
వివాహమైన ప్రతీ స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. అయితే ఆ యోగ్యత కొందరికి మాత్రం లభించడం లేదు. ఇందుకు ఆమెలో కొన్ని అనారోగ్య కారణాలు, లేదా భర్తలో ఏదైనా లోపమైనా ఉండొచ్చు. వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటిస్తూ మహిళలు గర్భం దాలుస్తున్నారు. అమ్మ కల నెరవేర్చుకుంటున్నారు. ఐవీఎఫ్ విధానం ద్వారా చికిత్స తీసుకుంటున్నారు. నేడు వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
పెరుగుతున్న సంతానలేమి సమస్య
ఇటీవల ఉమ్మడి జిల్లాలో సంతానలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు వందలో ఒకరిద్దరు మాత్రమే సంతానలేమితో బాధపడేవారు. ఇప్పుడు ఆసంఖ్య 20శాతం వరకు ఉంటోంది. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుని గర్భం దాలుస్తున్నారు. కొందరు మాత్రం మూఢ నమ్మకాలతో కాలం వెళ్లదీస్తున్నారు. కాలానుగుణంగా ఇప్పుడు వైద్యంపై అవగాహన పెరిగింది.
గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి సంతాన సాఫల్య కేంద్రాల్లో వైద్యులను సంప్రదించేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌లో కూడా అలాంటి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అత్యాధునిక వసతులు, సౌకర్యాలతో మహానగరాల్లో అందించే వైద్యసేవలు ఇక్కడ అందిస్తున్నారు. కరీంనగర్‌లో పదికి పైగా ఫెర్టిలిటీ కేంద్రాలు (సంతాన సాఫల్య కేంద్రాలు) ఉన్నాయి. ఆయా కేంద్రాలకు ప్రస్తుతం రోజూ 30 నుంచి 40 మందిదాకా చికిత్స కోసం వస్తుంటారు.
సంతానలేమికి కారణాలివే..
ఇటీవల యువతీ యువకులు జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకుంటున్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. దీంతో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. మారిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, మహిళల్లో పీసీఓడీ (అండాశయంలో తిత్తులు), రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రపోవడం, జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం తదితర కారణాలతో సంతానలేమి సమస్య కలుగుతుంది.
ఐవీఎఫ్ అంటే..
చాలామంది సంతానం లేనివారు సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తున్నారు. కానీ అక్కడ ఐవీఎఫ్ పద్ధతి గురించి వారికి అవగాహన ఉండదు. ఈ పద్ధతిలో బిడ్డను జన్మనివ్వాలి అనుకునే దంపతులు ముందుగా దాని గురించి అవగాహన ఉండాలి. అప్పుడే భవిష్యత్‌లో వారి మధ్య అపోహలు తలెత్తకుండా ఉంటాయి.
సాధారణంగా స్త్రీ గర్భధారణ కలగాలంటే మగవారి వీర్యకణాలు ఆడవారి అండంతో కలవాలి. అది పిండంగా రూపాంతరం చెందుతుంది. ఈ విషయంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఐవీఎఫ్ విధానంలో ల్యాబ్‌లో అండకణాలను సంగ్రహించడం చేసి స్పెర్మ్ నమూనాను మెరుగుపరుస్తారు.
ఐవీఎఫ్ ఎప్పడు అవసరమంటే..
సాధారణంగా సంతానం లేనివారికి ఐవీఎఫ్ అవసరం లేదు. ముందుగా వైద్యులను సంప్రదించి సమస్యను వివరించాలి. దీన్ని బట్టి ముందుగా సహజసిద్ధంగా గర్భం దాల్చేలా తగిన చికిత్స, ఔషధాలు అందిస్తారు. సహజ సిద్ధంగా గర్భధారణ కలిగేందుకు అవకాశం లేకుండా ఉన్నవారికి మాత్రమే ఐవీఎఫ్ చికిత్స ప్రారంభిస్తారు.
ముఖ్యంగా ఆడవారిలో ఫెలోపియన్ నాళాలు మూసుకుపోయినప్పుడు, అండకణాలు తక్కువగా ఉన్నప్పుడు, అండాశయ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు, ఎక్కువసార్లు అబార్షన్లు అయినవారికి, క్యాన్సర్ రోగులు, మగవారిలో స్పెర్మ్ నాణ్యత తక్కువగా, పూర్తిగా లేనప్పుడు ఐవీఎఫ్ చికిత్స అవసరం ఉంటుంది.
అపోహలు వద్దు
1978 జులై 25న ఇంగ్లండ్‌లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) అనే కృత్రిమ గర్భధారణ పద్ధతిలో జన్మించిన మొదటి బిడ్డ లూయీస్ బ్రౌన్ అయ్యారు. ఈ విజయానికి గుర్తుగా ఏటా జులై 25న ప్రపంచ ఎంబ్రియాలజిస్ట్ డేగా జరుపుతారు. ఇప్పటికీ చాలామందికి ఐవీఎఫ్ అంటే తెలియని భయం. సంతానం కలిగేందుకు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైనప్పుడు మాత్రమే ఐవీఎఫ్ మార్గాన్ని సూచిస్తాం.
– డాక్టర్ రేఖారాణి, రేఖాసాగర్ ఐవీఎఫ్ సెంటర్
సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు
30 ఏళ్లు దాటిన మహిళలకు సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం ద్వారా ఇప్పటివరకు 8 మిలియన్ల మందికి పైగా జన్మించారు. అయితే ఐవీఎఫ్‌పై చాలామందికి అపోహలున్నాయి. ఐవీఎఫ్‌లోనూ ఐసీఎస్‌ఐ, ఐవీఎం, ఎగ్‌ఫ్రీజింగ్, స్పెర్మ్ ఫ్రీజింగ్, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, ప్రీ ఇంప్లాంటేషన్, జనటిన్ టెస్ట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాయి. ఐవీఎఫ్‌లో ఇచ్చే మందులతోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
– డాక్టర్ రజని ప్రియదర్శిని, రజని ఫెర్టిలిటీ సెంటర్
(చదవండి: తొమ్మిది కాదు.. ఐదో నెలలోనే పుట్టేశాడు.. వండర్ బేబీ!)