Smart Watches: స్మార్ట్‌వాచ్‌ వరల్డ్‌.. లైఫ్‌స్టైల్‌ను మెరుగుపరుచు కోవడానికి పనికొచ్చేవే!

Youth Pulse: Youngsters On Smartwatches Became Part Of Lifestyle - Sakshi

మా టైమ్‌ బాగున్నది... బహు బాగున్నది

ఇప్పుడు మనం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన నైమిష గురించి చెప్పుకుందాం. మూడు నెలల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య కేశవ్‌ స్మార్ట్‌వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు. మొదట్లో అది తన ఫ్యాషన్‌ యాక్సెసరీలలో ఒకటి మాత్రమే. అయితే, తరువాత తరువాత అందులోని ఫీచర్‌లను ఉపయోగించడం ద్వారా తన జీవనశైలిలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది నైమిష.

‘మొదట్లో టైమ్‌ చూసుకోవడానికి తప్ప స్మార్ట్‌వాచ్‌ వైపు చూసింది లేదు. ఒకరోజు తీరిక దొరికినప్పుడు స్మార్ట్‌వాచ్‌ వరల్డ్‌లోకి వెళ్లడం ద్వారా ఎన్నో వండర్‌ఫుల్‌ ఫీచర్స్‌ గురించి తెలుసుకొని ఉపయోగిస్తున్నాను. అయితే అవేమీ కాలక్షేపానికి సంబంధించినవి కావు. నా లైఫ్‌స్టైల్‌ను మెరుగుపరుచు కోవడానికి పనికొచ్చేవి’ అంటుంది నైమిష.

పెద్దగా ఆసక్తి చూపించలేదు! కానీ ఇప్పుడు..
2013లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం... స్మార్ట్‌వాచ్‌లు స్వీకరించడానికి యూత్‌ పెద్దగా ఆసక్తి చూపించలేదు! ‘స్మార్ట్‌ఫోన్‌లు ఉండగా, స్మార్ట్‌వాచ్‌లు దండగా’ అన్న వాళ్లే ఎక్కువ. ‘యూత్‌ ఆసక్తి, అనాసక్తులలో మార్పు రావడానికి ఎక్కువ కాలం పట్టదు’ అని అప్పుడే తేల్చారు ‘సెంటర్‌ ఫర్‌ ది డిజిటల్‌ ఫ్యూచర్‌’ డైరెక్టర్‌ జెఫ్రీ కోల్‌. అతడి అంచనాలు నిజం కావడానికి అట్టే కాలం పట్టలేదు.

ఆ మధ్య ఇండోనేసియాలో నిర్వహించిన సర్వేలో యువతలో అత్యధికులు స్మార్ట్‌వాచ్‌లను మెచ్చుకున్నారు. అవి తమకు ఎలా ఉపయోగపడుతున్నదీ చెప్పుకొచ్చారు. నిజానికి ఇది ఇండోనేసియా పరిస్థితి మాత్రమే కాదు ఇండియా పరిస్థితి కూడా.

ఎప్పటికప్పుడూ యూత్‌ అభిప్రాయాలను సేకరించడం ద్వారా కంపెనీలు తమ మార్కెటింగ్‌ కమ్యూనికేషన్‌ స్ట్రాటజీని అభివృద్ధి చేసుకుంటూ కొత్త ఫీచర్స్‌ను తీసుకువచ్చాయి. తీసుకువస్తున్నాయి.

జీవనశైలిలో భాగంగా..
స్టైలిష్‌ లుక్‌ ఇవ్వడంతోపాటు ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌(కేలరీలు, ఎక్సర్‌సైజ్‌ మినిట్స్, స్టాండింగ్‌), వర్కవుట్‌ ట్రాకింగ్, హార్ట్‌రేట్‌ మానిటరింగ్, బ్లడ్‌ ఆక్సిజన్‌ మానిటరింగ్, అబ్‌నార్మల్‌ హార్ట్‌రేట్స్‌ను హెచ్చరించడం, డిస్‌ ప్లే టికెట్స్, బోర్డింగ్‌ పాసెస్, టర్న్‌–బై–టర్న్, అలారమ్స్, టైమర్స్, రిమైండర్స్, ‘డోన్ట్‌ డిస్టర్బ్‌’ అని తెలియజేసే ఫోకస్‌మోడ్, షేర్‌ ఫోటో ఆప్షన్‌... ఇలా ఎన్నో విషయాల్లో స్మార్ట్‌వాచ్‌లు యువతరానికి ఉపయోగపడుతున్నాయి.

ఒకప్పుడు స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి రంగు, డిజైన్‌ల విషయంలో ఆసక్తి చూపే యువతరం ఇప్పుడు బరువు విషయంలోనూ అంతే ఆసక్తి ప్రదర్శిస్తోంది. కొత్త వాచ్‌ మార్కెట్‌లోకి రాగానే ‘కీ స్పెసిఫికేషన్‌’ జాబితాలో వాచ్‌ బరువు ఎన్ని గ్రాములో చూడడం అనేది ఇప్పుడు యువతరం తొలి ప్రాధాన్యతగా మారింది.

పోటీలో భాగంగా యూత్‌ని ఆకట్టుకోవడానికి కంపెనీలు వరల్డ్స్‌ మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీపై దృష్టి పెడుతున్నాయి. తాజా విషయానికి వస్తే న్యూయార్క్‌లో జరిగిన ఒక సమావేశంలో శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 5 సిరీస్‌కు సంబంధించి బయోయాక్టివ్‌ సెన్సర్‌లతో కూడిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ గురించి ప్రకటించింది కంపెనీ.

గెలాక్సీ ఎన్నో సంవత్సరాలుగా స్లీప్‌ టెక్నాలజీపై పని చేస్తోంది. ఎందుకంటే, నిద్రకు సంబంధించిన నిబంధనలు గాలికి వదిలేస్తుంటారు యువతరంలో ఎక్కువమంది. అలాంటి వారికి నిద్రకు సంబంధించిన ఆరోగ్యకరమైన పద్ధతులు అలవాటు చేయడానికి ఇలాంటి టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రయోగాలు, ఆవిష్కరణలు కంపెనీల మార్కెటింగ్‌ స్ట్రాటజీలో భాగమే అయినప్పటికీ వాటి వల్ల యువతరానికి ప్రయోజనం చేకూరుతుంది. ఇది మంచి విషయమే కదా!

చదవండి: గ్యాస్‌ వల్ల కావచ్చని తేలిగ్గా తీసుకున్నాను కానీ! కీమో థెరపీ తీసుకుంటూనే రన్నర్‌గానూ!      

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top