
ఇప్పుడు అందాలపోటీలు చాలా మారాయి. రంగు, రూపు, ఆకృతి లాంటివాటికి అంత ప్రాధాన్యం ఉండట్లేదు. బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యాన్నే ఆరాధిస్తున్నారు. అందుకే అందాలపోటీల్లో ఇన్‌క్లూజివిటీ పెరిగింది. మేని ఛాయ, ఆకృతి ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అని చెబుతున్న మిస్ సోమాలియా జైనబ్(Zainab Jama) బాలీవుడ్ సినిమాలు చాలా చూస్తారట. షారూఖ్ ఖాన్, కరీనా కపూర్ తన ఫేవరెట్ యాక్టర్స్ అని చెబుతున్నారు. ఆమె ఇంకా ఎన్నో విషయాలను ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్నారు.
నేను ఎఫ్‌జీఎమ్ (ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్) సర్వైవర్‌ని. సోమాలియాలో ఉన్న కామన్ హార్మ్‌ఫుల్ ప్రాక్టీస్ ఇది. మా దేశంలోని దాదాపు 98 శాతం మహిళలు దీన్ని అనుభవించినవారే! ఇప్పుడున్న ఆడపిల్లల్లో 30 శాతం మంది ఈ ఆచారం బారినపడే వయసుకు చేరుకున్నారు. అంటే ఏడేళ్లకు ఎఫ్‌జీఎమ్ చేస్తారు. ఎఫ్‌జీఎమ్ అంటే మహిళల సెక్సువల్ ఆర్గాన్‌ని కత్తిరించడం. యవ్వనంలో ఆమెకు లైంగికేచ్ఛ లేకుండా చేయడం. లైంగికేచ్ఛ లేకపోతే ఏ మగవాడి ఆకర్షణకు లోనుకారనే ఒక ప్రమాదకర, మూఢ విశ్వాసమన్నమాట.
ఇది ఒక్క సోమాలియాలోనే కాదు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఇప్పటికీ ప్రాక్టీస్‌లో ఉంది. ఈ అనాచారం వల్ల మా దేశంలో చాలామంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతోమంది అధికరక్తస్రావంతో దాదాపు చావు అంచులదాకా వెళ్లారు. నేను కూడా దీన్నుంచి కోలుకుని.. ఈ కథను షేర్ చేయడానికి చాలా కాలమే పట్టింది. నా కథ విని.. ఇలాంటి దుర్మార్గమైన ఆచారాన్ని రూపుమాపడానికి తగిన స్పందన, సహాయం అందుతుందని ఒకే ఒక ఆశతో నా ఈ కథను నాకు దొరికిన వేదిక మీదల్లా పంచుకోవడం మొదలుపెట్టాను. ఈ బ్యూటీపాజెంట్‌లో కూడా నా తోటి కంటెస్టెంట్స్‌కి చె΄్పాను. ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి దురాచారం ఒకటుందని ఈ కంటెస్టెంట్స్‌లో చాలా మందికి తెలియదు. నా కథ విని చలించిపోయారు.
ఫిమో ఇనిషియేటెడ్ ఫౌండేషన్‌ను స్టార్ట్ చేసి, ఆ దురాచారానికి వ్యతిరేకంగాపోరాడుతున్నానని తెలిసి.. మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. నాలో భరోసా నింపారు. బ్యూటీపాజెంట్ అంటే కేవలం స్కిన్ షో మాత్రమే అనుకునేవారు ఈ విషయం విని తమ అభి్రపాయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కంటెస్టెంట్స్‌లో ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రగుల్. అందరం అన్నీ షేర్ చేసుకుంటున్నాం. దానివల్ల వ్యక్తిగత సమస్యలు,పోరాటాలు చిన్నవిగా తోస్తున్నాయి. ఎదుర్కోవడానికి బోలెడంత అండ దొరికిన ఫీలింగ్ కలుగుతోంది. సిస్టర్‌హుడ్ డెవలప్ అవుతోంది. ఒకరికొకరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సరికొత్త ప్రయత్నాలకు ప్రేరణనిస్తున్నారు.పాజెంట్ తర్వాత కూడా ఈ బాండింగ్ కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను.
కొత్తగా అనిపించడం లేదు..
ఇండియా, ఆఫ్రికా సంస్కృతి, ఆహారపు అలవాట్లకు వస్తే.. ఇక్కడ నాకేమీ కొత్తగా అనిపించట్లేదు. నేను ప్యూర్ వెజిటేరియన్‌ని. సో ఇక్కడి భోజనాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. తెలంగాణ నా సొంతింటిని మరిపిస్తోంది. ఈపాజెంట్, కంటెస్టెంట్స్‌తో బాండింగ్, కొత్త భాషలు, కొత్త కల్చర్స్ తెలుసుకోవడం.. ఇవన్నీ నిజంగా వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. తిరుగు ప్రయాణంలో ఆ ఎక్స్‌పీరియెన్సెస్‌ని, ఇక్కడ సంపాదించుకున్న జ్ఞానాన్ని తీసుకెళ్దామనుకుంటున్నాను. – సరస్వతి రమ
మండేలా స్ఫూర్తి
నాకు ఏడేళ్లున్నప్పుడు జెనిటల్ మ్యుటిలేషన్ జరిగింది. అదొక పెయిన్‌ఫుల్æట్రామా. దానినుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. నాలా ఇంకే అమ్మాయికీ జరగొద్దని అప్పుడే నిర్ణయించుకున్నాను. నా తొమ్మిదేళ్ల వయసులో మా కుటుంబం యూకేకి మైగ్రేట్ అయింది రెఫ్యూజీగా. అక్కడే ఏవియేషన్ అండ్ ఎయిర్‌క్రాఫ్ట్ మేనేజ్‌మెంట్ చేశాను. ప్రయాణాలన్నా.. ఏరోప్లేన్స్ అన్నా చాలా ఇష్టం. అందుకే అందులోనే చదువు పూర్తి చేశాను. ఒక్క ఎఫ్‌జీఎమ్ కోసమే కాదు.. ఇలాంటి ఇంకెన్నో దురాచారాలు, హింస మీద అమ్మాయిలు, మహిళలకు చైతన్యం కలిగించే ఎన్నో ఫౌండేషన్స్‌తో కలిసి పనిచేస్తున్నాను.
అమ్మాయిల చదువు కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థలతోనూ అసోసియేట్ అయి ఉన్నాను. మహిళలందరినీ ఏకం చేసి వారి మధ్య సిస్టర్‌హుడ్‌ను పెంచడానికీ ప్రయత్నిస్తున్నాను. నా మాతృదేశానికి వెళ్లిపోయి.. యుగాలుగా నాటుకుని ఉన్న ఈ అనాచారాన్ని రూపుమాపడమే నా లక్ష్యం. ఇదొక్క సోమాలియాకే పరిమితమైన సమస్య కాదు. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఉంది. మార్పు కోసం అన్ని దేశాల్లోనూ వర్క్ చేస్తాను. అయితే ఇది నేనిప్పుడు మీతో చెబుతున్నంత ఈజీ కాదని తెలుసు. మా ట్రెడిషన్ గురించి ప్రపంచానికి చెబుతున్నానని, ధిక్కరిస్తున్నానని బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయి. వెనకడుగు వేసేది లేదు. ఈ విషయంలో నాకు నెల్సన్ మండేలా స్ఫూర్తి. – ‘మిస్ సోమాలియా’ జైనబ్