ఈరోజున ఎక్స్–రేలు లేని మెడికల్ సైన్స్‌ను ఊహించుకోలేం. ఏదైనా సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్లగానే చేయించే పరీక్షల్లో మొట్టమొదటిది రక్తపరీక్షలైతే.. రెండోది తప్పకుండా ఎక్స్–రే అయి ఉంటుంది. దేహాన్ని కోయకుండా... కత్తిగాటు పెట్టకుండా లోపలి అవయవాల తీరుతెన్నులు తెలుసుకునే ఈ పరీక్ష వైద్యశాస్త్రంలోనే ఓ తిరుగులేని వరదాయిని. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దేహంలోపలి అవయవాలకు గానీ, ఎముకలకు గానీ... ఏ ముప్పు వాటిల్లిందో, ప్రమాదం తాలూకు దుష్ప్రభావమెంతో తెలుసుకోవడంలో ఎక్స్–రేలను మించిన పరీక్షలేదు కదా... అలాంటిది అసలీ ఎక్స్–రేలను తెలుçసుకోవడమే ఓ యాక్సిడెంట్! ఎక్స్–రే అంటే ఏమిటో, దాని వివరాలూ, తీయాల్సింది ఎందుకు, ఎప్పుడెప్పుడు, దాని తాలూకు దుష్ప్రభావాలేమిటి... అవే ఎక్స్–రేలను మరింత తక్కువ మోతాదులో ఉపయోగించి తీసే సీటీ–స్కాన్ ఏమిటి? అదెప్పుడు తీస్తారు వంటి అనేక వివరాలను తెలుసుకుందాం...
ఎక్స్–రే అంటే కూడా ఒక రకం కాంతి. అనంత కాంతి పటలంలో కంటికి కనిపించేది కొంతమేరకు మాత్రమే. ఇక కంటికి కనిపించని కాంతి పుంజాలు... ఇన్‌ఫ్రారెడ్ అనీ, అల్ట్రా వయొలెట్ అనీ, ఎక్స్ రేస్ అనీ ఇలా వేర్వేరుగా ఉంటాయి. విస్తృతమైన రేడియేషన్‌లో కంటికి కనిపించే కాంతి ఒక వేవ్‌లెంగ్త్‌తో (అంటే కాంతి వేవ్‌లెంగ్త్ 380 నుంచి 750 నానో మీటర్ల మధ్యన) ఉంటే... ఈ రకరకాల రేడియేషన్ రూపాలు కొన్ని నిర్దిష్టమై వేవ్‌లెంగ్త్స్‌తో రకరకాలుగా ఉంటాయి. వాటి వేవ్‌లెంగ్త్ తాలూకు ఫ్రీక్వెన్సీలను బట్టి వాటికి ఆయా పేర్లు పెడతారు.
మిగతా రేడియేషన్ల తాలూకు తీవ్రత కాంతి కంటి భిన్నంగా ఉండటంతో పాటు కాంతిలా నిరపాయకరంగా ఉండదు. ఆయా కాంతి కిరణాల తీవ్రత కారణంగా వాటి దుష్ప్రభావమూ తీవ్రంగానే ఉంటుంది. అందుకే వైద్య పరీక్షల కోసం వెలువరించే ఆ రేడియేషన్‌తో కొన్ని ముప్పులూ, దుష్ప్రభావలూ తప్పవు. అయితే వైద్యశాస్త్ర అవసరాల దృష్ట్యా బేరీజు వేసినప్పుడు... వాటి వల్ల కలిగే దుష్ప్రభావం కంటే వాటితో ఒనగూరే మేలు ఎక్కువ అనుకున్నప్పుడు డాక్టర్లు ఈ కిరణాలను ఉపయోగించే ఎక్స్–రే పరీక్ష లేదా సీటీ స్కాన్ చేయించమని సూచిస్తారు. అయితే ఆధునిక వైద్యశాస్త్రవేత్తలు తమ కొత్త కొత్త ఆవిష్కరణలతో ఇప్పుడీ ఎక్స్–రేల దుష్ప్రభావాలను గతం కంటే చాలా చాలా తగ్గించారు. దాంతో ఇప్పుడు ఎక్స్–రేలు చాలావరకు నిరపాయకరమే అని చెప్పవచ్చు.
కనుగొనడమే ఓ యాదృచ్ఛికమైన అద్భుతం!
ఎక్స్–రేలను కనుగొనడమే చాలా యాదృచ్ఛికంగా జరిగింది. ఈ అత్యద్భుతమైన ఆవిష్కారం జరిగిన తీరు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ గాజు సిలిండర్‌లో క్యాథోడ్ కిరణాలను దారిమళ్లించాక... అవి తప్పించుకుపోకుండా ఉంచిన ఫ్లోరెసెంట్ స్క్రీన్ మెరుస్తుండటంతో అక్కడ ఒకరకమైన కిరణాలు పడుతున్నాయని విల్హెమ్ కోనార్డ్ రాంట్‌జన్ అనుకున్నాడు. అకస్మాత్తుగా తన చేతిని అడ్డుపెడితే చేతిలోని ఎముకలు కనిపించాయి. దాంతో తన భార్యను పిలిచి... ఆమె చేతిని కూడా ఆ కిరణాలకు అడ్డుగా ఉంచినప్పుడు ఆమె కూడా తన చేతిలోని ఎముకలు చూసి భయంతో బెంబేలెత్తిపోయింది. అలా చాలా యాక్సిడెంటల్‌గా రాంట్‌జన్ కనుగొన్న ఎక్స్–రేలతో వైద్యచికిత్సలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అంతకుముందు చాలా అసాధ్యంగా భావించిన సంక్లిష్టమైన చికిత్సలు చాలా చాలా సులువయ్యాయి. మరీ ముఖ్యంగా ఎముకలు మొదలుకొని శరీరంలోని కొన్ని భాగాల చికిత్స ఎంతో సులభతర మయ్యింది.
అసలు ఎక్స్–రే అంటే ఏమిటి?
ఏదైనా వస్తువును చూడటానికి కాంతి అవసరమవుతుంది. కానీ నిజానికి ‘కాంతి’ అంటే అనేక వేవ్‌లెంత్ గల రేడియేషన్ తరంగాల కిరణాల్లో అదో చిన్న భాగం మాత్రమే. అందులోని ఇతర వేవ్‌లెంగ్త్ ఉన్న భాగాలు నేరుగా మన కంటికి కనిపించవు. కాంతి కిరణాల కంటే ఈ ఎక్స్–రే తరంగాలు బలమైనవి. కాబట్టి కాంతి మన శరీరాన్ని తాకి వెనుదిరిగిపోతుంది. కానీ ఈ ఎక్స్ కిరణాలు మాత్రం శరీరంలోకి బలంగా దూసుకుపోతాయి. కాంతి ఓ వస్తువును తాకి వచ్చి తిరిగి మన కంటిని చేరినప్పుడు... మనమా వస్తువును చూడగలిగినట్లే... ఈ కిరణాలూ శరీరం లోపలికి వెళ్లి అక్కడి అంతర్భాగాలపై ప్రతిఫలిస్తాయి కాబట్టి... వాటిని రేడియాలజిస్ట్ (రేడియేషన్‌తో పని చేయగలిగే సామర్థ్యం ఉన్న నిపుణులు) మరికొంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, వాటి సహాయంతో చూడగలుగుతాడు. అలాగే ఆ ప్రతిబింబాన్ని ఫొటో తీసి, ఫిల్మ్‌పై ముద్రించగలిగినప్పుడు అది ‘ఎక్స్–రే’ పిక్చర్ అవుతుంది. ఇప్పుడున్న సాంకేతికత సహాయంతో ఆ ప్రతిబింబాన్ని టీవీ మీదగానీ లేదా కంప్యూటర్ తెర మీదగానీ ఒడిసి పట్టగలగడమూ సాధ్యమే.
వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రేడియేషన్‌లు!
ఈ ప్రపంచంలో ప్రతిచోటా రేడియేషన్ ఉండనే ఉంటుంది. సగటున ఒక వ్యక్తి ప్రతి ఏడాదీ 3 ఎమ్‌ఎస్‌వీ రేడియేషన్‌కు గురవుతుంటాడని ఓ అంచనా. అయితే అది సగటు మాత్రమే. కొన్నిచోట్ల రేడియేషన్ తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. మరికొన్ని చోట్ల తక్కువ. ఉదాహరణకు పీఠభూమి (ప్లేటో) ్రపాంతాల్లో ఉండేవారు తమ తోటి కోస్తా (కోస్టల్) ్రపాంతాల్లో ఉండేవారితో పోలిస్తే 1.5. మిల్లీ స్టీవెర్ట్ (ఎమ్‌ఎస్‌వీ... అంటే రేడియేషన్‌ను కొలవడంలో ఉపయోగపడే కొలతల్లో ఒక రకమైన యూనిట్) ఎక్కువగా నేచురల్ రేడియేషన్‌కు గురవుతుంటారు.
అలాగే మనం మన ఇండ్లలోపలే ఉన్నప్పటికీ ఎంతోకొంత రేడియేషన్‌కు గురవుతూనే ఉంటాం. వాతావరణంలోని రాడాన్ గ్యాస్ కూడా ఈ రేడియేషన్ మోతాదులోని మార్పులకు కారణమవుతుంటుంది. రాడాన్ వల్ల రేడియేషన్ పెరుగుతుంది (ఏడాదికి షుమారు 2 ఎమ్‌ఎస్‌వీ). ఒకదేశంలో ఉండే రేడియేషన్‌కీ మరో దేశం తాలూకు రేడియేషన్‌లో కూడా తేడాలుంటాయి. ఉజ్జాయింపుగా ఒక ఉదాహరణ చె΄్పాలంటే... మనం 10 రోజుల పాటు స్వాభావికంగానే ఎంత రేడియేషన్‌కు ఎక్స్‌పోజ్ అవుతామో... ఛాతీ ఎక్స్–రే తీయించుకోవాలనుకున్నప్పుడు కేవలం ఆ కొద్ది క్షణాల్లోనే 10 రోజులకు సరిపడా రేడియేషన్‌ను గురవుతామన్నది నిపుణుల తాలూకు ఓ రఫ్ అంచనా.
సీటీ స్కాన్‌లో ఉండేవీ ‘ఎక్స్–రే’లే!
వైద్య పరీక్షల్లో భాగంగా ‘సీటీ స్కాన్’గా పరిగణించే స్కానింగ్ ప్రక్రియల్లోనూ ఎక్స్–రేలనే ఉపయోగిస్తారు. కాకపోతే వాటినే మరికొంత అడ్వాన్స్‌డ్ ప్రక్రియల్లో ఉపయోగించి ఎక్స్–రే కంటే అదనపు ప్రయోజనాలను సాధిస్తారు. కాకపోతే ఎక్స్–రేతో పోలిస్తే సీటీ స్కాన్‌లో రేడియేషన్ మోతాదులు ఎక్కువ. ఫలితం కూడా ఎక్కువే. ఇందులో రేడియేషన్ తాలూకు మోతాదూ, తీవ్రతా కాస్తంత ఎక్కువ. కాబట్టి తీయించుకోవడంలోనూ డాక్టర్ల సలహాలు, సూచనలు, విచక్షణ అవసరం. అందుకే వారి సలహా లేకుండా పేషెంట్లు తామంతట తాము సీటీ స్కాన్ కోసం పట్టుబట్టడం అంత సరైనది కాదు.
రేడియేషన్‌తో ఎప్పుడూ ప్రమాదమేనా..?
నిజానికి వైజ్ఞానికి ఆవిష్కరణ అన్నది ఎప్పుడూ పదునైన కత్తి లాంటిది. ఆ పదునుతో ఎన్ని సౌలభ్యాలుంటాయో, అన్ని ప్రమాదాలూ ఉంటాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి కొన్ని పరీక్షల తాలూకు మరో కోణాన్నీ చూద్దాం. అవును. రేడియేషన్‌తో కచ్చితంగా ఎంతో కొంత ప్రమాదం ఉండితీరుతుంది. అయితే రేడియేషన్ అంటే అదేదో కేవలం ఎక్స్–రేలలోనే ఉండదు. నిజానికి మన చుట్టూ ఉండే వాతావరణంలోనూ ఎల్లప్పుడూ ఎంతోకొంత రేడియేషన్ ఉంటుంది. కాకపోతే అది మనకు హానికలిగించే పరిమాణంలోఉండకపోవచ్చు. వాతావరణంలో ఉన్న రేడియేషన్ అన్నది మనం తన ఉనికిని గుర్తించేంతగా ఉండదు. అదే... ఎక్స్–రే తీసేచోట లేదా వాటితో పనిచేసే చోట అది ఎక్కువగా ఉంటుంది. మితిమీరిన రేడియేషన్ కారణంగా ఎన్నో అనర్థాలూ, ఆరోగ్య సమస్యలూ వచ్చే ముప్పు ఉంటుంది.
‘రేడియేషన్’ను ఎలా కొలుస్తారంటే....?
ఒక ప్రదేశంలో రేడియేషన్ ఎంత పరిమాణంలో ఉందనే విషయాన్ని తెలుసుకోడానికి లేదా కొలవడానికి ఒక కొలత (యూనిట్) ఉంది. దాని పేరే మిల్లీ సీవెర్ట్ (ఎమ్‌ఎస్‌వీ). అలాగే రేడియేషన్ మోతాదునూ, తీవ్రతలను కొలవడానికీ రెడ్, రెమ్, రోంట్‌జెన్, సీవెర్ట్, గ్రే వంటి యూనిట్లూ ఉంటాయి.
ఈ వేర్వేరు కొలతలతో మనకు ఉపయోగం ఏమిటి?
కాంతి మన శరీరాన్ని తాకి వెనుదిరుగుతుంది. కానీ ఎక్స్–రేలు లోపలికి ఎముకల వరకూ వెళ్తాయి . అలాగే మన శరీరంలో వేర్వేరు అవయవాలు వాటివాటి స్వభావాన్ని బట్టి ఎక్స్–రేలను తమలోకి అనుమతించడం విషయంలో వేర్వేరుగా స్పందిస్తాయి. అంటే... ఎముకల వరకు వెళ్లాలంటే ఒక మోతాదు బలం అవసరం. అలాగే ఊపిరితిత్తులు మెత్తగా ఉంటాయి కదా. వాటిని చూడాలంటే ఎక్స్–రే వేరే మోతాదులో కావాలి. అలా మనం మన దేహంలోకి చూడాల్సిన అవయవాన్ని బట్టి వేర్వేరు మోతాదులో ఎక్స్–రే పరిమాణాన్ని లోపలికి పంపాలి. అలా మనం మన దేహంలో ఫొటో తీయాలనుకున్న అవయవాన్ని బట్టి వేర్వేరు మోతాదుల్లో ఎక్స్–రే కిరణాలను పంపాల్సి ఉంటుంది. అందుకే ఈ రెడ్, రెమ్, రోంట్‌జెన్, గ్రే వంటి కొలతలు అవసరమవుతాయి.
సీటీ స్కాన్‌తోనూ ఇదే ముప్పా ?
ఉంటుంది. ఎందుకంటే... సీటీ స్కాన్‌లోనూ వెలువడే రేడియేషన్ కూడా హానికరమైనదే. అందుకే రేడియాలజిస్ట్‌లు సీటీ స్కాన్ తీసేప్పుడు వాడే రేడియేషన్ తాలూకు తీవ్రతనూ వీలైనంతగా తగ్గించేలా శిక్షణ ΄÷ందుతారు. అందుకే... ఎక్స్–రేగానీ లేదా సీటీ స్కాన్ గానీ తీయించుకోవడం తప్పనప్పుడు ఈ రేడియేషన్ ప్రమాదాలకు భయపడకూడదు. అలాగే మనకు అవసరం లేకపోయినా... రొటీన్ పరీక్షల పేరిట రేడియేషన్ ఇన్‌వాల్వ్ అయి ఉన్న పరీక్షలనూ తరచూ చేయించుకోవడమూ సరికాదు.
ఇదే ఇలాగుంటే మరి ఎమ్మారైతో...?
ఎక్స్–రేలూ, సీటీ స్కాన్‌లతో ఇంత ముప్పు అయితే మరి వీటన్నికంటే మరింత లోతైన ఫలితాలను చెప్పే ఎమ్మారైతో ఎంత ముప్పు కలుగుతుందో అన్న సందేహం వైద్య పరిజ్ఞానం అంతగా లేని సాధారణ ప్రజల్లో కలగవచ్చు. నిజానికి ఎక్స్–రే, సీటీ స్కాన్‌తో పోలిస్తే ఎమ్మారైతో రేడియేషన్ ప్రమాదమే ఉండదు. ఎందుకంటే ఎమ్మారై అంటే ‘మేగ్నటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్’ అని అర్థం. అంటే ఇందులో కేవలం అయస్కాంత బలాన్ని మాత్రమే ఉపయోగిస్తూ, రేడియేషన్ వాడరు కాబట్టి ఎమ్మారైతో అంతటి ప్రమాదాలు ఉండవు.
రేడియేషన్ కిరణాలతో క్యాన్సర్ వంటి వైద్యచికిత్సలు... రేడియో సర్జరీలు!
రేడియేషన్‌తోనూ వైద్యచికిత్సలు సాధ్యమవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో రేడియేషన్ థెరపీ విషయానికి వస్తే గతంలో అది చాలా భయం గొలిపేదిగా ఉండేది. అయితే ఇప్పుడలాంటి దుష్ప్రభావాలు చాలావరకు తగ్గాయి. ‘ర్యాపిడ్ ఆర్క్ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ’ వల్ల కేవలం క్యాన్సర్ కణాలకు మాత్రమే రేడియేషన్ తగులుతుంది. ఇలాంటి చికిత్సల్లో రేడియేషన్ కేవలం క్యాన్సర్ కణాల్ని మాత్రమే తన లక్ష్యంగా చేసుకుంటుంది. అత్యాధునిక ప్రక్రియల సహాయంతో దేహంలోని అత్యంత కీలకమైన అవయవాలైన మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి చోట్ల నిర్భయంగా రేడియేషన్‌ను ప్రసరింపజేయవచ్చు. ఇక ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ‘ఎఫ్ బీమ్’ వల్ల చాలా సురక్షితంగా ‘రేడియోసర్జరీ’ చేయవచ్చు. సాధారణ సర్జరీలో రోగిని ఆసుపత్రిలో చేర్చాలి. కానీ రేడియోసర్జరీలో రోగిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరమే ఉండదు. పైగా రేడియేషన్‌తో చేసేదైనప్పటికీ ఇది పూర్తిగా సురక్షితం.
ఎక్స్–రే ఉపయోగాలేమిటి...?
ఎక్స్–రే వంటి బలమైన కిరణాలు బలంగా శరీరంలో లోపలికి చొచ్చుకుపోతాయి. అవి శరీరంలోని అనేక కీలక అవయవాలను చేరి, ఫొటోలు తీసి... అక్కడి సమాచారాన్ని అందిస్తాయి. దాన్ని ఎక్స్–రే ఫిల్మ్ సహాయంతో నిక్షిప్తం చేసుకోవచ్చు. మనకు తెలిసిందల్లా... ఎక్స్–రే అంటే... ఆ కిరణాల సహాయంతో ఎముకలు విరిగాయా అన్న సమాచారం తెలుస్తుందనే సాధారణ విషయం మాత్రమే. కానీ డాక్టర్లు మాత్రం ఈ ఎక్స్–రే కిరణాల సహాయంతో చాలా రకాల సమాచారమూ, ఫలితంగా ఎన్నో ప్రయోజనాలు ΄÷ందుతారు. ఉదాహరణకు... దేహంలోకి ఓ పైప్‌ను పంపాలంటే... అది దేహంలోకి ఇతర అంతర్గత అవయవాలకూ తగలకుండా సాఫీగా ఎలా పంపగలమని చూస్తారు. అలాగే దేహం లోపల ఏదైనా ఉపకరణాన్ని లేదా పరికరాన్ని అమర్చాలంటే నిర్దిష్టంగా ఎక్కడ అమర్చాలన్న విషయాన్ని ఎక్స్–రేల సహాయంతోనే తెలుసుకుంటారు. ఎక్స్–రేతో ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు సమకూరుతాయి.
ఎక్స్–రేలు సురక్షితమేనా...?
ఒక్కమాటలో చెప్పాలంటే... పూర్తిగా సురక్షితమైతే కాదు. మరెందుకు తీయించుకుంటున్నామనే ప్రశ్న ఆవిర్భవిస్తుంది. అయితే... ఎక్స్–రేలకు ఎక్స్ పోజ్ అయినప్పుడు ఉన్న రిస్క్‌తో పోలిస్తే... నిజంగా మనకు అవసరమైనప్పుడు చేయించిన వైద్యపరీక్షతో మనకు ఒనగూరే లాభం ఎక్కువ కాబట్టి. అందుకే ఎక్స్–రే లేదా ఇతరత్రా రేడియేషన్ సహాయంతో సీటీ స్కాన్ వంటివి తీసేప్పుడు సాధ్యమైనంత తక్కువ రిస్క్‌తో... సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం పోందేలా రేడియాలజిస్టులు పనిచేస్తారు. అలా వారు శిక్షణపోందుతారు. మన ఇంట్లో మామూలు బల్బ్ ఆర్పేశాక... కాంతి మాయం అయినట్లే... ఒకసారి ఎక్స్–రే స్విచ్ ఆఫ్ చేశాక మళ్లీ అక్కడ రేడియేషన్ ఉండదు. కాబట్టి ఎక్స్–రే ప్రక్రియ ముగిశాక అక్కడ అరకొర ఎక్స్–రే దుష్ప్రభావాలు ఉండిపోయి... అవి మనకు హానిచేస్తాయేమో అనే ఆందోళన ఎంతమాత్రమూ అవసరం లేదు. అలా అనుకోవడం మన అపోహ మాత్రమే.
ఎక్స్–రేలు... గర్భవతి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మామూలు వ్యక్తులకే ఎక్స్–రేలతో ఎంతోకొంత హాని ఉందనుకుంటే... మరి గర్భవతి కడుపులో పెరుగుతున్న చిన్నారులకూ ఇంకా ఎక్కువ హాని ఉండనే ఉంటుంది. అందుకే గర్భవతికి ఎక్స్–రే విషయంలో డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆమెకు మందులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక ఫిజీషియన్ ఎంత నిశితంగా వ్యవహరిస్తాడో... ఆమెకు ఎక్స్–రే అవసరమైనప్పుడు ఒక రేడియాలజిస్ట్ అంతే నిశితంగా ఉంటాడు.
అయితే ప్రతి సందర్భంలోనూ బిడ్డకు ఎక్స్–రే తప్పనిసరిగా హానికరంగా పరిణమిస్తుందని కాదు. కాకపోతే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కడుపులోని బిడ్డ ఏ వయసుకు పెరిగింది (అంటే ఏ నెల గర్భం), దానికి హాని చేయకుండా ఎంత మోతాదు ఎక్స్–రేకు గురిచేయవచ్చు... లాంటి అనేక అంశాల మీద ఈ ఎక్స్–రేల తాలూకు ముప్పు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత గర్భవతి తాలూకు తల, చెయ్యి, కాలు, ఛాతీ వంటి భాగాలకు ఎక్స్–రే తీయాల్సివస్తే... ఆమె కడుపులోని బిడ్డ వాటికి నేరుగా ఎక్స్‌పోజ్ అయ్యే ముప్పు అంతగా ఉండదు. కేవలం ఆమె ΄÷ట్టభాగంలో లేదా ΄÷త్తికడుపు భాగాల్లో ఎక్స్–రే తీయాల్సి వచ్చినప్పుడే బిడ్డ రేడియేషన్‌కు ఎక్స్‌పోజ్ అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే మిగతావాళ్లతో పోల్చినప్పుడు ఎంతో అవసరమైతే తప్ప గర్భవతికి ఎక్స్–రే పరీక్ష నిర్వహించరు. ఒకవేళ చేయాల్సి వచ్చినా ఆమెకు చాలా తక్కువ మోతాదులో ఎక్స్–రేలు వాడేలా నిశితమైన జాగ్రత్తలు తీసుకుంటారు.
గర్భవతులకు ఇప్పుడు ఆందోళన అక్కర్లేదు...
ఏదైనా పనిలో రిస్క్ ఉందంటే... అది అన్నిసార్లూ అన్నే అనర్థాలను తెచ్చిపెట్టకపోవచ్చు. ఎక్స్–రే విషయంలోని ముప్పు కూడా అంతే. ఒకవేళ నిజంగా గర్భవతికి ఎక్స్–రే నిర్వహించాల్సి వస్తే అది తప్పకుండా అనర్థాలు తేకపోవచ్చు. కాకపోతే ఆ కిరణాల వల్ల కడుపులోని బిడ్డకు రిస్క్ ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని దాన్ని ఏ మేరకు తగ్గించగలరో... అంత మేరకు తగ్గించేలా రేడియాలజిస్టులు జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి గర్భవతికి నిజంగా ఎక్స్–రే తీయాల్సిన అవసరమైనప్పుడు వారు ఈ విషయంలో మరీ ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే వైద్యపరిశోధనల్లో వచ్చిన ఎన్నో రకాల మార్పులు ఎక్స్–రే ముప్పులనూ గణనీయంగా తగ్గించగలిగాయి.
నిర్వహణ: యాసీన్


