క్లిక్‌ ట్రెండ్‌: యోగా ఫొటో | Sakshi
Sakshi News home page

క్లిక్‌ ట్రెండ్‌: యోగా ఫొటో

Published Tue, Jun 21 2022 6:10 AM

YOGA The Architecture of Peace photographer Michael O Neill special  - Sakshi

జ్ఞాపకాల పదిలానికి ఫొటోని మించిన సాధనం లేదన్నది మనకు తెలిసిందే. ప్రీ వెడ్డింగ్, మెటర్నిటీ, న్యూ బోర్న్‌.. అంటూ ఫొటోగ్రఫీలో రకరకాల ట్రెండ్స్‌ను మనం చూస్తూనే ఉన్నాం. వీటితోపాటు యోగా, ఫిట్‌నెస్‌ పోజెస్‌ ఫొటోగ్రఫీ ఇప్పుడొక ట్రెండ్‌ అయ్యింది. దీనికి సామాజిక మాధ్యమం కూడా ఓ కారణం. ఈ వేడుకకు ఆ ఫొటో తీసుకొని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం చాలా సహజంగా జరుగుతుంటుంది. అందుకు అందమైన, అద్భుతం అనిపించే ఫొటోలు కావాలని కోరుకోని వారుండరు. యోగా సాధనలో తాము సాధించిన విజయాలను నలుగురితో పంచుకోవడానికి ఇప్పుడు యోగా ఫొటోగ్రఫీ కళ తప్పనిసరి అవసరంగా మారిందంటున్నారు నిపుణులు.

యోగా క్లాసులు ఇవ్వడానికి, యోగాలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి ఫొటోలే ఆధారం. అలాగే, కొత్తగా ఫొటోగ్రఫీ నేర్చుకోవడానికి యోగా ఫొటోలు తీయడం అత్యంత సమర్థవంతమైన మార్గాలలో ఒకటి. ఫిట్‌నెస్‌ మీద ఆసక్తి కనబరుస్తున్నవారు తమ శరీరాకృతిని యోగా భంగిమల్లో చూపడానికి ఈ ఫొటోగ్రఫీ ఒక అద్భుతమైన వాహికగా పనిచేస్తుంది. గతంలో యోగా, వ్యాయామం వంటివి చేసి ఆ తర్వాత వదిలేసినవారు ఎప్పుడైనా వీటికి సంబంధించిన ఫొటోలు చూసుకున్నప్పుడు ఒక ప్రేరణగా ఉపయోగపడతాయి.

మొట్టమొదటి డాక్యుమెంటరీ
యోగా సాధన చేయడానికి యోగా క్లాసుల్లో చేరచ్చు. యూట్యూబ్‌లో వీడియోలు చూడచ్చు. ఆన్‌లైన్‌ కోర్సులు, పుస్తకాలు చదివి కూడా ప్రయత్నించవచ్చు. అయితే, యోగా ఫొటోగ్రఫీలో పర్‌ఫెక్ట్‌ అవ్వాలంటే యోగా మీద తీసిన ‘ఆన్‌ యోగా ది ఆర్కిటెక్చర్‌ ఆఫ్‌ పీస్‌’ డాక్యుమెంటరీ చూడాల్సిందే. దీనికి ఫొటోగ్రాఫర్‌గా వర్క్‌ చేసిన ‘మైఖేల్‌ ఓ నీల్‌’ అద్భుతమైన చిత్రణను అందించాడు. పదేళ్లపాటు ఇండియా, టిబెట్, న్యూయార్క్‌లలోని గొప్ప గొప్ప యోగా గురువులతో మాట్లాడి, తీసిన డాక్యుమెంటరీ ఇది. యోగా ఫొటోలు తీయడానికి, తీయించుకోవడానికి ఈ డాక్యుమెంటరీ మంచి పుస్తకంలా ఉపయోగపడుతుంది.

ప్రకృతిలో క్లిక్స్‌... యోగా ఫొటోషూట్‌ కోసం అందమైన ప్రకృతిని మించిన వేదిక మరొకటి లేదు. మనసు, శరీరం ఆహ్లాదంగా ఉండటానికి చేసే యోగా, ఆ ఆనందాన్ని ఒక్క క్లిక్‌తో బంధించడానికి ప్రకృతి దృశ్యాలు అనువైన స్థలాలు. అడవి, బీచ్, పార్క్‌ ఫొటో సెషన్‌కు మంచి వేదికలు.

అనువైన సంధ్యాసమయాలు... సూర్యోదయ, అస్తమయ సమయాలను బేస్‌ చేసుకుంటూ తీసే యోగా ఫొటోలు ఒక కళాత్మకమైన అందాన్ని కళ్లకు కడతాయి. ఈ సమయంలో సాధారణ ఆసనాలను వేస్తూ కూడా ఫొటోలు తీసుకోవచ్చు.

మ్యాట్‌ నీట్‌... మిగతా వాటితో పోల్చితే యోగా ఫొటో సెషనల్‌లో శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ధరించే డ్రెస్‌ అయినా, యోగా మ్యాట్‌ అయినా శుభ్రంగా ఉండాలి.
యోగా ఫొటోలా కాకుండా ఓ కథ చెప్పే విధంగా ఉండాలి. యోగా ఫొటోలు తీయడమంటే ముఖాన్ని షూట్‌ చేయడం కాదు... మెడలో ధరించే పూసలు, పచ్చబొట్టు, వంపులుగా తిరిగిన చేతులు, శరీరం.. ఇలా యోగా అని తెలిసే విధంగా ఫొటో తీయాల్సి ఉంటుంది. యోగా ఫొటోలు తీయాలని ఆ ఒక్కరికే క్లిక్‌ మనిపించ కూడదు. చుట్టూ నేపథ్యాన్ని కూడా కెమెరా కన్నుతో బంధించాల్సి ఉంటుంది.
యోగా ఫొటోగ్రఫీ అనేది ఒక ఆధ్యాత్మికానుభవాన్ని దగ్గర చేస్తుంది. ఇతరులు స్ఫూర్తి పొందేలా చేస్తుంది. యోగా చిత్రకళా విభాగం మిమ్మల్ని ప్రసిద్ధులను చేస్తుంది.

యోగా మెటర్నిటీ
మెటర్నిటీ ఫొటోస్‌ కోసం వచ్చినవారు యోగా ఫొటోస్‌ కూడా తీసుకోవడంలోనూ ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు ఔట్‌లొకేషన్స్‌ని ఇష్టపడుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో సెలబ్రిటీలు తీయించుకున్న యోగా ఫొటోలు  మా వద్దకు తీసుకువచ్చి, అలాంటి పోజులతో ఫొటోలు తీయమని అడుగుతుంటారు. ఫిట్‌నెస్‌ ట్రెయినర్స్‌లోనూ ఇలాంటి ఆసక్తి ఎక్కువ.
– మనోజ్ఞ, న్యూ బోర్న్‌ బేబీ ఫొటో గ్రాఫర్‌

– నిర్మలారెడ్డి

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement