Yohani Diloka de Silva: నా మదిలో మంట రేపావురా

Yohani Shares Manike Mage Hithe Became Viral Overnight - Sakshi

సోషల్‌ స్టార్‌

100 మిలియన్‌ వ్యూస్‌ సాంగ్‌/ మాణికె మగే హితే

ఒక సింహళగీతం మొన్నటి మే నెలాఖరున విడుదలైంది. సెప్టెంబర్‌కు ప్రపంచమంతా కలిసి వంద మిలియన్ల వ్యూస్‌తో నెటిజన్లు చూశారు. కుర్రకారు పదే పదే ఆ పాట పాడుతున్నారు. ఔత్సాహికులు తమ భాషలో ఆ పాటను రికార్డు చేస్తున్నారు. ఒరిజినల్‌ సింహళమే అయినా అనేక భారతీయ భాషల్లో అది డబ్‌ అయ్యింది. 28 ఏళ్ల ర్యాప్‌ సింగర్‌ యోహనీ ఈ సెన్సేషన్‌కు కారణం. ఆమె గొంతులో ఏదో ఉంది. ఆ ఏదో ఏమిటనేదాని కోసం కోట్ల మంది ఆ పాటను వింటూనే ఉన్నారు. ఏమిటి ఆ పాట... ఎవ్వరు ఆ గాయని?

మాణికె మగే హితే
ముదువే నూరా హంగుమ్‌
యావీ.. అవిలేవీ...

ఇదీ ఆ పాట పల్లవి. దీని అర్థం ‘నా మదిలో ఎప్పుడూ నీ తలంపే... మోహజ్వాలలా రగులుతూ ఉంటుంది’ అని అర్థం. యోహనీ ఆ పాటను పాడిన తీరు దానికి కో సింగర్‌ సతీషన్‌ గొంతు కలపడం... ఏదో మేజిక్‌ జరిగింది. అది ఇప్పుడు జగాన్ని ఊపుతోంది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై తెగ వైరల్‌ అవుతున్న పాట ఇది. గతంలో ఒక సింగర్‌కు గుర్తింపు రావాలంటే ఎన్నో పాటలు పాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక్క సరైన పాట పాడితే రాత్రికి రాత్రి స్టార్‌ని చేసేస్తోంది. యోహని అలా ఇప్పుడు శ్రీలంకకు బయట స్టార్‌ అయ్యింది. చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టపడే యోహనీ సింగింగ్‌నే  కెరియర్‌గా ఎంచుకుని ఇప్పుడు ఈ పాటతో ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. 

శ్రీలంక కోయిల
1993 జూలై 30న  కొలంబోలో మేజర్‌ జనరల్‌ ప్రసన్న డిసిల్వా, దినితి డిసిల్వాలకు పుట్టింది యోహని. ఈమెకు ఒక చెల్లెలు ఉంది. తండ్రి ఆర్మీ అధికారి, తల్లి ఎయిర్‌ హోస్టెస్‌ కావడంతో చిన్నతనంలో శ్రీలంకతోపాటు మలేసియా, బంగ్లాదేశ్‌లలో పెరిగింది. లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ అయ్యాక అక్లాడే కంపెనీలో మేనేజర్‌గా చేరింది. ఇక్కడ ఏడాది పనిచేశాక మెల్‌బోర్న్‌ వెళ్లి క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసింది. యోహనీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఎనలేని అభిమానం. ఆ ఆసక్తిని గమనించిన తల్లి ఆ దిశగా ప్రోత్సహించడంతో ర్యాప్, పాప్, క్లాసికల్‌ సాంగ్స్‌ను పాడడం నేర్చుకుంది. పెట్టా ఎఫ్ట్‌కెట్‌ లేబుల్‌ రికార్డింగ్‌తో కలిసి ‘ఆయే’ పాటను పాడి సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టింది. 

ర్యాప్‌ ప్రిన్సెస్‌...
2016లో యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించి కవర్‌ సాంగ్స్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేసేది. వాటికి మంచి స్పందన లభించడంతో తనే స్వయంగా పాడిన పాటలను విడుదల చేసింది. ‘దేవియాంజే బరే’ అనే ర్యాప్‌ పాటంతో యోహనీకి సింగర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి ఆమె తన యూట్యూబ్‌ చానల్‌లో అనేక పాటలను విడుదల చేసింది. వ్యూయర్స్‌ నుంచి మంచి స్పందన లభిస్తుండడంతో పాపులర్‌ బ్యాండ్స్‌తో కలసి మ్యూజిక్‌ షోలలో పాల్గొనేది. తరువాత తమిళ పాటలు పాడుతూ బాగా ఫేమస్‌ అయ్యింది. దీంతో ‘ర్యాప్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ శ్రీలంక టైటిల్‌’ను గెలుచుకుంది. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క తనకెంతో ఇష్టమైన పాటలు పాడుతూ తన యూట్యూబ్‌ ఛానల్లో అప్‌లోడ్‌ చేస్తుండేది. దీంతో యోహనీ పాటలు ఒక్క శ్రీలంకలోనేగాక ఇండియా, బంగ్లాదేశ్, మలేషియాల్లో కూడా బాగా వైరల్‌ అయ్యేవి.  20 లక్షల సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్న ఏకైక శ్రీలంక గాయనిగా రికార్డు స్థాపించింది.  

సింగిల్‌గా పాడిన పాటలేగాక సితా దౌవున, హాల్‌ మాస్సా వియోలే, యావే, ఆయితే వారాక్‌ వంటి ఆల్బమ్స్‌ కూడా చేసింది. వివిధ వేదికలు, సెమినార్‌లలో లైవ్‌ పెర్‌ఫార్మ్స్‌ కూడా ఇచ్చింది. గాయనిగానే కాక పాటల రచయిత, మ్యూజిక్‌ ప్రొడ్యూసర్, వ్యాపారవేత్తగా రాణిస్తోంది. ‘ర్యాప్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ శ్రీలంక’ అయ్యాక  శ్రీలంకలోనే పాపులర్‌ సింగర్స్‌తో కలిసి పనిచేసింది. యోహని పాడిన పాటల్లో ఒక పాట ‘బెస్ట్‌ వీడియో రీమేక్‌’ అవార్డును గెలుచుకుంది. ఇవేగాక రెడ్‌బుల్‌ నిర్వహించే కన్‌సర్ట్‌లలో ఆమె పాల్గొనడం విశేషం. యోహనీ పాడిన పాటల్లో  మాణికే మాగే హితే, యోహనీ మెర్రి క్రిస్టమస్‌ బేబీ, లా రోజ్‌ ఎట్‌లెపైన్‌ వాల్యూమ్‌–1, నలుమ్‌బనయా, హాల్‌ మస్సా వయోలే వయోలే, నషక్షాలే, బుల్మా పాటలు బాగా పాపులర్‌ అయ్యాయి.

మాణికే మగే హితే..
యోహనీ, సతీషన్‌ కలిసి పాడిన ఈ పాటను సెప్టెంబర్‌లో మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌ యష్‌రాజ్‌ ముఖతే ఇన్‌స్టాలో పోస్టు చేసిన వెంటనే మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ వచ్చాయి. తరువాత బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ఈ సాంగ్‌ బీట్‌కు కాలు కదిపినట్లుగా స్పూఫ్‌ వీడియో చేశారు. అప్పటి నుంచి ఈ పాట బాగా వైరల్‌ అయ్యింది. ఇటీవల ఖాళీగా ఉన్న విమానంలో ఎయిర్‌ హోస్టెస్‌ ‘మాణికే మగే హితే’కు డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను  పోస్టు చేయడంతో విపరీతంగా వ్యూస్‌ వచ్చాయి. ప్రస్తుతం ‘మాణికే మగే హితే’ పాట వంద మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది. యోహనీకి ఇన్‌స్ట్రాగామ్‌లో ఐదులక్షల మందికిపైగా ఫాలోవర్స్‌ ఉండడం విశేషం. మీరు ఇప్పటి వరకూ ఈ పాట వినకపోతే వినండి. మళ్లీ వింటారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top