ఖరీదైన ‘వేరబుల్ గ్యాడ్జెట్స్’కి పెరుగుతున్న క్రేజ్
2025 మొదటి ఆరు నెలల్లో 5 కోట్లకుపైగా సేల్స్
స్మార్ట్ రిస్ట్‌బ్యాండ్లు, గ్లాసెస్‌కు అనూహ్య ఆదరణ
ఈ రోజుల్లో చేతి వేళ్లకు, మణికట్టుకు స్మార్ట్ గ్యాడ్జెట్స్ ధరించే ట్రెండ్ పెరిగిపోయింది. చాలామంది చేతులకు స్మార్ట్ వాచ్‌లు కనిపిస్తున్నాయి. ఆరోగ్య స్పృహ ఉన్నవారు స్మార్ట్ రిస్ట్ బ్యాండ్లు, స్మార్ట్ రింగులు వంటివి ధరిస్తున్నారు. చెవుల్లో పెట్టుకునే వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కూడా ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఇలాంటివన్నీ కలిపి.. 2024లో దేశంలో మొత్తం సుమారు 12 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయంటే వాటి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
మనదేశంలో రిస్ట్ బ్యాండ్ సగటు అమ్మకం ధర (ఏఎస్‌పీ) సుమారుగా రూ.12,000 ఉందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇలా వేళ్లకో, మణికట్టుకో ధరించే స్మార్ట్ గ్యాడ్జెట్ల సగటు అమ్మకం ధర ప్రస్తుతం రూ.1,920 వరకూ ఉంది. ధర పెరుగుతున్నా వా టిని కొనడానికి ఎవరూ వెనకాడటం లేదు. 2025లో మొదటి ఆరు నెలల్లో 5 కోట్లకుపైగా ఇలాంటి స్మార్ట్ గ్యాడ్జెట్లు అమ్ముడవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడిప్పుడే స్మార్ట్ రింగ్స్‌కి మార్కెట్ పెరుగుతోంది. అలాగే మెటా, లెన్స్‌కార్ట్‌ల వంటివి ఉత్పత్తులు మార్కె ట్లోకి తీసుకురావడంతో స్మార్ట్ గ్లాసెస్‌కి కూడా ఆదరణ పెరుగుతోంది. రిస్ట్ బ్యాండ్లు కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి.
భారీగా షిప్‌మెంట్లు
2025 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ – జూన్) స్మార్ట్ గ్యాడ్జెట్ల షిప్‌మెంట్లు (రిటైలర్లకు తయారీ సంస్థలు సరఫరా చేసే సంఖ్య) 2.67 కోట్ల వరకు జరిగాయని ఐడీసీ చెబుతోంది. స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ల షిప్‌మెంట్లు రికార్డు స్థాయిలో 118% పెరిగాయి. ఇదే సమయంలో స్మార్ట్ రింగ్స్ సుమారు 75వేలు, స్మార్ట్ గ్లాసెస్ 50వేలకుపైగా మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఈసారి మార్కెట్లోకి వచ్చిన ఇయర్‌వేర్‌లో సింహభాగం వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (టీడబ్ల్యూఎస్) కావడం.. వీటికి పెరుగుతున్న క్రేజ్‌కి నిదర్శనం.
మొదట్లో అదో క్రేజ్
స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకీ, ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లకీ చాలా తేడా ఉంది. ‘వీటిపై మొదట్లో క్రేజ్ ఎక్కువ ఉంటోంది. ఎందుకంటే.. ఆరోగ్య, ఆహార సంబంధ విషయాలపై ఇచ్చే వివరాలు, స్కోర్లు ఆసక్తికరంగా ఉంటాయి. రానురాను.. రోజూ అవే విషయాలను ఆ గ్యాడ్జెట్స్ ఇస్తుండటంతో వాటిని వాడే వారిలో మొదట్లో ఉన్న ఆసక్తి తరవాత ఉండటం లేదు. మొదట్లో అందరూ చూడాలని, అందులోని వివరాలు తెలుసుకోవాలని పెట్టుకునేవారు.. తరవాత్తరవాత అందరూ చూడాలని మాత్రమే వాటిని ధరిస్తున్నారు’ అంటున్నారు టెక్ నిపుణులు. చాలామంది ఇలా బోర్ కొట్టడం వల్ల తమ మొదటి స్మార్ట్ వాచ్‌ను అప్‌డేట్ చేయడం లేదు. ‘చాలా స్మార్ట్ వాచ్‌లు రోజువారీ నడిచిన అడుగుల లెక్క, గుండె కొట్టుకునే రేటు వంటివి తప్ప కొత్త విషయాలు ఉండటం లేదు’ అంటున్నారు వినియోగదారులు.
ఆలోచించి కొంటున్నారు
‘ఇవి వన్‌టైమ్ పర్చేజ్ ఐటెమ్స్‌గా మారిపోతున్నాయి. అంటే స్మార్ట్‌ఫోన్‌ని చాలామంది ఏడాదికొకటి మారుస్తారు. కానీ, స్మార్ట్ వాచ్‌లు, రింగ్‌ల వంటి వాటిని ఒకసారి కొన్నాక... మళ్లీ కొత్తది కొనేందుకు ఇష్టపడటం లేదు. చాలా విషయాల్లో ఈ తరం వారు.. ఒక వస్తువును చూడగానే లేదా దాని గురించి వినగానే కొనేస్తుంటారు. కానీ, ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ల విషయంలో అలా కాదు. ఒకటికి పదిసార్లు ఆలోచించి కొంటున్నారు. అందుకే వీటి ధరలను పెంచాల్సి వస్తోంది. కానీ, ఉత్పత్తిలో ప్రత్యేకత ఉంటే వాటిని ఎంత ధర పెట్టి కొనడాని కైనా వినియోగదారులు సిద్ధపడుతున్నారు’ అని కంపెనీలు చెబుతున్నాయి.


