నవ యువ ఇన్వెస్టార్స్‌

Younger Generation Interested In Online Investment - Sakshi

యూత్‌ పల్స్‌

‘ఎంజాయ్‌ చేద్దాం...దీంతో పాటు పొదుపు కూడా చేద్దాం’ అంటుంది యువతరం. పొదుపు సంగతి పక్కన పెడితే సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ (ఇండియా) లిమిటెడ్‌ లెక్కల ప్రకారం మిలీనియల్స్, జెన్‌–జెడ్‌ నుంచి మదుపు చేస్తున్నవారి సంఖ్య పెరిగింది. కోవిడ్‌ సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకున్న టెక్‌–శావీ యంగర్‌ జనరేషన్‌ ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌లపై అధిక ఆసక్తి ప్రదర్శిస్తోంది.

దిల్లీకి చెందిన ప్రియాంక భాటియా మంచి ఉద్యోగమే చేస్తోంది. అయితే సహ ఉద్యోగులు సొంత ఇల్లు కొనుక్కున్నారుగానీ తాను మాత్రం కొనలేకపోయింది. దీనికి కారణం ఆ ఉద్యోగులకు ఎక్కువమొత్తంలో పొదుపు చేసే అలవాటు ఉండడం. తానేమో బాగా ఖర్చు చేస్తుంది. ‘ఇలా అయితే ఇక కష్టం’ అనుకున్న ప్రియాంక కొత్త అడుగులు వేసింది.

స్టాక్‌ ఇన్వెస్టర్, ప్రాపర్టీ ఇన్వెస్టర్, బిజినెస్‌ కోచ్‌... మొదలైన వారితో మాట్లాడటం, పుస్తకాలు చదవడం, వర్క్‌షాప్‌లకు హాజరు కావడం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకోగలిగింది. ఆ తరువాత స్టాక్‌మార్కెట్‌లోకి అడుగుపెట్టి సక్సెస్‌ అయింది. పొదుపుపై అధికదృష్టి పెట్టింది. ఉద్యోగానికి రాజీనామా చేసి వావ్‌ (ఉమెన్‌ ఆన్‌ వెల్త్‌) ఫైనాన్షియల్‌ కోర్స్‌ను రూపొందించి ‘ఆర్ట్‌ ఆఫ్‌ ఇన్వెస్టింగ్‌’ పేరుతో శిక్షణ ఇస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ప్రియాంకకు ఎంతోమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. వీరిలో ఎక్కువమంది యువతరమే.

ఇండోర్‌కు చెందిన రాజ్‌ షమని డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ మాత్రమే కాదు మంచి ఇన్వెస్టర్‌ కూడా. సోషల్‌ మీడియాలో ఎంతోమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ‘పొదుపు చేయడం అనేది కూడా ఒక కళ. సరిౖయెన పద్ధతిలో పొదుపు చేయడం ఎలా?’ అనే టాపిక్‌పై రాజ్‌ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.

‘పర్సనల్‌ ఫైనాన్స్‌ నుంచి పాసివ్‌ ఇన్‌కమ్‌ వరకు  యువతరం రకరకాల విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంది. అయితే కేవలం ఆసక్తి మాత్రమే సరిపోదు. స్టాక్‌మార్కెట్‌ నుంచి క్రిప్టో కరెన్సీ వరకు అవగాహన లేకుండా దిగితే నష్టాలు మూటగట్టుకోవాల్సి ఉంటుంది.’ అంటున్నారు ఆర్థికనిపుణులు. అయితే యువ ఇన్వెస్టర్లు ‘ఇన్వెస్ట్‌మెంట్‌’ను ఆషామాషీగా తీసుకోవడం లేదు. కేవలం ఉత్సాహంతో మాత్రమే ఇన్వెస్టర్‌ అవతారం ఎత్తడం లేదు. చాలా సీరియస్‌గా ఫైనాన్షియల్‌ రిపోర్ట్స్, న్యూస్‌ ఆర్టికల్స్‌ను చదువుతున్నారు. తమ నిర్ణయాలపై నిపుణుల సలహాలు తీసుకొని వాటిని క్రాస్‌చెక్‌ చేసుకుంటున్నారు.

వాట్సాప్‌లో ‘ఫైనాల్షియల్‌ ఇన్‌ఫో’ అనే గ్రూప్‌లో ఇన్వెస్ట్‌మెంట్, లాస్‌ గురించి చర్చలు జరుగుతుంటాయి. దీన్ని క్రియేట్‌ చేసింది ట్వంటీ ప్లస్‌ యువతరమే. బెంగళూరుకు చెందిన రీతిక ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌. తన దగ్గర ఉన్న చిన్న పొదుపు మొత్తాలు, క్యాష్‌గిఫ్ట్‌లు అన్నీ కలిపి ఇన్వెస్ట్‌ చేసింది. ‘ఏ కంపెనీ బెటర్‌? ఏ విధంగా?’ అనే కోణంలో రకరకాలుగా స్టడీ చేసింది రీతిక. చెన్నైకి చెందిన ఇరవై మూడు సంవత్సరాల హర్షితకు పుస్తకాలు చదవడం అంటే బొత్తిగా ఇష్టం ఉండదు. అయితే ఇటీవల కాలంలో ఆమె చేతిలో ఒక పుస్తకం తప్పనిసరిగా కనిపిస్తోంది.

అదేమీ టైమ్‌పాస్‌ పుస్తకం కాదు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే తన టైమ్‌ను మార్చివేయగల శక్తివంతమైన పుస్తకం. ఆ పుస్తకం పేరు...ది ఇంటిలిజెంట్‌ ఇన్వెస్టర్, రచయిత: బెంజిమిన్‌ గ్రాహమ్‌. 1949లో ప్రచురితమైన ఈ పుస్తకానికి ఇప్పటికీ గ్లామర్‌ తగ్గలేదు. అపర కుబేరుడు వారెన్‌ బఫెట్‌కు బాగా ఇష్టమైన పుస్తకం ఇది. ‘19సంవత్సరాల వయసులో తొలిసారిగా ఈ పుస్తకాన్ని చదివాను. ఇప్పటికీ అది చూపిన దారిలోనే నడుస్తున్నాను’ అంటాడు బఫెట్‌.

‘తెలివైన ఇన్వెస్టరెప్పుడూ వాస్తవికవాది అయి ఉంటాడు. నిరాశవాదుల నుంచి కొని ఆశావాదులకు అమ్ముతాడు’ ‘ఏ గ్రేట్‌ కంపెనీ ఈజ్‌ నాట్‌ ఏ గ్రేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌. ఇఫ్‌ యూ పే టూ మచ్‌ ఫర్‌ ది స్టాక్‌’... బెంజిమిన్‌ గ్రాహమ్‌ ప్రవచించిన ఇలాంటి తెలివైన మాటలను ఇష్టపడుతూనే ఇన్వెస్టర్‌లుగా తమవైన తెలివితేటలను రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది యువతరం.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top