Mysterious Stories In Telugu: Unsolved Mystery Of USA Dayana And Jennifer Murder - Sakshi
Sakshi News home page

మోస్ట్‌ వాంటెడ్‌ కిల్లర్‌

Published Sat, Oct 8 2022 1:56 PM

Funday Mystery Story About Dayana-Jennifer USA - Sakshi

అది అమెరికా, ఆరిజోనాలోని గ్లెన్‌డేల్‌ నగరం. ఇరవై ఏళ్ల డయానా షా క్రాఫ్ట్‌.. తన అక్క క్రిస్టీనాతో కలసి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ బర్గర్‌ కింగ్‌లో ఉద్యోగం చేసేది. వాళ్లది కొలరాడో. ఉద్యోగాల కోసం ఆరిజోనా వచ్చారు.డయానాని వదిలి ఉండలేని తన చిన్ననాటి స్నేహితురాలు పందొమ్మిదేళ్ల జెన్నిఫర్‌ లూత్‌..ఆరిజోనా వెళ్తానని తన పేరెంట్స్‌ని ఒప్పించింది. డిస్కవరీ కార్డ్‌లో జాబ్‌ సంపాదించి మరీ డయానా దగ్గరకు వచ్చేసింది. దాంతో ముగ్గురూ కలసి అదే అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు.

1996 మే 24 సాయంత్రం.. డయానా,జెన్నిఫర్‌లు కలసి.. త్వరగా వచ్చేస్తామని స్టీనాతో చెప్పి.. సమీపంలోని మినీ–మార్ట్‌కు వెళ్లారు. అయితే క్రిస్టీనా వాళ్లని చూడటం అదే చివరిసారైపోయింది. రాత్రి 12 దాటినా వాళ్లు తిరిగి రాకపోయేసరికి.. మెమోరియల్‌ డే వీకెండ్‌ పార్టీకి వెళ్లారేమోనని సరిపెట్టుకుంది క్రిస్టీనా. మరునాడు ఉదయానికి కూడా వాళ్లు రాకపోయేసరికి కంగారుపడింది. వెంటనే దగ్గర్లోనే ఉంటున్న తన తండ్రి రోడ్జర్‌ షాక్రాఫ్‌తో పాటు.. జెన్నీ పేరెంట్స్‌కి కూడా సమాచారం ఇచ్చింది. వాళ్లందరూ గ్లెన్‌డేల్‌కు చేరుకుని పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్‌ ఇవ్వడంతో పోలీసులు రంగంలో దిగారు. విచారణలో.. ఆ అమ్మాయిలు ఒక అజ్ఞాత వ్యక్తితో వెళ్లడం చూశానని చెప్పాడు మినీ–మార్ట్‌ క్యాషియర్‌.

దాంతో మెక్సికోలో జరిగే మెమోరియల్‌ డే పార్టీకి వెళ్లారేమో అని పోలీసులతో సహా అంతా భావించారు. కానీ రోజులు వారాలయ్యాయి. వారాలు నెలలు అయ్యాయి. వాళ్లు మాత్రం తిరిగిరాలేదు.ఆగస్ట్‌ మధ్యవారంలో ఫీనిక్స్‌కు ఉత్తరాన వంద మైళ్ల దూరంలోని మారుమూల ఎడారిలోకి కొందరు స్థానికులు వేటకెళ్లినప్పుడు.. ఒకదానిపై ఒకటిపడి ఉన్న రెండు మృతదేహాలు వారి కంటపడ్డాయి. అవి ఇరవై–ఇరవై ఐదేళ్లలోపు యువతులవని వాళ్లు పోలీసులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ శవాలను పోస్ట్‌మార్టమ్‌కి పంపించారు. అవి డయానా, జెన్నీల మృతదేహాలేనని తేలడంతో అంతా షాక్‌ అయ్యారు. అసలు అంత దూరం వాళ్లెలా వెళ్లారు? ఎవరు తీసుకుని వెళ్లారు? చనిపోకముందే అక్కడికి వెళ్లారా? లేక ఎవరైనా చంపి అక్కడ పడేశారా? వంటివన్నీ సమాధానాల్లేని
ప్రశ్నలయ్యాయి. డయానా, జెన్నిఫర్‌ మాయమైన రోజు అసలేమైంది? అంటూ మరోసారి విచారణ మొదలుపెట్టారు పోలీసులు.

‘క్లియర్‌గా ఏం జరిగిందో చెప్పు’ అంటూ.. మినీ–మార్ట్‌  క్యాషియర్‌ని నిలదీశారు. ఆ రోజు ఆ ఇద్దరమ్మాయిలు సిగరెట్, సోడా ఇక్కడే కొనుక్కుని తాగారని, రెండు గంటల పాటు బయట బెంచ్‌ మీదే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారని, ఆ తర్వాత నీలం రంగు పికప్‌ ట్రక్‌లో వచ్చిన ఓ వ్యక్తి వారితో మాట్లాడాడని,కొంతసేపటికి అదే ట్రక్కులో ఎక్కి ఆ ముగ్గురూ వెళ్లిపోయారని చూసింది చూసినట్లుగా చెప్పాడు ఆ క్యాషియర్‌. అంతేకాదు ఆ వ్యక్తికి ముప్పై నుంచి ముప్పై మూడేళ్ల వయస్సుంటుందని, బ్రౌన్‌ కలర్‌ జుట్టు, గడ్డం ఉన్నాయని.. డెనిమ్‌ జాకెట్‌ వేసుకున్నాడనీ సమాచారమిచ్చాడు.

దాంతో పోలీసులు.. ఆ అజ్ఞాత వ్యక్తి కచ్చితంగా డయానా, జెన్నిఫర్‌లలో ఇద్దరికీ లేదా ఒకరికి బాగా తెలిసినవాడే అయ్యుంటాడని నమ్మారు.తక్షణమే అనుమానితుడి ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. ఈ క్రైమ్‌ స్టోరీకి పత్రికల్లో, టీవీల్లో విస్తృత ప్రచారం కలిపించారు. ఫీనిక్స్‌లో డయానా, జెన్నీలు ఎన్నో పార్టీలకు, నైట్‌క్లబ్‌లకు హాజరయ్యేవారని తెలియడంతో.. అక్కడే ఆ ఆగంతకుడు వారికి పరిచయం అయ్యుంటాడని భావించారు. ఎక్కడైతే వీరి మృతదేహాలు లభించాయో అక్కడే రెండు సిలువలను పాతి..డయానా, జెన్నిఫర్‌ల ఫొటోలు పెట్టి,సమాధుల్లా కట్టించారు కుటుంబసభ్యులు. ఆ పరిసరాల్లో పోలీస్‌ నిఘాని పెంచారు.

నాలుగు సంవత్సరాల తర్వాత అంటే 2000 సంవత్సరం,సెప్టెంబర్‌ 29న సమాధుల దగ్గరున్న ఫ్రేమ్స్‌లోని ఫొటోలు మాయమయ్యాయి. వాటిని హంతకుడే దొంగిలించి ఉంటాడని చాలామంది నమ్మారు. ఎందుకంటే సాధారణమైన వ్యక్తులు.. చనిపోయినవారి పట్ల చాలా గౌరవంతో ఉంటారని.. అలాంటిది సమాధులపై ఫొటోలు మాయం చేశారంటే అది కచ్చితంగా నేరస్థుల పనేనని భావించారు. ఫొటోలు మాయం చేసింది హంతకుడే అయితే అతడిలో అపరాధ భావన కలిగిందా? లేక ఇన్నేళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకున్నందుకు గర్వపడుతున్నాడా? జెన్నీ,డయానాలే కాకుండా ఇంకా ఎంత మంది ఆడపిల్లలు అతడి చేతుల్లో బలయ్యారో? ఇలా ఎన్నో ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.

జెన్నీ మీద దిగులుతో ఆమె తండ్రి రాబర్ట్‌.. 2014లో జెన్నీ స్మారకదినం రోజునే కన్నుమూశాడు. అపμటికే డయానా తల్లిదండ్రులు కూడా మరణించారు.నిజానికి రాబర్ట్‌ తన కూతురు జెన్నీ కోసం పెద్ద పోరాటమే చేశాడు. హంతకుడు కచ్చితంగా ఒక్కడు కాదు.. అతనికి సహచరులు ఉండే ఉంటారని అతడు భావించాడు. ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేయించాడు. అయినా ఫలితం లేకపోయింది.

2014లో అతడి మరణం తర్వాత.. అతడి భార్య డెబోరా.. ఇ‍ప్పటికీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఆవిడ కొలరాడోలోని లవ్‌ల్యాండ్‌లో నివసిస్తూ కోర్టుల చుట్టూ.. అధికారుల చుట్టూ తిరుగుతోంది.ఇప్పటికీ ఆమె తన కూతురు జెన్నీ బర్త్‌డేని సెలబ్రేట్‌ చేస్తూ.. ఆమె జ్ఞాపకాల్లోనే బతుకుతోంది. నేరస్థుడు దొరుకుతాడని.. ఏదో ఒకరోజున నిజం బయటపడుతుందని నమ్ముతోంది. ఆ దుస్సంఘటన జరిగి 26 ఏళ్లు కావస్తున్నా.. ఆ ప్రాణస్నేహితుల్ని చంపిన హంతుకులు ఎవరో బయటపడలేదు. ఆ తల్లి కడుపుకోతకు సమాధానం దొరకలేదు.
- సంహిత నిమ్మన

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement