పండ్లు, కాయగూరలు నిత్యం తినడం ఆరోగ్యానికి మంచిదని వింటూనే ఉంటాం. మనలో చాలామంది ఆరోగ్య సంరక్షణ కోసం తింటూ ఉంటారు కూడా. అయితే సాధారణంగా భోజనం తరువాత పండ్లు తింటూంటాం మనం. ఇది ఆరోగ్యానికి మేలు చేయదంటోంది తాజా అధ్యయనాలు. ఇలా ఎందుకు? ఎప్పుడు తినాలి? అన్నది బెంగళూరులోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఆదర్శ గౌడ మాటల్లో...
చీకటిపడగానే నిద్ర... కడుపు ఖాళీ అవుతూండగానే ఆకలి అన్నది ప్రకృతి ద్వారా మనకు సహజసిద్ధంగా అందిన లక్షణాలు.. ఇలా కాకుండా.. పగలు నిద్రపోయినా.. ఇష్టానుసారం తిన్నా అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది. ఇది పండ్ల విషయంలోనూ వర్తిస్తుంది. భోజనం తరువాత లేదా భోజనంతో కలిపి తినడం వల్ల పండ్లు ఆరోగ్యాన్ని ఇవ్వవు. ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం..
పండ్లలో మనకు ఉపయోగపడే ఎంజైమ్‌లు.. బొప్పాయిలోని పపెయిన్, అనాసలోని బ్రోమలీన్ వంటివి ఖాళీ కడుపులోనే బాగా పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్థలో ఇతర ఆహార పదార్థాలు ఏవి ఉన్నా.. ఈ ఎంజైమ్‌లు శరీరానికి ఒంటబట్టడం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. భోజనం తరువాత పండ్లు తింటే.. ఈ ఎంజైమ్‌లు వెనుకబడిపోతాయి. తేలికగా జీర్ణమయ్యే చక్కెరలు మాత్రమే శరీరానికి ముందుగా అందుతాయి. అందుకే కడుపారా భోంచేసిన తరువాత రక్తంలోని చక్కెర స్థాయులు హఠాత్తుగా పెరిగిపోవడం. ఈ క్రమంలో ప్రొటీన్లు, కొవ్వుల తరువాత మాత్రమే ఎంజైమ్‌లు జీర్ణమవుతాయి. ఫలితంగా ఇవి చిన్న పేవుల్లోకి చేరే ముందే (పోషకాలన్నీ శరీరానిక అందేది ఇక్కడి నుంచే) పులిసిపోయి పనికి రాకుండా పోతాయి.
తరుణోపాయం...
భోజనం తరువాత పండ్లు తీసుకోవడం సరికాదన్నది స్పష్టం. మరి ఎప్పుడు తీసుకోవాలి? ఉదయాన్నే పరగడుపున మంచిది అంటోంది యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం. ఇలా చేస్తే... రక్తంలో చెక్కర మోతాదు కూడా ఎక్కువగా పెరగలేదని ఈ అధ్యయనం తెలిపింది. అలాగే ఒక పండును ఉదయం తిన్నప్పుడు రక్తంలో విటమిన్ సి, కరొటనాయిడ్ మోతాదులు ఎక్కువగా ఉన్నాయని, అదే పండు సాయంకాలం తిన్నప్పుడు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఈ అధ్యయనం తెలిపింది.
ఇంకోలా చెప్పాలంటే నిద్రకు సమయం ఉన్నట్టే పండ్లు తినేందుకు మంచి సమయం ఒకటి ఉందన్నమాట. ఉదయం పూట తిన్నప్పుడు పండ్లలోని ఫ్రక్టోస్ (ఒకరకమైన చక్కెర) మెరుగ్గా జీర్ణమవుతుంది. దీనికి కారణం ఏమిటో తెలుసుకునేందుకు గ్లైకోజెన్ గురించి అర్థం చేసుకోవాలి. కాలేయంలో ఉంటుంది ఈ పదార్థం. రాత్రిపూట బాగా తగ్గిపోతుంది. శరీరానికి అవసరం కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని తయారు చేసుకోవాలి. ఉదయం పూట తినే పండ్లతో లభించే ఫ్రక్టోస్‌ను నేరుగా గ్లైకోజెన్‌గా మార్చేస్తుంది కాలేయం. కావాల్సినంత గ్లైకోజెన్ ఉంటే మాత్రం కాలేయం ఫ్రక్టోస్‌ను కొవ్వుగా మార్చేస్తుంది. అదన్నమాట విషయం. కాబట్టి ఇకపై పరగడుపునే కాసిన్న పండ్లు మీ పొట్టలోకి పడేశారనుకోండి... చక్కటి ఆరోగ్యం మీ సొంతమయ్యే అవకాశం ఎక్కువవుతుంది.
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా


