శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా! శ్రీ యాదగిరి నారసింహా!

YTDA: Sakshi Special About YADADRI Temple Developments

ఒక్కో నిర్మాణానికి ఒక్కో విశిష్టత స్థల పురాణం

యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలోని విభాండక ఋషి. అతడి పుత్రుడైన ఋష్యశృంగుడి కుమారుడు యాదరుషి. అతణ్ణే యాదర్షి అంటారు. చిన్నప్పట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆ స్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుణ్ణి అన్వేషించడానికి అడవులూ, కొండలూ కోనలూ తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న యాదర్షి ఒకరోజు ఇప్పుడున్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక రావిచెట్టు కింద పడుకున్నాడు.

అప్పుడు కలలో ఆంజనేయస్వామి కనిపించి ‘నీ పట్టుదల నాకు నచ్చింది. నీకు తోడుగా నేనుంటాను. కఠోరమైన తపస్సు చేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడు’ అని చెప్పారట. నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఉగ్రనారసింహుడు ప్రత్యక్షమయ్యారట. ఆ తేజస్సును చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని కోరాడట యాదర్షి. అప్పుడు లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చి ‘‘ఏం కావాలో కోరుకో’’ అని అడిగితే, ‘‘నీ దర్శనం కోసం ఇంత ఘోర తపస్సు సామాన్యులు చేయలేరు. అందుకే నువ్వు శాంత రూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపో’’ అని కోరాడట. అప్పుడు కొండశిలమీద స్వామి ఆవిర్భవించాడు.

కొన్నాళ్ల తరువాత యాదర్షికి మరో కోరిక కలిగింది. స్వామిని ఒకే రూపంలో చూశాను. వేర్వేరు రూపాల్లో చూడలేకపోయానే అనుకుని మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు స్వామి మళ్లీ ప్రత్య„ý మయ్యాడు. యాదర్షి కోరిక విని, ‘‘నా రూపాలన్నీ నువ్వు చూడలేవు’ అయినా నీకోసం మూడు రూపాలు చూపిస్తాను’’ అని జ్వాలా, యోగానంద, గండభేరుండ నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడట జ్వాలా నారసింహుడు సర్పరూపంలో ఉంటాడు. యోగానందుడు అర్చా విగ్రహరూపంలో ఉంటాడు. గండభేరుండ నారసింహుడు కొండ బిలంలో కొలువై ఉంటాడు. తరువాత యాదర్షి... తనను స్వామిలో ఐక్యం చేసుకోమని కోరడంతో అలాగే చేసుకున్నాడట స్వామి. ఆ యాదర్షి పేరుమీదనే ఇది యాదగిరిగుట్ట అయింది.

స్వాగత తోరణం..
యాదాద్రి కొండపైన భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల తిరుపతి తరహాలో ఈ ఆర్చీ ఉంటుంది. ఇక వైపు కొండ ఎక్కడానికి, మరో వైపు కొండ దిగేందుకు ఈ ఆర్చీని నిర్మాణం చేశారు. ఈ ఆర్చీ పైభాగంలో శంకు, చక్ర, నామాలు, శ్రీలక్ష్మీనరసింహస్వామి రూపాలను తీర్చిదిద్దారు.

ఆలయ విశిష్ఠత
గర్భగుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరి కాస్త లోపలయోగముద్రలో యోగానందస్వామి, లక్ష్మీనరసింహ స్వాములను దర్శించుకోవచ్చు. గర్భాలయం నుంచి బయటకు వస్తే మెట్లకు ఎడమపక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి కింద గల పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిపిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక బయట ఎడమవైపున మెట్లు దిగితే పుష్కరిణి. కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుని ఆలయం అగుపిస్తాయి.

ఆలయమంతా స్వర్ణమయం
గర్భాలయంపైన దివ్య విమాన గోపురానికి భక్తులు విరాళంగా ఇచ్చిన 125 కిలోల బంగారంతో తాపడం చేయిస్తున్నారు. పంచనారసింహులు కొలువైన గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం చేసిన కవచాలను బిగించారు. ఆళ్వార్‌ మండపంలో 35 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభానికి సైతం బంగారు తొడుగులను ఇటీవలనే పూర్తి చేశారు. త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలకు పసిడి కలశాలు బిగించారు. వీటితోపాటు ఉప ఆలయాల ద్వారాలకు వెండి, ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లో ద్వారాలకు ఇత్తడి తొడుగులు, అష్టభుజి ప్రాకార మండప శిఖరాలపై రాగి కలశాలు బిగించారు. బంగారు తొడుగుల పనులన్నీ చెన్నైలోని స్మార్ట్‌ క్రియేషన్‌ సంస్థలో చేయించారు.  

శివాలయం...
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైనే ఉన్న అనుబంధ ఆలయంగా శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి దేవాలయం కొనసాగుతోంది. శివాలయంలో ప్రధాన ఆలయం, ముఖ మండపం, ప్రకార మండపం, త్రితల రాజగోపురం నిర్మించారు. ప్రధాన ఆలయంంలోని మండపాల్లో, నాలుగు దిశల్లో కృష్ణ శిలతో స్టోన్‌ ఫ్లోరింగ్‌ పనులు చేశారు. ప్రధాన ఆలయం ముందు భారీ నందీశ్వరుడి విగ్రహాన్ని పెట్టారు. ఆలయానికి ఉత్తర దిశలో శ్రీస్వామి వారి కల్యాణ మండపం, ఆ పక్కనే రథశాల నిర్మించారు. ఆలయ ఉద్ఘాటన నాటికి ఆలయంలో స్ఫటిక లింగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్‌ 25న శివాలయంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.

విష్ణు పుష్కరిణి...
కొండపైన విష్ణు పుష్కరిణిని అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. గతంలో ఈ పుష్కరిణిలో భక్తులు స్నానాలు చేసే వారు. కానీ ఇప్పుడు విష్ణు పుష్కరిణిలో శ్రీస్వామి వారికి మాత్రమే ఉపయోగించనున్నారు.

గిరి ప్రదక్షిణ...
శ్రీస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. వీరితో పాటు మండల దీక్ష చేసే భక్తులు సైతం ప్రతి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరి ప్రదక్షిణను ఆలయ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు.

పుష్కరిణిలో భక్తుల స్నానాలు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం గండి చెరువు సమీపంలో నిర్మించిన లక్ష్మీ పుష్కరిణి లో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. ప్రధానాలయం ఉద్ఘాటన సందర్భంగా పలువురు భక్తులు బాలాలయం లో శ్రీస్వామి వారిని కొండపైన దర్శనం చేసుకొని, అనంతరం కొండ కింద జరుగుతున్న నిర్మాణాలను తిలకించారు. ఈ సమయంలో లక్ష్మీ పుష్కరిణిలోకి వెళ్లి స్నానాలు చేసి ఆనందంగా గడిపారు.

కల్యాణ కట్ట ప్రారంభం..
ఆధునిక హంగులతో నిర్మాణం చేసిన కల్యాణ కట్టను ఈవో గీతారెడ్డి ఆదివారం ప్రారంభించారు. 28వ తేదీ నుంచి ప్రధానాలయంలో స్వయంభూల దర్శనం కలగనున్న నేపథ్యంలో భక్తులు అధికంగా క్షేత్రానికి వచ్చే అవకాశం ఉంది, ఇందులో భాగంగానే ముందస్తుగా కల్యాణ కట్టలో పూజలు చేసి ప్రారంభించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా ఈ కల్యాణ కట్టలోనే తలనీలాలను సమర్పించుకోనున్నారు.

స్వామి పుష్కరిణి
ఈ క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణికి ఓ ప్రత్యేకత ఉంది. దీనినే ‘విష్ణుకుండం’ అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది. ఈ తీర్థం చాలా మహిమాన్వితమైనదని పేరు. భక్తుల రాక యేటేటా పెరగడంతో ఈ క్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా ఉండగా హైదరాబాద్‌  వాస్తవ్యుడైన రాజామోతీలాల్‌ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి వైభవం విని స్వామి వారిని దర్శించి స్వామి వారికి ఆలయనిర్మాణం చేయించాడు. ప్రాకారం, గోపుర ద్వారం, ముఖమండపం నిర్మించాడు. ఆ తర్వాత భక్తులు తమ యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ క్షేత్ర యాజమాన్యం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. యాదగిరి లక్ష్మీనరసింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతోంది.

వైకుంఠద్వారం...
యాదాద్రి కొండపైకి నడకదారిన వెళ్లే భక్తులు ఈ వైకుంఠ ద్వారం నుంచి వెళ్లాలి. ఈ వైకుంఠద్వారాన్ని యాలీ పిల్లర్ల మీద ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వారం వద్ద భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మెట్లదారి నుంచి శ్రీస్వామి వారి క్షేత్రానికి వెళ్లవచ్చు.

అన్నప్రసాదం...
గండి చెరువుకు కొద్ది దూరంలో క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం కోసం అన్నసత్ర భవనాన్ని 2.7 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు యాదాద్రి దేవాలయ అభివృద్ధి సంస్థ  రూ.6కోట్లు ఖర్చు చేస్తుండగా.. రూ.11కోట్లను వేగేశ్న సంస్థ ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఈ మండపం స్లాబ్‌ లెవల్‌ పనులు పూర్తయ్యాయి.

కల్యాణ కట్ట...
 శ్రీస్వామి వారికి భక్తులు సమర్పించుకునే తలనీలాల కోసం అధునాతన హంగులతో కల్యాణ కట్టను నిర్మించారు. దీనిని 2.23 ఎకరాల విస్తీర్ణంలో రూ.20.3కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు. ఇందులో ఒకేసారి 360 మంది పురుషులు, 160 మంది మహిళ భక్తులు తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.

దీక్షాపరుల మండపం
శ్రీస్వామి క్షేత్రంలో మండల దీక్ష చేసే భక్తులకు దీక్షాపరుల మండపాన్ని అధునాతనంగా నిర్మించారు. 1.88 ఎకరాల స్థలంలో రూ.8.09 కోట్ల వ్యయంతో ఈ దీక్షారుల మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 140 మంది పురుషులు, 108 మంది మహిళ భక్తులు దీక్షలు చేసే సమయంలో బస చేసేలా ఏర్పాట్లు చేశారు.

గండి చెరువు...
శ్రీస్వామి వారి తెప్పోత్సవం కోసం గండి చెరువును వైటీడీఏ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మల్లన్న సాగర్‌ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చారు. ఇందులో శ్రీస్వామి వారి తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా భక్తులు సేద తీరేందుకు లాన్స్, గ్రీనరీ, బేంచీలను ఏర్పాటు చేసి, బోటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు.

ఫలితాలనొసగే ‘ప్రదక్షిణల మొక్కు’
ఈ క్షేత్రంలో ప్రదక్షిణల మొక్కు’ ప్రధానమైనది. దీనివల్ల మానసిక, శారీరక, ఆర్థికబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండలం (41 రోజులు), అర్ధమండలం, 11 రోజుల ప్రదక్షిణల మొక్కులు మొక్కుకుంటారు భక్తులు. నిత్యం గర్భాలయానికి రెండుసార్లూ, ఆంజనేయస్వామికి 16 సార్లూ ప్రదక్షిణలు చేస్తారు.ఈ మొక్కు తీర్చుకునే దశలో స్వామి కలలోనే తమకు చికిత్సలు చేసి, శారీరక బాధల నుంచి విముక్తి చేస్తారని నమ్ముతారు.

యాగ స్థలం...
యాదాద్రి కొండకు దిగువన 93 ఎకరాల్లో యాగ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గతంలో 1,008 కుండాలతో మహా సుదర్శన యాగం చేయాలని అధికారులు భావించారు. కానీ అనివార్య కారణాలతో ఈ యాగం వాయిదా పడింది. ఇప్పుడు ఇందులో భక్తుల వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు వినియోగిస్తున్నారు.

లక్ష్మీపుష్కరిణి...
కల్యాణకట్టకు ఎదురుగానే భక్తుల కోసం లక్ష్మీ పుష్కరిణిని ఆధ్యాత్మిక హంగులతో అద్భుతం గా నిర్మించారు. 2.13 ఎకరాల్లో రూ.6.67కోట్ల వ్యయంతో ఈ లక్ష్మీ పుష్కరిణి రూపుదిద్దుకుంది. ఇందులో ఇప్పుడు మిషన్‌ భగీరథ నీళ్లను నింపుతున్నారు. త్వరలోనే గోదావరి జలాలను సైతం నింపనున్నారు. ఈ పుష్కరిణిలో 1,500 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ఏర్పాట్లు చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు.

వ్రత మండపం...
అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి క్షేత్రం తరువాత యాదాద్రీశుడి ఆలయంలోనే భక్తులు అధిక సంఖ్యలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను జరిపిస్తారు. ఇందుకోసం నిర్మిస్తున్న వ్రత మండపం ఇది.

లడ్డూ ప్రసాదం..
క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా లడ్డూ, పులిహోరకే మక్కువ చూపెడతారు. ఇందుకు వైటీడీఏ అధికారులు అధునాతన హంగులతో మానవ ప్రమేయం లేకుండా మిషన్ల ద్వారా ప్రసాదం తయారీ చేసే విధంగా ఏర్పాటు చేశారు. క్షేత్రానికి ఎంత మంది వస్తే అంత మందికి లడ్డూ, పులిహోర, ఇతర ప్రసాదం తయారీ చేసి ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఇందులో ప్రత్యేక కౌంటర్లు, లైన్లు ఏర్పాటు చేశారు.

పూర్వ జన్మ సుకృతం
 ‘‘యాదాద్రి నరసింహుని ఆలయ పునర్నిర్మాణం కోసమే భగవంతుడు నన్ను భూమి మీదికి పంపించి ఉంటాడు. అందుకోసమే భక్తులకు కావాల్సిన రీతిలో క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకోగలిగాను. యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్‌ ఆనంద సాయి రూపొందించిన ప్లాన్‌ ప్రకారం పని చేయడానికి నన్ను పిలిపించారు. ప్రధాన స్థపతి సుందర రాజన్‌ ద్వారా ఆలయ ప్లాన్‌ను ఆమోదించారు. ఆ క్రమంలో నన్ను అదనపు స్థపతి, సలహాదారుగా నియమించారు. స్వామివారి ప్రధానాలయం, శివాలయం కార్యనిర్వహణ పనిని అప్పగించారు. స్థపతులు, శిల్పులు, టీటీడీ శిల్ప కళాశాల విద్యార్థులు... ఇలా అందరి భాగస్వామ్యంతో నాకప్పగించిన పనులు పూర్తి చేశాను.

అందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి నిమిషం ప్రతి మనిషి పక్కన స్వామి వారే ఉండి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఇది ఏ ఒక్కరి వల్లా పూర్తి కాలేదు. స్వామివారి ఆజ్ఞగానే భావించి అందరూ ఇందులో పాలు పంచుకున్నారు. సర్వేజనాస్సుఖినోభవంతు అన్న విధంగా స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉంటాయి. దేవాదాయ ధర్మాదాయ స్థపతి సలహాదారుగా ఎన్నో ఆలయాలు నిర్మించిన నేను.. యాదాద్రి క్షేత్ర నిర్మాణంలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుకృతం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. స్వామివారికి సహస్రాధిక నమస్సులు తెలియజేసుకుంటున్నాను’’.
– స్థపతి డాక్టర్‌ ఆనందాచారి వేలు

మహాద్భుత క్షేత్రంగా యాదాద్రి
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఎంతో అద్భుతంగా జరిగింది.దేశంలోనే మహాద్భుత క్షేత్రంగా విలసిల్లుతుంది. ఈ మహాక్రతువులో నేను కూడా భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని నభూతో న భవిష్యతి అన్న రీతిలో పూర్తి కావించారు. యావత్‌ భక్త ప్రపంచం ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మహా ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. నేటి ఉదయం నిత్యకైంకర్యం గావించగానే బాలాలయంలో నిత్య పూర్ణాహుతి జరుగుతుంది. వెంటనే శ్రీస్వామి వారు మేళతాళాలు, స్వస్తి మంత్రాలు, వేద దివ్య ప్రబంధ పాశుర పఠనాలతో ప్రధానాలయంలోకి వేంచేస్తారు.

అక్కడ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. 11.45 నిమిషాల నుంచి గోపురాలకు పూజలు నిర్వహించి, 11.55కు కుంభాభిషేకం ఏకకాలంలో జరిపిస్తాం. 92 స్థానాల్లో 200 మంది రుత్విక్కులు పాల్గొని ఏకకాలంలో అన్ని గోపురాలు, ప్రాకార మండపాలు, గర్భాలయం, ఆండాల్, ఆళ్వార్, రామానుజులు, విష్వక్సేన సన్నిధి, చతుర గోపురాలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ప్రధానాలయంలో మొదటి పూజ, మంత్రపుష్ప నీరాజనాలు, ప్రసాద వినియోగం పూర్తవుతాయి. తర్వాత సీఎం కేసీఆర్‌కు ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం సంధ్యాసమయానికి ద్వితీయ ఆరాధన పూర్తి కాగానే శాంతి కల్యాణం నిర్వహించి ఉత్సవాలకు వచ్చిన పండితులకు సన్మానం చేస్తాం. భక్తులకు శ్రీస్వామి వారి ఆశీర్వచనం ఉంటుంది.
– నల్లంథీఘల్‌ లక్ష్మీనరసింహచార్యులు
ఆలయ ప్రధానార్చకులు

కథనాలు: సాక్షి యాదాద్రి, యాదగిరి గుట్ట, ఫొటోలు: కొల్లోజు శివకుమార్, సాక్షి భువనగిరి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top