breaking news
World Biryani Day
-
నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం
బిర్యానీ.. ఈ పేరు వింటే ఎవరికైనా నోరూరిపోవాల్సిందే. భోజన ప్రియులు లొట్టలేసుకుంటూ ఇష్టంగా ఆరగిస్తారు. వివిధ రకాల బిర్యానీలు తయారు చేస్తూ, వినూత్నమైన పేర్లతో పలు హోటల్స్ కొలువు దీరుతున్నాయి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినా, ఫంక్షన్, వేడుక, లంచ్, డిన్నర్ సమయంలో బిర్యానీ తింటారు. ప్రతి సంవత్సరం జూలై మొదటి ఆదివారంను ప్రపంచ బిర్యానీ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బిర్యానీ మాట వింటే చాలు ఎక్కడో ఉన్నవారు సైతం పరుగున వస్తారు. ఘుమఘుమలాడే బిర్యానీని తయారు చేయడంలో అనేక పద్ధతులు ఉన్నాయి. బిర్యానీ అనగానే కేవలం చికెన్ బిర్యానీ మాత్రమే కాదు. వెజిటేబుల్, ఆలు, ఎగ్, చేప, రొయ్య, కాజు, మటన్, నాటుకోడి బిర్యానీతో పాటు పలు రకాలున్నాయి. అయితే కొందరు ఇంట్లోనే తయారు చేస్తుండగా, అధికంగా హోటళ్లలో మిత్రులతో కలిసి తింటున్నారు. జిల్లాలోని పలు హోటళ్లలో ప్రతి రోజు దాదాపు ఐదువేల బిర్యానీలు వరకు విక్రయిస్తుండటంతో భోజన ప్రియులు ఎంతగా ఇష్టంగా తింటున్నారో అర్థం అవుతుంది.జిల్లాలో 200 సెంటర్లు.. సిద్దిపేట పట్టణంలో పలు హోటళ్లు కేవలం బిర్యానీ మాత్రమే విక్రయిస్తూ ప్రత్యేకతను చాటుతున్నాయి. దాదాపుగా జిల్లాలో 200 వరకు బిర్యానీ సెంటర్లు ఉన్నాయి. మొబైల్ బిర్యానీ సెంటర్లు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో మధ్యాహ్నం సమయంలో కొలువు తీరుతున్నాయి. మొబైల్, చిన్న సెంటర్లో బిర్యానీ ధర రూ.79 నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే వివిధ హోటల్స్ పార్సిల్ ద్వారా అందిస్తుండగా, ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసి తెప్పించుకొని తింటున్నారు.ఆకర్షించే పేర్లతో..బిర్యానీ విక్రయించే హోటల్స్ వివిధ పేర్లతో భోజన ప్రియులను ఆకర్షిస్తున్నారు. జైల్, మండి, ట్రైన్, సూట్‌కేస్, కుండ, మన ఇంటి బిర్యానీ అని ఇలా వివిధ రకాల పేర్లతో నిర్వహిస్తున్నారు. మండి బిర్యానీ ఇక్కడ నిర్వాహకులు భోజన ప్రియులను కిందే కూర్చోబెట్టి ఒక పెద్ద పాత్రలో బిర్యానీని అందిస్తారు. దానిని మిత్రులందరూ కలిసి ఒకే పాత్రలో తింటారు. ట్రైన్ బిర్యానీ... రైల్వే స్టేషన్లో ప్లాట్ పామ్ పైకి రైల్ వచ్చినట్లు, వ్యక్తి కూర్చున్న టేబుల్‌పైకి చిన్న ట్రైన్ ద్వారా ఫుడ్ వస్తుంది. టేబుల్స్‌కు సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ తదితర పేర్లు పెట్టారు. ఆహార ప్రియుడు తనకు నచ్చిన పట్టణం పేరు ఉన్న టేబుల్‌పై కూర్చోని బిర్యానీ తింటున్నారు.జైల్ బిర్యానీ హోటల్‌నే జైలుగా మార్చి ఫుడ్ లవర్స్‌ను ఆకర్షిస్తున్నారు. హోటల్‌కు వచ్చే వారిని జైల్ సెల్లో పెట్టి బిర్యానీ అందిస్తున్నారు. అయితే ఇక్కడ అడుగుపెట్టగానే జైలునే తలపిస్తుంది. ఆహారం జైలు సెల్లో కూర్చున్న వారి వద్దకే సర్వర్ వచ్చి వడ్డిస్తాడు. దీంతో ఇలాంటి వింత పేర్లతో పాటు, మంచి నాణ్యమైన బిర్యానీ అందించే హోటల్స్‌కు భోజన ప్రియులు తమ మిత్రులతో కలిసి వస్తున్నారు.ఇష్టంగా తింటా నేను బిర్యానీని ఇష్టంగా తింటా. సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో అనేక హోటల్స్‌లో తిన్నాను. ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు, స్నేహితులతో కలిసినప్పుడు వారంలో రెండు సార్లు అయినా తింటా. – కిష్టారెడ్డి, ఆర్ అండ్ ఆర్ కాలనీ, గజ్వేల్రోజు 700 పైగా విక్రయిస్తాం జిల్లాలో మంచి నాణ్యమైన బిర్యానీని అందిస్తామనే పేరు మాకు ఉంది. ప్రతి రోజు మా హోటల్లో దాదాపు 700పైగా విక్రయిస్తున్నాం. విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ ప్రాంతాల నుంచి సిద్దిపేటకు వచ్చే వారు, పట్టణ వాసులు, వ్యాపారులు మా హోటల్‌కు అధికంగా వస్తారు. వారికి ఇష్టమైన బిర్యానీని ఆరగిస్తున్నారు. అధికంగా చికెన్, మటన్, ఫిష్, వెజిటెబుల్ బిర్యానీ విక్రయిస్తున్నాం. – దుర్గరాజు, అక్షయ హోటల్,సిద్దిపేట -
World Biryani Day: ఈ బిర్యానీ డే మీకో ఛాలెంజ్!
రుచికి రాజు, రాజులకు రుచికరమైన వంటకం బిర్యానీ!. ఇది కేవలం వంటకం కాదు.. ఓ భావోద్వేగం, ఓ సంస్కృతి, ఓ రుచుల పండుగ! బిర్యానీని తినని వాడు ఉండొచ్చు. కానీ బిర్యానీ గురించి వినని వాడు ఉండడు!. ఈ జులై 6న(జులై తొలిఆదివారం) వరల్డ్ బిర్యానీ డే. బిర్యానీ ప్రేమికులు తమ అభిమాన వంటకాన్ని ఘనంగా ఆస్వాదించాల్సిన రోజు కూడా!..హైదరాబాద్ గల్లీ నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంటీన్ వరకూ.. బిర్యానీ చేసిన గ్లోబల్ ప్రయాణం నిజంగా ఓ అద్భుతం. 2022లో దావత్ బాస్మతి రైస్ సంస్థ ప్రారంభించిన ప్రపంచ బిర్యానీ దినోత్సవం(World Biryani Day 2025) ఇప్పుడు మూడో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ప్రతి సంవత్సరం జులై నెలలోని మొదటి ఆదివారం ఈ వేడుక జరుపుతూ వస్తున్నారు. ఇటు.. సోషల్ మీడియా, అటు.. ఫుడ్ ఫెస్టివల్స్, ఇంకోవైపు రెస్టారెంట్ ఆఫర్లతో బిర్యానీ డే ఓ ఫుడ్ కల్చరల్ సెలబ్రేషన్‌గా మారింది.హైదరాబాద్ బిర్యానీకి రాజధానినిజాం రాజుల కాలం నుంచి బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు రాజభవనాల్లో వండిన ఈ వంటకం, ఇప్పుడు ప్రతి వీధిలో అందుబాటులో ఉంది. సుమారు 50కి పైగా రకాల బిర్యానీలు నిజాం ఆస్థానంలో తయారయ్యేవని చరిత్ర చెబుతోంది. అందులో చేపల బిర్యానీ నుంచి ఊరేడు పిట్ట బిర్యానీ వరకు ఉన్నాయట!బిర్యానీ.. ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని "బిర్యాన్" నుంచి వచ్చింది. దీని అర్థం “ఫ్రై చేయడం” లేదా “వేపడం”. అంటే బిర్యానీకి మూలాలు పశ్చిమాసియాలో ఉన్నా, దానికి అసలైన రుచి మాత్రం భారతదేశమే ఇచ్చింది!ఈ బిర్యానీ డే మీకో ఛాలెంజ్!బిర్యానీ అంటే మీకు ఏ రకం ఇష్టం? హైదరాబాదీ బిర్యానీనా?, లేక మలబార్ బిర్యానీనా?, లక్నోబిర్యానీనా?, లేదంటే కోల్‌కతా బిర్యానీనా?. ఏది అందుబాటులో ఉంటే అదే అంటారా? అయితే సరి!. ఈసారి బిర్యానీ తినడమే కాదు... మీరు ఎప్పుడూ ట్రై చేయని ఓ కొత్త రకమైన బిర్యానీ వండండి. దాని ఫోటో తీసి #WorldBiryaniDay హ్యాష్‌ట్యాగ్‌తో 9182729310 నెంబర్‌కు వాట్సాప్ చేయండి. మీ బిర్యానీ స్టోరీని మాతో పంచుకోండి. అది మీరే వండింది కావొచ్చు.. మీ అమ్మ చేతి బిర్యానీ కావొచ్చు. దానిని ఓ మధురమైన జ్ఞాపకంగా మలిచే ప్రయత్నం మేం చేస్తాం. బిర్యానీ అంటేనే ఒక మాయ!. ఆ మాయకు ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలు ఉన్నాయి. వాటి సంఖ్యను ఖచ్చితంగా చెప్పడం కష్టం, కానీ 100కి పైగా రకాల బిర్యానీలు ఉన్నాయని ఒక అంచనా. వాటిలో కొన్ని ప్రాంతీయ ప్రత్యేకతలతో, కొన్ని దేశీయ వంటకాలతో కలిసినవిగా ఉంటాయి. ప్రతి రకానికి ప్రత్యేకమైన మసాలాలు, వండే పద్ధతి ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన బిర్యానీ రకాలలో కొన్ని: భారతదేశం: హైదరాబాదీ, లక్నో (అవధీ), కోల్‌కతా, మలబార్, అంబూర్, సింధీ, కశ్మీరీ, ఢిల్లీ స్టైల్, చెట్టినాడ్, ఇలా.. పాకిస్తాన్: కరాచీ బిర్యానీ, లాహోరి బిర్యానీ బంగ్లాదేశ్: కాచ్చి బిర్యానీ, తేహారీ ఇరాన్: బఘాలి పలో, జెరేష్క్ పలో (బిర్యానీకి మూలం ఇదేనని భావిస్తారు) ఇండోనేషియా: మలేషియా, నాసి బిర్యానీ మిడిల్ ఈస్ట్ దేశాల్లో.. మాందీ, కబ్సా (పొడిగా ఉండే బిర్యానీ, పొగ వాసనతో..)ఒక్క భారతదేశంలోనే 30కి పైగా ప్రాంతీయ బిర్యానీలు ఉన్నాయి. వాటిలో వాడే మసాలాలు, బియ్యం రకాలు (బాస్మతి, సీరా సాంబా, జిరా సామా), వంట పద్ధతులు (దమ్, కచ్చి, పక్కి), ఆయా శైలుల ప్రభావం (ముగలాయ్, నవాబీ శైలి).. ఇలా ఆధారపడి ఉంటాయి.