నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం | World Biryani Day | Sakshi
Sakshi News home page

నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం

Jul 6 2025 1:23 PM | Updated on Jul 6 2025 1:23 PM

World Biryani Day

భోజన ప్రియులు ఇష్టంగా తినే ఫుడ్‌ బిర్యానీ   

జిల్లాలో విస్తరించిన సెంటర్లు 

వినూత్నమైన పేర్లతో నిర్వహణ

 రూ.79 నుంచి మొదలు  

ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో

బిర్యానీ.. ఈ పేరు వింటే ఎవరికైనా నోరూరిపోవాల్సిందే. భోజన ప్రియులు లొట్టలేసుకుంటూ ఇష్టంగా ఆరగిస్తారు. వివిధ రకాల బిర్యానీలు తయారు చేస్తూ, వినూత్నమైన పేర్లతో పలు హోటల్స్‌ కొలువు దీరుతున్నాయి.  ఇద్దరు ఫ్రెండ్స్‌ కలిసినా, ఫంక్షన్, వేడుక, లంచ్, డిన్నర్‌ సమయంలో బిర్యానీ తింటారు. ప్రతి సంవత్సరం జూలై మొదటి ఆదివారంను ప్రపంచ బిర్యానీ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): బిర్యానీ మాట వింటే చాలు ఎక్కడో ఉన్నవారు సైతం పరుగున వస్తారు. ఘుమఘుమలాడే బిర్యానీని తయారు చేయడంలో అనేక పద్ధతులు ఉన్నాయి. బిర్యానీ అనగానే కేవలం చికెన్‌ బిర్యానీ మాత్రమే కాదు. వెజిటేబుల్, ఆలు, ఎగ్, చేప, రొయ్య, కాజు, మటన్, నాటుకోడి బిర్యానీతో పాటు పలు రకాలున్నాయి. అయితే కొందరు ఇంట్లోనే తయారు చేస్తుండగా, అధికంగా హోటళ్లలో మిత్రులతో కలిసి తింటున్నారు. జిల్లాలోని పలు హోటళ్లలో ప్రతి రోజు దాదాపు ఐదువేల బిర్యానీలు వరకు విక్రయిస్తుండటంతో భోజన ప్రియులు ఎంతగా ఇష్టంగా తింటున్నారో అర్థం అవుతుంది.

జిల్లాలో 200 సెంటర్లు.. 
సిద్దిపేట పట్టణంలో పలు హోటళ్లు కేవలం బిర్యానీ మాత్రమే విక్రయిస్తూ ప్రత్యేకతను చాటుతున్నాయి. దాదాపుగా జిల్లాలో 200 వరకు బిర్యానీ సెంటర్‌లు ఉన్నాయి. మొబైల్‌ బిర్యానీ సెంటర్‌లు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో మధ్యాహ్నం సమయంలో  కొలువు తీరుతున్నాయి. మొబైల్, చిన్న సెంటర్‌లో బిర్యానీ ధర రూ.79 నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే వివిధ హోటల్స్‌ పార్సిల్‌ ద్వారా అందిస్తుండగా, ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్‌ చేసి తెప్పించుకొని తింటున్నారు.

ఆకర్షించే పేర్లతో..
బిర్యానీ విక్రయించే హోటల్స్‌ వివిధ పేర్లతో భోజన ప్రియులను ఆకర్షిస్తున్నారు. జైల్, మండి, ట్రైన్, సూట్‌కేస్, కుండ, మన ఇంటి బిర్యానీ అని ఇలా వివిధ రకాల పేర్లతో నిర్వహిస్తున్నారు.   

మండి బిర్యానీ 
ఇక్కడ నిర్వాహకులు భోజన ప్రియులను కిందే కూర్చోబెట్టి ఒక పెద్ద పాత్రలో బిర్యానీని అందిస్తారు. దానిని మిత్రులందరూ కలిసి ఒకే పాత్రలో తింటారు.  

 ట్రైన్‌ బిర్యానీ... 
రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ పామ్‌ పైకి రైల్‌ వచ్చినట్లు, వ్యక్తి కూర్చున్న టేబుల్‌పైకి చిన్న ట్రైన్‌ ద్వారా ఫుడ్‌ వస్తుంది. టేబుల్స్‌కు సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్‌ తదితర పేర్లు పెట్టారు. ఆహార ప్రియుడు తనకు నచ్చిన పట్టణం పేరు ఉన్న టేబుల్‌పై కూర్చోని బిర్యానీ తింటున్నారు.

జైల్‌ బిర్యానీ 
హోటల్‌నే జైలుగా మార్చి ఫుడ్‌ లవర్స్‌ను ఆకర్షిస్తున్నారు. హోటల్‌కు వచ్చే వారిని జైల్‌ సెల్‌లో పెట్టి బిర్యానీ అందిస్తున్నారు. అయితే ఇక్కడ అడుగుపెట్టగానే జైలునే తలపిస్తుంది. ఆహారం జైలు సెల్‌లో కూర్చున్న వారి వద్దకే సర్వర్‌ వచ్చి వడ్డిస్తాడు. దీంతో ఇలాంటి వింత పేర్లతో పాటు, మంచి నాణ్యమైన బిర్యానీ అందించే హోటల్స్‌కు భోజన ప్రియులు తమ మిత్రులతో కలిసి వస్తున్నారు.

ఇష్టంగా తింటా  
నేను బిర్యానీని ఇష్టంగా తింటా. సిద్దిపేట, గజ్వేల్‌ పట్టణాల్లో అనేక హోటల్స్‌లో తిన్నాను. ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు, స్నేహితులతో కలిసినప్పుడు వారంలో రెండు సార్లు అయినా తింటా. 
– కిష్టారెడ్డి, ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ, గజ్వేల్‌

రోజు 700 పైగా విక్రయిస్తాం 
జిల్లాలో మంచి నాణ్యమైన బిర్యానీని అందిస్తామనే పేరు మాకు ఉంది. ప్రతి రోజు మా హోటల్‌లో దాదాపు 700పైగా విక్రయిస్తున్నాం. విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ ప్రాంతాల నుంచి సిద్దిపేటకు వచ్చే వారు, పట్టణ వాసులు, వ్యాపారులు మా హోటల్‌కు అధికంగా వస్తారు. వారికి ఇష్టమైన బిర్యానీని ఆరగిస్తున్నారు. అధికంగా చికెన్, మటన్, ఫిష్, వెజిటెబుల్‌ బిర్యానీ  విక్రయిస్తున్నాం.    
  – దుర్గరాజు, అక్షయ హోటల్,సిద్దిపేట   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement