YouTube Shorts: చేస్తున్నారా.. పర్సు నిండుతుందిలెండి!

Youtube Announces 100 Million Dollars Shorts Fund For Creators - Sakshi

టిక్‌..టాక్‌ దూరమైన తరువాత ఇప్పుడు యూత్‌ ‘యూట్యూబ్‌ షార్ట్స్‌’ వీడియోలపై మనసు పారేసుకుంది. జస్ట్‌ 60 సెకండ్లలో ‘ఆహా ఏమి క్రియేటివిటీ!’ అనిపిస్తే... మనసు నిండే ప్రశంసలే కాదు, పర్స్‌ నిండే డబ్బు కూడా మీ సొంతమవుతుంది..... డబ్బు ఉన్న దగ్గరికి మనం వెళతాం. కానీ క్రియేటివిటీ ఉన్న దగ్గరికి డబ్బు వెళుతుంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేయకపోవచ్చుగానీ, పర్స్‌ బరువును పెంచుతుంది. భరోసా ఇస్తుంది!

వరల్డ్‌ బిగ్గెస్ట్‌ ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ మన దినచర్యల్లో ఒకటి. మన రచ్చబండ కూడా. కాస్తో కూస్తో క్రియేటివిటీ ఉన్న యువతరానికి ఇదొక సువర్ణవేదిక అయింది. ఎందరికో ఎన్నో అవకాశాలు వచ్చాయి. సినిమా తీయడం గొప్ప. అంత పెద్ద సినిమాను నవలగా రాయడం గొప్ప. అంత పెద్ద  నవలను కథగా రాయడం గొప్ప. అంత పెద్ద కథను మూడు ముక్కల్లో మినీ కవితగా రాయడం గొప్ప. మాధ్యమం మారుతున్నప్పుడు అచ్చులో అయితే ‘స్థలపరిధి’కి, దృశ్యాల్లో అయితే ‘కాలపరిధి’కి ప్రాధాన్యత ఏర్పడుతుంది. మెరుపు వేగంతో చానల్స్, వీడియోలు మార్చేస్తున్న ఈ కాలంలో ప్రేక్షక మహానుభావుల మనసును క్షణాల్లో దోచేయాలి. 

‘అరే ఇదేదో బాగుందే’ అని అక్కడే ఆగిపోవాలి. అదే ‘క్లుప్తత’ గొప్పతనం. అందుకే టిక్‌.. టాక్‌ పొట్టి వీడియోలు బాగా పాపులర్‌ అయ్యాయి. టిక్‌..టాక్‌ను అచ్చంగా అనుకరిస్తూ కొన్ని బోల్తా పడ్డాయి. కొన్ని ఫరవాలేదనిపించుకున్నాయి. ‘యూట్యూబ్‌ షార్ట్స్‌’కు మాత్రం మంచి స్పందన మొదలైంది. ఈ స్పందనను మరోస్థాయికి తీసుకెళ్లడానికి తాజాగా ‘షార్ట్స్‌ ఫండ్‌’ ప్రకటించింది యూట్యూబ్‌.

దీని ద్వారా గుర్తింపు పొందిన కంటెంట్‌ క్రియేటర్లకు ప్రతినెలా సొమ్ము చెల్లించే అవకాశం ఏర్పడుతుంది. టిక్‌.. టాక్‌ గత సంవత్సరం ‘క్రియేటర్స్‌ ఫండ్‌’ పేరుతో రెండు వందల మిలియన్‌ డాలర్లను కేటాయించింది. అదే బాటలో యూట్యూబ్‌  కూడా కంటెంట్‌ క్రియేటర్ల కోసం వంద మిలియన్‌ డాలర్లు (2021–2022) కేటాయించింది. ఇప్పుడు టిక్‌... టాక్‌ లేదు కాబట్టి చాలామంది క్రియేటర్లు యూట్యూబ్‌ షార్ట్స్‌ వైపు మొగ్గు చూపారు.

‘ఈ జనరేషన్‌ క్రియేటర్స్, ఆర్టిస్ట్‌ల క్రియేటివిటీని బిజినెస్‌గా మలచడంలో యూట్యుబ్‌ సహాయపడుతుంది. మా ప్రయాణంలో షార్ట్‌ఫండ్స్‌ అనేది తొలి అడుగు మాత్రమే’ అంటున్నారు యూట్యూబ్‌ షార్ట్స్‌ డైరెక్టర్‌ ఎమీ సింగర్‌. ఎప్పుడు మొదలవుతుంది? ఎంత సొమ్ము ఇస్తారు..? మొదలైన విషయాలను ఇంకా ప్రకటించనప్పటికీ బహుమతికి అర్హమైన షార్ట్స్‌ వీడియోల గురించి వస్తే... ప్రేక్షకులను మెప్పించే కంటెంట్, ఒరిజినల్‌ కంటెంట్‌ అయి ఉండాలి. యూట్యూబ్‌ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు లోబడి ఉండాలి. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ మరి!

మీ కోసం...
కంటెంట్‌ క్రియేటర్లను ప్రోత్సహించడానికి యూట్యూబ్‌ సాంకేతిక సహాకారం అందిస్తోంది.  కొన్ని టూల్స్‌...
∙మ్యూజిక్‌ అండ్‌ సౌండ్‌: వీడియోకు ఒక పాట లేదా ఆడియో యాడ్‌ చేయవచ్చు 
∙స్పీడ్‌: రికార్డింగ్‌ స్లోడౌన్‌ చేయడం 
∙టైమర్‌: ఎక్కువ, తక్కువ సమయం తీసుకోకుండా నిర్ణీత సమయంలో ఆటోమెటిక్‌గా రికార్డింగ్‌ ఆగిపోవడం 
∙యాడ్‌ క్లిప్స్‌ ఫ్రమ్‌ ఫోన్‌ గ్యాలరీ
∙బేసిక్‌ ఫిల్టర్లు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top