంది పడ్డారు. ‘సంస్కారవంతులైన రేపి స్టుల’ గురించిన ఈ ఇంటర్వ్యూ ఒక విష యాన్ని స్పష్టం చేసింది. ఖైదీల సంస్కరణ పథ కంలో భాగంగా 14 సంవత్సరాల తర్వాత వీరిని విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయంలో సంస్కర ణాత్మకమైనది ఏదీ లేదని తేలిపోయింది. పైగా రావుల్జీ వారు చేసిన తప్పును కూడా ప్రశ్నించే సాహసం చేశారు. ‘‘వారు నేరం చేశారో లేదో నాకు తెలీదు’’ అన్నారు.

ఖైదీలను ముందస్తుగా విడుదల చేసే పథ కాల నుంచి రేపిస్టులను మినహాయించాలని 2022 వేసవిలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రక టించిన మార్గదర్శకాలు స్పష్టంగా చెప్పి ఉన్నాయి. దీనికి ముందున్న 1992 నాటి చట్టం ప్రకారం గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించి ఉన్నట్లయితే, ఆ సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి అవుతుందని న్యాయనిపుణులు చెబు తున్నారు. బిల్కిస్‌ బానో తరఫున వాదించిన న్యాయ వాది శోభా గుప్తా సంవత్సరాల పాటు న్యాయం కోసం పోరాడారు. తన çహృదయం బద్దలైపోయిం దనీ, ఇప్పుడు బిల్కిస్‌ మొహం కేసి చూడలేక పోతున్నాననీ ఆమె నాతో చెప్పారు. గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయంపై బిల్కిస్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ వేయగలుగుతుందా అని నేను అడిగాను. అప్పుడు శోభ చెప్పిన మాటలు నన్ను సిగ్గుపడేలా చేశాయి. ‘‘ఇంత జరిగాక ఇప్పుడు ఒక సామాన్య మైన మనిషి పోరాడాలంటే ఎంత సాహసం కావాలి? గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయంపై సీబీఐ అప్పీల్‌ చేయాలి. కేంద్ర ప్రభుత్వం అప్పీల్‌ చేయాలి. ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలి.’’

బిల్కిస్‌ ఉదంతం ఈ దేశంలోని ప్రతి మహిళకూ సంబంధించిన అంశమని మనకు తెలుసు. లైంగికంగా దాడికి గురైన మరొక మహిళ, ఈ 11 మంది రేపిస్టులు జైలు నుంచి బయటకు వచ్చాక శోభా గుప్తాకు ఫోన్‌ చేసి, తన కేసును కూడా ఉపసంహరించుకుంటే మంచిదా? అంటూ నిరుత్సాహంతో కూడిన స్వరంతో అడిగిందట. 2012 డిసెంబర్‌ 16న నిర్భయ ఘటన సంద ర్భంగా మనం చూసిన ఆ సాహసం ఇప్పుడు ఎక్క డుంది? ఈ మనుషులు తమ మిగిలిన జీవిత కాలం అంతా జైలులోనే గడపాల్సినవాళ్లు కాదా? న్యాయం కోసం పోరాడిన ఏ మహిళ జీవితమైనా ఇలా ముగిసిపోవలసిందేనా? ఈ ప్రశ్నకు సమా ధానం మనం ఎంత పెద్దగా మన స్వరాలను పెంచుతాం అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది.


బర్ఖా దత్‌ ,వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

Advertisement
 
Advertisement
 
Advertisement