ఒకడు విశ్వనాథ

Article On Viswanatha Satyanarayana - Sakshi

సందర్భం 

ఆధునిక యుగంలో ఎందరు కవులు తెలుగునాట పుట్టినా, గిట్టినా విశ్వనాథ తీరు వేరు. ఎందరు పూర్వాంధ్ర మహా కవులు చరిత్రలో ఉన్నా, ఒకడు నాచన సోమన అని ఆయనే అన్నట్లుగా, ఆధునిక యుగంలో ‘ఒకడు విశ్వనాథ’. కవిసార్వ భౌముడు అనగానే శ్రీనాథుడు, కవిసమ్రాట్‌ అనగానే విశ్వనాథుడు తెలుగువారికి గుర్తుకు వచ్చి తీరుతారు. కావ్యాలు, నాటకాలు, శత కాలు, నవలలు, కథలు, పీఠికలు, వ్యాసాలు, గీతాలు, చరిత్రలు, విమర్శలు ఇలా... పుంఖానుపుంఖాలుగా రాసిన ఆధునిక యుగ కవి ఒక్క విశ్వనాథ సత్యనారా యణ తప్ప ఇంకొకరు లేరు. ఎన్ని రచనలు చేపట్టారో, అంతకు మించిన ప్రసంగాలు చేశారు. ఇంతటి కీర్తి ఇంకొకరికి అలభ్యమనే చెప్పాలి. సెప్టెంబర్‌ 10వ తేదీకి విశ్వనాథ జన్మించి 125 ఏళ్ళు పూర్తయ్యాయి. భౌతికంగా లోకాన్ని వీడి నాలుగు దశాబ్దాలు దాటినా, సాహిత్య లోకం అతన్ని వీడలేదు. వీడజాలదు.

విశ్వనాథ ఎంచుకున్న మార్గం సంప్రదాయం. ఎదిగిన విధానం నిత్యనూతనం. తను ముట్టని సాహిత్య ప్రక్రియ లేదు. పట్టిందల్లా బంగారం చేశాడు. ‘ప్రతిభా నవనవోన్మేషశాలిని’ అన్నట్లుగా, ప్రతి ప్రక్రియలోనూ, ప్రతి దశలోనూ అతని ప్రతిభ ప్రభవించింది, విశ్వనాథ శారద వికసించింది. విశ్వనాథ సృజియించిన శారద సకలార్ధదాయిని. విశ్వనాథ వెంటాడని కవి ఆనాడు లేడు. విశ్వనాథ చాలాకాలం నన్ను వెంటాడాడని మహాకవి శ్రీశ్రీ స్వయంగా చెప్పుకున్నాడు. విశ్వనాథను ‘కవికుల గురువు’ అని అభివర్ణించాడు. కవికులగురువు అనేది కాళిదాసుకు పర్యాయపదం. శ్రీశ్రీ దృష్టిలో విశ్వ నాథ ఆధునిక యుగంలో అంతటి గురుస్థానీయుడు.

విశ్వనాథలోని సాహిత్య ప్రతిభను విశ్లేషిస్తే రెండు గుణాలు శక్తిమంతమైనవిగా కనిపిస్తాయి. ఒకటి కల్పన, రెండు వర్ణన. వేయిపడగలు వంటి నవల రాసినా, శ్రీరామాయణ కల్పవృక్షం వంటి మహాపద్యకావ్యం రాసినా ఆ కల్పనా ప్రతిభ, ఆ ధిషణా ప్రవీణత అక్షర మక్షరంలో దర్శనమవుతాయి. చిక్కని కవిత్వం కిన్నెర సాని పాటల్లో ముచ్చటగా మూటగట్టుకుంది. ఋతువుల వర్ణనలో ప్రకృతి, పల్లెదనం పాఠకుడి కన్నుల ముందు నాట్యం చేస్తాయి. ఏకవీర, తెరచిరాజు వంటి నవలలు, హాహా హూహూ, మ్రోయు తుమ్మెద వంటి రచనలు, ఆంధ్రప్రశస్తి, ఆంధ్రపౌరుషం వంటి పద్య కావ్యాలు, నేపాల, కాశ్మీర రాజవంశ చరిత్రలు, పురాణవైరి గ్రంథ మాల మొదలైన అనేక చారిత్రక నవలలు, నర్తనశాల, వేనరాజు వంటి నాటకాలు, విశ్వేశ్వర శతకం వంటి శతకములు, గుప్తపాశుపతము వంటి సంస్కృత నాట కాలు, అల్లసాని అల్లిక జిగిబిగి, నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి వంటి విమర్శనా వ్యాసాలు, పీఠికలు కుప్పలుతెప్పలుగా రాశారు. ఇవన్నీ ఒప్పులకుప్పలే. విశ్వనాథలో ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఈ మూడు చాలా ఎక్కువ. కొన్ని రచనలు స్వయంగా రాసినవి ఉన్నాయి. కొన్ని తను చెబుతూవుంటే వేరేవాళ్లు రాసినవి ఉన్నాయి. అది కథ, పద్యకావ్యం, సాంఘిక నవల, పాట, పీఠిక, వ్యాసం ఏదైనా కావచ్చు... ఉన్నపళంగా మొదలుపెట్టే శక్తి అచ్చంగా విశ్వనాథ ఐశ్వర్యం. దీన్ని మహితమైన ఆశుకవిత్వ ప్రతిభగా చెప్పవచ్చు. 

సంప్రదాయం, భారతీయత మధ్యనే తిరుగు తున్నప్పటికీ ఇంగ్లిష్‌ సాహిత్యాన్ని బాగా చదివేవాడు. విజయవాడ లీలా మహల్‌లో వచ్చే ప్రతి ఇంగ్లిష్‌ సినిమాను చూసేవాడు. ఇంగ్లిష్‌ సంస్కృతిని ద్వేషించాడు కానీ, భాషను ఎప్పుడూ ద్వేషించలేదు. రామాయణ కల్ప వృక్షం, వేయిపడగలు రెండూ కవిసమ్రాట్‌ నిర్మించిన మహా సారస్వత సౌధాలు. ఎంత కృషి చేశాడో, అంతటి కీర్తి కూడా పొందిన భాగ్యశాలి. తెలుగుసాహిత్య లోకా నికి మొదటి జ్ఞానపీఠ పురస్కారం ఆయనే సంపాయించి పెట్టాడు. పద్మభూషణ్, కళాప్రపూర్ణ వంటి అత్యున్న తమైన గౌరవాలు పొందాడు. డి.లిట్‌ కైవసం చేసుకు న్నాడు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందు కున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ ఆస్థానకవి పదవి కూడా విశ్వనా థను వరించింది. శిష్య సంపద చాలా ఎక్కువ. శత్రు గణం కూడా ఎక్కువే. ఇంతటి కృషి చేసిన సాహిత్య మూర్తి ప్రపంచ సాహిత్య చరిత్రలోనే చాలా అరుదుగా ఉంటారు. విశ్వనాథ అసామాన్యుడు. తెలుగువాళ్ళ ‘గోల్డునిబ్బు’.
వ్యాసకర్త: మాశర్మ,  సీనియర్‌ జర్నలిస్ట్,
మొబైల్‌ : 93931 02305

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top