ప్రమాదంలో ప్రపంచంలోనే అతి పురాతన చెట్టు..

Worlds Largest Tree In Danger Due To Wildfire - Sakshi

జనరల్ షెర్మాన్ అనే చెట్టు ప్రపంచంలోనే అతి పె..ద్ద.. చెట్టంట! ఇది కాలిఫోర్నియాలోని సిక్వోయా అండ్‌ కింగ్స్‌ కెన్యాన్‌ నేషనల్‌ పార్కులో ఉంది. ఐతే ప్రస్తుతం ఇది ప్రమాదంలో ఉందట. ఎందుకంటే.. గత నెలలో 9వ తేదీన కురిసిన మెరుపులతో కూడిన గాలివాన తుఫానులో అక్కడి అడవిలో నిప్పురాజుకుని పశ్చిమ భాగంలో చాలా వరకు కాలిపోయినట్లు నివేదికలో వెల్లడించింది. ఐతే ఇప్పుడు 275 అడుగుల ఎత్తున్న జనరల్ షెర్మాన్ చెట్టుకు ఆ మంటలు అంటుకునే ప్రమాదం ఉన్నట్లు ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అగ్నిమాపక సిబ్బంది దీనిని పరిరక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

దాదాపుగా 2200 యేళ్ల నాటి ఈ చెట్టు ప్రపంచంలోనే అతి పురాతనమైన వృక్షంగా పేరుగాంచింది. కాగా గత యేడాది సంభవించిన కార్చిచ్చులో వేలకొద్ది  జనరల్ షెర్మాన్ చెట్లు కాలి బూడిదైపోయాయి. ఇవి కూడా వేల యేళ్లనుంచి ఉ‍న్నఅతిప్రాచీన చెట్లే. ఈ అగ్నికీలలవల్ల అడవులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని పశ్చిమ ప్రాంతంలో మంటలను ప్రస్తుత రోజుల్లో అదుపుచేయడం చాలా కష్టంగా ఉంది. దాదాపు 30 యేళ్ల క్రితం నాటి ఉష్ణోగ్రతతో పోలిస్తే ప్రస్తుతం అక్కడ గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఇటీవలి కాలంలో అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవించడం పరిపాటైపోయింది. 

తాజా సమాచారం ప్రకారం ఈ మంటలు  సిక్వోయా నేషనల్‌ పార్కుకు 1.5 కిలీమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ పార్కులో దాదాపుగా రెండువేల చెట్లు ఉన్నాయి. ఈ అగ్నికీలన్నుంచి చెట్లను కాపాడటానికి అల్యుమినియం చుట్లతో వీటిని కప్పుతున్నారు. అడవిలో మంటలు మరింత పెరగడానికి కారణమయ్యే చెట్లను తొలగించే పనులను అగ్నిమాపక సిబ్బంది ముమ్మరం చేస్తున్నారు.

వాతావరణం వేడెక్కితే సంభవించే పరిణామాలకు నిదర్శనమే కాలిఫోర్నియా కార్చిచ్చు. వీటిని అదుపు చేయలేక, చెట్లను కాపాడుకోలేక అక్కడి ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులు ఇతర దేశాలకు భవిష్యత్తు హెచ్చరికలుగా భావించవచ్చు.

చదవండి: కాలిఫోర్నియా బీచ్‌లో ముడిచమురు లీక్‌.. పర్యావరణానికి తీవ్ర నష్టం!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top